Previous Page Next Page 

మానవత పేజి 2


    ఫాదర్ జాన్ చకితుడైనారు. నిన్నటి ఏరేనా ఇది! నిన్న పొంగింది. పొర్లింది. అందరినీ గడగడ లాడించింది. ఊరిప్రాణం తోకకు తెచ్చింది. ఏసు ప్రభువు ప్రభువులకు ప్రభువు. దేవదూత. అతని మాట వినక తప్పుతుందా? ఈ ఏరు అతనికి ఒక లెక్కా?
    ఏసు ప్రభువు గ్రామాన్ని కాపాడాడు. అతని బిడ్డలను రక్షించుకున్నాడు. ప్రభువుకు ఈ మొర ఎలా వినిపించింది? తన ప్రార్ధన మన్నించాడు. తనను కాపాడాడు. జనాన్ని కాపాడాడు. అవును. తన ప్రార్ధనలో బలం ఉంది-శక్తి ఉంది. తాను ప్రార్ధించకుంటే ఊరు మునిగిపోయేదే. తాను గ్రామాన్ని రక్షించాడు. తానే రక్షించాడా గ్రామాన్ని! అవును తానే....తానే....తానే!
    ఫాదర్ జాన్ నిటారుగా నుంచున్నారు. తల ఎత్తారు, పైకి చూచారు. ఆకాశం కనిపించింది. ముందుకు చూచారు. ఏరు కనిపించింది. పక్కకు చూచారు. ఊడల మర్రి కనిపించింది. తడిసిన మర్రి మొదలు, మర్రి ఊడల్లో చిక్కిన గడ్డీగాదం కనిపించాయి.
    ఫాదర్ జాన్ చిరునవ్వు నవ్వుకున్నారు.
    వరద తగ్గదానికి తానే కారణం అనుకున్నారు.
    ఠీవిగా నడక సాగించారు-తీరాన.
    ఫాదర్ జాన్ కు అటునుంచి వస్తున్న ముకుందం కనిపించారు-దూరంగా- లీలగా. ఫాదర్ జాన్ కు నమ్మకం కలగడంలేదు వస్తున్నది ముకుందంగారని. అందుకు కారణం ఉంది-ముకుందంగారు ఊళ్ళో ఉండక చాలా కాలం అయింది.
    ముకుందంగారిది కలవారి కుటుంబమే. తండ్రీ తాతలు అంతో ఇంతో సంపాదించి పెట్టిపోయారు. ముకుందంగారు కాస్త విలాసపుపురుషుడైనాడు. భార్య వెంకాయమ్మ గారు పరమ సాధ్వి. ముకుందంగారికి నాటకాల పిచ్చి. అందులోనే వారికి చంద్రమతితో పరిచయం అయింది. చంద్రమతి వగలాడి. ముకుందంగారిని కీలుబొమ్మను చేసింది. ఆడించింది. ఆమె ఒకనాడు అలిగింది. ముకుందం గుండె పగిలింది. తనకు నగలు రావాలంది. "ఉస్ ఇంతేనా?" అని బయల్దేరాడు ముకుందం.  ఇంటికి చేరాడు. వెంకాయమ్మగారు కడుపుతో ఉంది. ఆవిడకు నిండు నెలలు. ముకుందం ఆవిడను నగలు అడిగాడు. అప్పటికి మిగిలినవి అవే. ఆమె ఇవ్వనన్నది, ఏడ్చింది, మొత్తుకుంది. ఇచ్చకాలాడాడు. ఆమె ఇవ్వనన్నది. అర్ధరాత్రి నగలు దొంగిలించి బయటపడ్డాడు ముకుందం. కొన్నాళ్ళకు పాపం- ఆమె ఏ దిక్కూ లేకుండా ప్రసవించింది, జానకిని కన్నది. బిడ్డను చూచుకొని బ్రతుకసాగింది. కాలం కత్తుల చక్రంలా కదిలిపోతూంది. ఒకనాడు ఇంటి ముందు బండి నిలిచింది. వెంకాయమ్మ గుమ్మంలోకి వచ్చి నిలుచుంది. బండ్లోంచి ముకుందం దిగాడు. ఆ వెనక చేయి అందించి చంద్రమతిని దించాడు. వెంకాయమ్మ గుండె పురి కట్టుకుంది. జానకిని పట్టుకొని భోరున ఏడ్చింది. ముకుందం భార్యను చీవాట్లు పెట్టాడు. కొట్టాడు. ఆ తరవాత ముకుందం, చంద్రమతి గదిలో దూరి గొళ్ళెం వేసుకొన్నారు. వెంకాయమ్మ గుండెకు గునపం గుచ్చుకొన్నట్టయింది. అంతే! తుదకి బావిలోకి మనుషుల్ని దింపి వెంకాయమ్మ శవాన్ని ముకుందంగారు బయటికి తీయించాల్సివచ్చింది. జానకి తల్లి శవంమీదపడి భోరుమంది. ముకుందంగారు మౌనంగానే భార్య చితికి నిప్పంటించారు. ఇంటికి తిరిగివచ్చి చూస్తే చంద్రమతి లేదు, నగలు లేవు, బట్టలు లేవు, డబ్బు లేదు. ఈ హడావిడిలో ఇల్లు దోచుకుని వెళ్ళిపోయింది. ఊళ్ళో ముకుందంగారిని దయతలచినవా డొక్కడూ లేడు.
    భార్య దినవారాలు అయ్యాక, జానకిని తీసుకొని ఊరువిడిచి వెళ్ళిపోయారు. బుద్ధి తెచ్చుకొని ఆ తరువాత బడిపంతులు ఉద్యోగంలో చేరారనీ, యిదివరకెన్నడూలేనిది దైవభక్తి అధికమయిందనీ విన్నాడు. కొన్నాళ్ళ తరవాత రిటైర్ అయ్యారు. అప్పటికి జానకి పెరిగి పెద్దదయింది. ముకుందరావుగారు తిరిగి స్వంత ఊరిమీద గాలి మళ్ళి కూతురితో తిరిగి వచ్చేశారు.
    ఫాదర్ జాన్ చూసింది ముకుందరావుగారినే. అయినా నమ్మకం కలక్కపోవడానికి కారణం అది. ముకుందంగారు చేరువ అయినాడు.
    "హో! ముకుందంగారా? హోహో! ఎప్పుడూ రావడం? చుక్క ఊడిపడ్డట్లు వచ్చారేం?" చేతులూపుతూ కేకవేశాడు ఫాదర్.
    ముకుందంగారు ఫాదర్ ను పోల్చుకోలేకపోయారు. కొన్ని లిప్తలు. నిర్వీన్నుడైనారు. చూస్తూ నుంచున్నారు. పోల్చుకున్నారు.
    "ఎవరు ఫాదర్ జాన్! ఆఁ గుర్తించలేదు. ఈ మధ్యనే వచ్చాను. ఇహ ఇక్కడే ఉంటాను."
    "అలాగా! బస్తీ వదిలేశారన్నమాట, బావుందా ఇక్కడ?"
    "ఇది మా ఊరు-ఎలా ఉన్న బావుంటుంది, మీరెలా ఉన్నారు?"
    ఇద్దరూ నుంచునే ఉన్నారు. దూరదూరంగా ఉన్నారు.
    "బావున్నాం. ఏసు ప్రభువు దయవల్ల బావున్నాం. మీ అమ్మాయి...పేరు గుర్తులేదు....చాలా చురుకైంది. ఎలా ఉంది?"
    "రాముని దయవల్ల బావుంది. బి.ఏ. చదువుతూ మానేసింది. అయినా ఆడవాళ్ళకి చదువెందుకు?"
    "మీ నమ్మకం మీది. కాని ఆడవాళ్ళు చదువుకోవడం మంచిది. కనీసం సంతానాన్ని తీర్చిదిద్దగలరు."
    "మా జానకి చురుకైందే__ఎంతైనా ఆడపిల్ల-ఒక అయ్యా చేతిలో పెట్టాల్సింది- చాలుననుకున్నా-బి.ఏ. వరకు చదివింది. ఈ చదువులు ఆడవాళ్ళను పాడుచేస్తున్నాయి. నుంచోలేను. ఆ రాతిమీద కూర్చుందాం."
    "పదండి"
    ఇద్దరూ చెరో రాతిమీద కూర్చున్నారు. దూర దూరంగా కూర్చున్నారు. ఎదురు బదురుగా కూర్చున్నారు.
    "ప్రళయం వచ్చిందనుకోండి" -ఫాదర్.
    "ప్రళయమే మరి కాస్తయితే ఊరు మునిగేదే"
    "మా ఏసుప్రభువును ప్రార్దించాం. ప్రళయం నిల్చిపోయింది. వరద ఆగిపోయింది."
    "తప్పు-కానేకాదు-అదే మీలో ఉన్న తెలివి...." లేచి నుంచున్నారు ముకుందంగారు - "ప్రచారం మీకు చాతనవును. వరదను ఆపింది మా రాముడు. ప్రళయాన్ని అడ్డింది మా రాముడు, ప్రళయాన్ని ఆపింది నేను, కావాలంటే మా జానకిని అడగండి" చేతులు ఊపుతూ గట్టిగా అరిచారు.
    "కాదు. ఏమాత్రం కాదు, అలా అనడానికి వీలేలేదు. శిలువలోంచి బయల్దేరి పోయాడు ఏసుక్రీస్తు - నా ముందే - నేను కళ్ళారా చూశాను. ఆయన చర్చిలోంచి బయటికి రాగానే వాన తగ్గిపోయింది. ఏటి దగ్గరికి వెళ్ళారు. ఏటిని చూచారు. అంతే వరద తగ్గిపోయింది."
    "మా రామునికి ఏటిదాకా వెళ్ళాల్సిన ఖర్మ పట్టలేదు. అతడు సర్వాంతర్యామి. పరాత్పరుడు, అలా చేయి చూపాడు. అంతే! అన్నీ తగ్గిపోయాయి. నాముందే అంతర్దానుడైనాడు. ఏసట-ఏసు! ఏసు ప్రళయాన్ని ఆపగలడా? కాకుంటే రొట్టె ముక్క ఇవ్వగలడు."
    "ఏమన్నావ్? మళ్ళీ అను."
    "మీ ఏసు రొట్టెముక్క ఇవ్వగలడు."
    "ఏమన్నావ్?" అని అడుగు ముందుకు వేశాడు ఫాదర్. "మీ రాముడు రొట్టెముక్క కూడా ఇవ్వలేడు."
    "మా రామున్ని అంటావా?" అని కర్ర ఎత్తారు ముకుందంగారు.
    "ఎంత పొగరు? మా ఏసు నంటావా?" అని కర్ర ఎత్తారు ఫాదర్.
    "ఈ కర్ర రామబాణం!"
    "ఈ కర్ర శిలువ!"
    రామబాణం, శిలువ రెండూ కర్రలే! రెండు కర్రలు లేచాయి; రెండు కర్రలు తాకాయి.
    "నువ్వు మూర్ఖుడివి. నాకేమీ చేతకాదు."
    "నువ్వు పెద్ద మూర్ఖుడివి. అసమర్ధుడివి."

 Previous Page Next Page