Previous Page Next Page 

ఎలమావితోట! పేజి 2


    ఆ యిద్దరూ బితుకు బితుకు మంటూ బెరుగ్గా తాము నడిస్తే ఆ దారి మైల పడుతుందన్నంత భయంగా లోపలికి వచ్చారు. ఆ యిద్దరూ దగ్గరికి రాగానే "ఎవరూ?" అంది అమ్మమ్మగారు.
    "నానమ్మ! నేను రవిని....ఇది నా చెల్లెలు స్వాతి..."
    "రవివా? అంటే?" కనుబొమలు చిట్లించిందామె.
    "విశ్వం కుమారుడిని..."
    కనుబొమలు తీవ్రంగా బిగుసుకున్నాయ్.
    "ఎందుకొచ్చావ్?" తీవ్రంగా ప్రశ్నించిందామె.
    ఆ ప్రశ్నకి ఆ యువకుడి ముఖం మాడిపోయింది. పక్కనున్న స్వాతి ముఖం మరీపాలిపోయింది...ఒక్క క్షణం పాటు అతనేం సమాధానం యివ్వలేకపోయాడు.
    "వెళ్ళిపో....ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో...." కఠినంగా అందామె.
    "నానమ్మా" దీనంగా పిలిచాడు రవి.
    "నన్నలా పిలవ్వద్దు.....కృష్ణవేణమ్మ నా పేరు...అమ్మగారూ అను...అయినా ఎలా పిలిస్తే నాకేం? నీ పిలుపులు వింటూ కూర్చుందుకి నాకింకేం పన్లేదా? వెళ్ళు వెళ్ళు. ప్రొద్దున్నే ముష్టి వెధవలా వచ్చావు...."
    ఆ మాటలకి రవి హృదయం తీవ్రంగా గాయపడింది. చప్పున కాళ్ళు వెనుదిరిగాయి. "అమ్మమ్మగారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ చిన్నారి చెల్లెలు తప్ప నాకీ ప్రపంచంలో ఎవరూ లేరు. లేకపోతే నే నెప్పుడో హుస్సేన్ సాగర్ లో దూకేసేవాడినే. నేను ఎం.ఏ పాసయ్యాను. కానీ ఉద్యోగం దొరకలేదు. మతం, కులం మార్చుకుంటే చూపిస్తామన్నారు కొందరు. అయినా తుచ్చమైన దానికోసం తరతరాలుగా వస్తోన్న వంశ గౌరవాన్ని నాశనం చేయదలుచుకోలేదు.....ఎలాగయినా బ్రతుకుబండిని లాగొచ్చు కానీ స్వాతి విషయమే."
    "ఏమైంది? సోది చెప్పకు!"
    "దానికి ఆరోగ్యం సరిగా లేదు. ఇక్కడ ఉస్మానియాలో మంచి మంచి డాక్టర్లున్నారు. చూపించినయం చేసుకోవాలని వచ్చాను టికెట్ కి డబ్బుల్లేవు గోల్కొండలో టికెట్ లేకుండా వచ్చాము!"
    అమ్మమ్మగారు ఏమీ అన్లేదు. ఎటో చూస్తోంది ఆమె.
    "నేను మీ బంధువునని చెప్పుకోను. ఒక అనాధగా ఆశ్రయిస్తున్నాను. నా కింత బ్రతుకు తెరువు చూపించి, యీ నా చిన్నారి చెల్లికి నయం చేయిస్తే...."
    "ఊఁ చేయిస్తే...."
    "మా ఇంట్లో మూడు తరాలుగా ఒంటరిగా పూజ లందుకున్న సత్యభామా అమ్మవారిని పచ్చల హారంతో సహా యిచ్చేస్తాను. కృష్ణవేణమ్మగారూ! ఆ హారం అమ్ముకుంటే నా అవసరం తీరిపోతుంది. అయినా ఒకరు చేసిన తప్పుకే యింత అనుభవిస్తున్నాం! ఇంకా ఘోరం చేయాలని లేదు నాకు."
    ఆ మాటలతో కృష్ణవేణమ్మ గారి ముఖం వికసించింది. ఎన్నో రోజులుగా దాగిన ఆనందం గుండెల్లోంచి తన్నుకొచ్చింది. అయినా వంశాచారం, కుల మర్యాద, ఇన్నాళ్ళు చెలాయించిన పెత్తనం దాన్ని పెదవులని దాటి రానివ్వలేదు.
    " నా చెల్లికి బాగు చేయించండి నా కంతే చాలు!"
    "విగ్రహం ఎక్కడ?"
    సూటిగా వ్యవహర్తలా ప్రశ్నించింది. భర్తపోయాక, అల్లుడు నిష్ప్రయోజకుడై వ్యవహారమంతా తన భుజాలపై బడ్డాక యిన్నేళ్ళుగా సాగిస్తున్న అధికారంలో అలవాటుగా ప్రశ్నించింది.
    "బయట కాంపౌండ్ గేటుకి ఆన్చేను....రిక్షాలో తెచ్చాను!"
    అతన్ని పట్టించుకోకుండా, అతని ఉనికినే గుర్తించకుండా విసవిసా నడిచింది ఆమె. కళ్ళు తెరిచి మూసేంతలో గేటులో వుండి చూసింది. గేటుకి ఆనించి, గోనెసంచిలో బిగించిన మూడడుగుల విగ్రహాన్ని అలవోకగా ఎత్తుకుని తిరిగి అదే నడకతో పరుగులాటి నడకతో వచ్చేసింది కారిడార్ లోకి. గూర్ఖా విస్తుబోయిచూస్తున్నాడిదంతా...

 Previous Page Next Page