Previous Page Next Page 

ఎర్ర సముద్రం పేజి 2


    స్ట్రగుల్ ఫర్ మియర్ ఎగ్జిస్టెన్స్ లో భాగంగా సామాన్య మానవుడు ఏం చేసినా మూర్ఖత్వం కాదు. కాని మీరు చేస్తున్నది మాత్రం  ముమ్మాటికీ మూర్ఖత్వమే.
    అదే సీట్లో నేను కూర్చుంటే-నా ఎదురుగా మీరు నిల్చుంటే- అప్పుడు సయితం నేను మీలా మాట్లాడను. ఎందుకంటే నేను మూర్ఖణ్ణి కాదు గనుక......" అన్నాడు  స్పష్టంగా. అది కసో, కోపమో, తన స్థితి పట్ల తనకు కలిగిన విరక్తో....ఇదీ అని చెప్పుకోలేని ఒక అతీతమైన స్థితిలో వున్నాడు రవిచంద్ర.
    అయితే ఇప్పుడు ఆవేశం తెచ్చుకోగల సమయమే అయినా భాగ్యరాజ్ మూర్ఖుడు కాదు. డిప్లోమేట్- కనుకే నిగ్రహించుకుంటూ భావరహితంగా వుండిపోయాడు.
    "నీకు బతుకు మీద తీపి లేదా?" అతని గొంతు పరిహసిస్తున్నట్లుగా వుంది.
    "లేదు సార్" అన్నాడు రవిచంద్ర నిర్వికారంగా లోపల అగ్ని పర్వతాలు బద్ధలవుతున్న భావనను ప్రయత్నపూర్వకంగా దాచుకుంటున్నాడు.
    "మరి నిరాశా?!"
    "కాదు........" అని తొట్రుపాటుపడి "కావచ్చు" అని అన్నాడు రవిచంద్ర.
    కాసేపు భాగ్యరాజ్ మౌనంగా రవిచంద్ర కళ్ళవేపు చూశాడు.
    "నీ ప్రాణానికి నేను రెండు లక్షల రూపాయలు విలువ కట్టాను. ఆ క్షణంలో నేనో వ్యాపారవేత్తగా ఆలోచించినా, పూర్ ఇండియన్ లైఫ్ అని నీపట్ల భావించినా ఏ పదివేలో కట్టేవాడ్ని. అసలు రెండు కాదు, ఐదు లక్షలు ఇవ్వాలని వుంది. అందుకు నేను రెడీ.......మొహమాటపడకు......." భాగ్యరాజ్ అన్నాడు.
    "ఎంతన్నది మీ యిష్టం. నా యిష్టం, నా అవసరం రెండు లక్షల దగ్గర ఆగిపోయాయి. అంతకు తగ్గకూడదు పెరిగినా నా కభ్యంతరం లేదు........." చావు ముంచుకువస్తున్న మాటలు తడబడటంలేదు.
    అది ఎదురుగా వున్న పెద్ద మనిషిని ఆశ్చర్యపర్చాలని కాదు...... గుండె అంతగా బండబారినందు వల్లే.
    "చూశావా.......నాకో  తమాషా అయిన అలవాటుంది. నా అవసరానికి అంతగా ప్రాముఖ్యం లేకపోతే పైసల్లోనే వెలకట్టి పని చేయించుకోగలను. అలా కానప్పుడు వందల్నే పైసలుగా లెక్కించి ఇవ్వాలని వుంటుంది. అయితే నా అవసరాన్ని తీర్చే వ్యక్తి అడిగితేనే సుమా........."
    రవిచంద్ర మౌనంగా వింటున్నాడు. అతనికి చెలగాటం- తనకిప్రాణసంకటం- నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. పెదవి మాత్రం విప్పలేదు.
    రవిచంద్ర పోబోయే తన ప్రాణంపట్ల ఆందోళనపడుతూ రేటు పెంచమని అడిగితే బావుండనే భాగ్యరాజ్ శాడిస్టిక్ ఇన్ స్టింక్ట్ తృప్తి పడటంలేదు.
    సీట్లో యిబ్బందిగా కదులుతూ అన్నాడు____" చూడు రవీ____ నువ్వు  నా కోసం చచ్చిపోతున్నావ్. ఆ సింపతీ నీమీద  నాకుంది అందువల్లే నీ ప్రాణాలు విలువ పెంచుతున్నాను. ఇంకో విషయం- నాకు ఇంకొంచెం డబ్బుకావాలి సార్  అని అడగడానికి రేపు ఈ సమయానికి నువ్వుండవు.......మరో విషయం......నువ్వు నాకోసం చచ్చిపోవడంలేదు. నేను నిన్ను హత్య చేసుకోబడతావు. అది హత్యని నీకూ, నాకూ మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళంతా దాన్ని ప్రమాదం అని మాత్రమే  అనుకుంటారు. జాలిపడతారు"- తన తెలివితేటలకు తానే  ఆనంద పడుతున్నాడు తప్ప రవిచంద్ర జీవిరంతో తన జీవితాన్ని ముడిపెట్టుకున్న మరో వ్యక్తివలన రాబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోయాడు భాగ్యరాజ్!!
    "నువ్వు రేపు ఎన్ని గంటలకు చనిపోతున్నావో తెల్సా......?" రవిచంద్రని అడిగాడు.
    "తెలీద్సార్.......నెమ్మదిగా వుంది రవిచంద్ర గొంతు.
    "సరిగ్గా  1-15 నిమిషాలకు. అంటే పట్టపగలు.........."

 Previous Page Next Page