Previous Page Next Page 

మనసున మనసై పేజి 2


    "సర్లే పోనీ, చేసుకోవడం మానడం తరువాత, అబ్బాయి వస్తానన్నాడు, తీరా వచ్చాక పిల్లను చూపించం అంటే పరువు పోతుంది నీకోసం కాకపోయినా మీనాన్న మర్యాద కాపాడడానికైనా వచ్చి కూర్చో కాసేపు" విరక్తిగా అంది కూతురు వినదని తెలిసి. వాసంతీ ఏదో అనే లోపలే జయంతి విసురుగా బయటికి వెళ్ళిపోయింది. పద్మావతి నిట్టూర్చింది. 'ఆఖరికి దీనిరాత ఎలా తగులడ్తుందో, దీని కంత పొగరేమిటో, ఏం చూసుకునో దానికింత..మిడిసిపాటు' ఉక్రోషంగా అంది పద్మావతి.
    "సర్లే అమ్మా దానికింకా కళ్యాణ ఘడియ వచ్చినట్టులేదు. ఆటైము వస్తే అన్నీ నచ్చుతాయి. అందరూ అందంగా కనపడతారు. మనం దానికేం చెప్పిలాభం లేదు.....' పెద్దకూతురు తల్లిని శాంతపరుస్తూ అనునయించింది.
    "ఆ ఉద్యోగం చూసుకుని మిడిసిపడిపోతుంది. తనేదో అప్సరసననుకుంటుంది. ఇంకొకరికి వంక పెట్టేముందు తన అందం ఏ పాటిదో చూసుకోవాలి. ఇదేం పచ్చగా బంగారం బొమ్మలా ఉందా, ఏదో కాస్త ఛాయ తక్కువైనా కనుముక్కు తీరు ఫరవాలేదు, ఎమ్మేవరకు చదివింది, బ్యాంకు ఉద్యోగం ఈపాటి దానికే ఇలా తైతెక్కలాడిపోతుంది. మా తల్లి యింకా అందంగా వుంటే ఏమయ్యేదో, దీని వరస చూస్తే దానికి పెళ్ళయ్యే రాతున్నట్టు లేదు' అంది నిట్టూర్చి లోపలికెళ్ళింది.
    సాయంత్రం కావాలనే జయంతి అరగంట ఆలస్యం చేసి మరీ వచ్చింది అయినా డ్రాయింగు రూమ్ లో పెళ్ళికొడుకు కూర్చుని కనిపించాడు. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుతున్నారు. 'అదిగో అమ్మాయొచ్చింది-' అంటూ తల్లి లేచింది. జయంతి ఒక్కక్షణం ఏం చెయ్యాలో తోచని దానిలా నిలబడి పోయింది. ఈలోగా అతను లేచి నిలబడి నమస్కారం చేశాడు. జయంతి అప్రయత్నంగానే తనూ నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే తండ్రి లేచి గదిలోకి వెళ్ళాడు. లోపల గదిలోకి వెళ్ళాక ఏదో కోపంగా అనబోతున్న జయంతిని వారిస్తూ, ఆజ్ఞాపిస్తున్నట్టుగా 'ఇప్పుడేం మాట్లాడొద్దు, వెంటనే ఐదునిమిషాల్లో కాస్త తయారై బయటికి రావాలి" అని మరోమాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకటేశ్వరరావు. ఇంక తప్పదన్నట్టు జుత్తు దువ్వుకుని కాస్త పౌడరద్దుకుని ముఖం గంభీరంగా పెట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుంది. 'మా అమ్మాయి జయంతి, ఆంధ్రాబ్యాంకులోనే పని' తండ్రి అన్నాడు.
    "ఏం బ్రాంచండి" అన్నాడు గోపాలకృష్ణ మాట కలపడానికన్నట్టు.
    "హైదర్ గూడా" అంటూ ముభావంగా అని కళ్ళెత్తి చూసింది. అనుకున్నట్లే నలుపు, పెదాలు కూడా నలుపు, నెత్తి మధ్య నాలుగు వెంట్రుకలు రాలిపోతాం అని బెదిరిస్తున్నట్టు మూడొంతుల బట్టతల, ఐదడుగుల ఐదంగుళాలు పొడుగు, కళ్ళజోడు, అతని ఆకారం చూసి తల తిప్పేసుకుంది. ఇంకో పావుగంట ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుని అడిగిన వాటికి నిరాసక్తంగా జవాబిచ్చింది. 'వస్తానండీ, మావాళ్ళతో మాట్లాడి, ఉత్తరం రాయిస్తా' అని లేచాడు గోపాలకృష్ణ. బతుకుజీవుడా అనుకుంది జయంతి. అతనలా గేటు దాటగానే తల్లిమీద ఎగిరిపడింది. 'ఇదిగో యింకోసారి ఇలాంటి వాళ్ళని పిలిచి కూర్చోమంటే చచ్చినా కూర్చోను."
    "ఏం.... అతనికేం లోటొచ్చింది, కాస్త రంగు తక్కువంతే.... ఫామిలీ, చదువు, ఉద్యోగం అన్నీ మంచివే... బరువు బాధ్యతలు లేవు. ఏం మనందరం పచ్చగా వున్నామా' లోపలికివస్తూ తండ్ర్రి అన్నాడు.
    "ఆ... పచ్చగా లేకపోయినా ఇలా తారుడబ్బాలా లేం, అబ్బబ్బ ఆ పెదాలు గోపాలకృష్ణుడే.... పైన బట్టతల ఈ అవతారానికి, ఇంకా ఏం లోటొచ్చిందని అడుగుతున్నారు' హేళనగా అంది జయంతి. తండ్రి ఏదో అనబోయే లోపలే 'ఎక్స్ క్యూజ్ మీ...' అని వినబడి అంతా గుమ్మం వైపు చూసి తెల్లపోయారు. గోపాలకృష్ణ అక్కడ నిలబడి వున్నాడు-
    జయంతి మాటలు అతను విన్నాడన్నది అతని ముఖం చూడగానే తెల్సింది అందరికీ. జయంతి గిల్టీగా చూసి లోపలికెళ్ళిపోయింది. వెంకటేశ్వరరావుగారు మొహాన నవ్వు పులుముకుని .... "ఆ....ఆ.. రండి.... ఏమిటి ఏదన్నా మర్చిపోయారా..." అంటూ ఎదురెళ్ళాడు.
    "జాతకచక్రం అడిగి తీసుకోమన్నారు మానాన్నగారు. మర్చిపోయానని అడగటానికి వచ్చాను.. యిప్పుడింక అవసరం లేదని తెల్సింది లెండి" అదోరకంగా నవ్వి వెనుదిరిగాడు. వెంకటేశ్వరరావు ఏదో అనబోయేంతలోనే అతను గేటు దాటాడు. వెంకటేశ్వరరావు ఆవేశంగా లోపలికొచ్చాడు.
    "దీనికింక ఈ జన్మకి పెళ్ళికాదు. దీనికిదే ఆఖరి సంబంధం నేను చూడటం, పెళ్ళి చేసుకుంటుందో మానుకుంటుందో అదే ఎవడినన్నా చూసుకుంటుందో దానిష్టం. మరింక నాదగ్గిర దాని పెళ్ళి ఊసెత్తద్దు, తెల్సిందా!" భార్యమీద గట్టిగా ఎగిరిపడ్డాడాయన.
    "బాగానే వుంది, దానికది, మీకు మీరు యిద్దరూ మధ్య నన్ను చంపకండి, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నాకూ ప్రాణం విసిగిపోయింది, దీనికి పెళ్ళయ్యే గీత వున్నట్టు లేదు, అందుకే దానికే పెడబుద్దులు, కానీండి ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు....." పద్మావతి చాలా చిరాగ్గా అని లోపలికి వెళ్ళిపోయింది.
    ఇంట్లో కాసేపు శ్మశాన నిశ్శబ్దం. గదిలో జయంతి కాస్త గిల్టీగా ఫీలవుతూ కూర్చుంది. అందరికీ కోపం, విరక్తి వచ్చాయన్నది ఆమెకి అర్ధమైనా, అతను విన్నాడన్న భావానికి తప్ప, తనేదో అతన్ని నిరాకరించి తప్పు చేసిన భావం ఆమెకి కలగలేదు. నచ్చనివాడిని ఎలా చేసుకోవడం. అమ్మ, నాన్న కోసం సర్దుకుపోవాలా, చేసుకొని నచ్చనివాడితో రోజూ కొట్టుకు చావాలా, ఆమె తనని తను సమర్ధించుకుంటూ అనుకుంది.

  Previous Page Next Page