Previous Page Next Page 

నరుడా ఏమి నీ కోరిక పేజి 2

 

    అతను నేచురల్ గా "గెటౌట్" అని అరిచాడు హిస్టిరియా పేషెంట్ లా ఉగిపోతూ.


    బయటకు వచ్చి "మీ ఆఫీసర్ కు మూర్చ వచ్చింది" అని స్టాఫ్ తో చెప్పాడు. అందరూ తాళాల గుత్తులు , బక్కేట్స్ తో నీళ్ళు పట్టుకెళ్లారు.


    అలా ఆ ఇంటర్ వ్యూని న్యుసేన్స్ చేశాడు.


    ఉద్యోగం లేదన్న చింత కాని, నిరుద్యోగి, అయినంత మాత్రాన గడ్డం పెంచుకుని వ్యవస్థను తిట్టాలన్న ఆలోచన గానీ లెవు శ్రీ చంద్రకు.


    ఏదో ఓ పని వెతుక్కోవడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. టోటల్ గా ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో టైప్!

 

                                                                * * *


    "ఉప్మా అయిందా? దరిద్రపు ఉప్మా. నోరంతా సాగుతుంది. దీనికన్నా జీడి పాకం బెటర్. తొందరగా తెచ్చి నా మొహాన కొట్టు" కోపంగా అరిచాడు గరుడాచలం.


    అరుంధతి కోపంగా ఉప్మా ప్లేటు తీసుకువచ్చి గరుడాచలం వైపు గురి చూసింది గతుక్కుమన్నాడు గరుడాచలం . అన్నంత పని చేసి తన మొహాన విసిరికొడుతుందని అనిపించింది అతనికి అంతకు ముందు జరిగిన అనుభవాలు గుర్తొచ్చి.


    "టేబుల్ మీద పెట్టు" గంభీరంగా అని భార్య రియాక్షన్ కోసం చూశాడు భయంగా.


    అప్పటికి శాంతించి స్టీరియో ఫోనిక్ సౌండ్ తో ఉప్మా ప్లేటు టేబుల్ మీద పెట్టింది.


    'ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లు ఈయన రిటైర్మెంట్ నా చావుకు వచ్చింది. ఆ పోస్టల్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఈయన్ని అప్పుడె రిటైర్ చేయాలా? స్టాంపులు అటించుకోమనో, ముద్రలు వేయమనో మరీ కొన్నాళ్ళు ఉంచుకోవచ్చుగా. రిటైరైన భర్త మీద కోపం పోస్టల్ శాఖ మీద చూపించింది.


    రెండు నెలల క్రితమే పోస్ట్ మాస్టర్ గా రిటైరయ్యాడు గరుడాచలం.


    ప్రతి దానికి వంక పెట్టడం అలవాటు గరుడాచలానికి.


    ఇప్పుడు దానికి తోడు కాస్తంత వాస్తవం కూడా తోడయ్యి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేస్తుంటాడు.


            
                                                                 * * *


    "అమ్మాయ్ అరుంధతి అబ్బాయి ఏం చేస్తున్నాడే?" అడిగింది ఉప్మాను నోట్లో పెట్టుకుని బామ్మ.


    "కన్నకొడుకుని ఇంకా ఏమేం బూతులు తిట్టాలా అని నిఘంటువులో అర్ధాలు వెతుక్కుంటున్నారు" కోపంగా అంది అరుంధతి.


    "ఏంటో నిన్ను చూస్తే కాశ్మీర్ సరిహద్దు సమస్యలా గుర్రుమంటావ్. వాడ్ని చూస్తే శ్రీలంక మేలిటేంట్ లా వుంటాడు. మీరిద్దరూ పోయిన జన్మలో బద్ద విరోధులై ఉంటారు" అంది బామ్మ.

    
    "నువ్వు డైలీ పేపర్లు చదవడం మానేయత్తయ్యా! లేటెస్ట్ పాలిటిక్స్ ని మాకు ముడిపెడతావేమిటి? అసలు నిన్ననాలి అలాంటి కొడుకుని కని నాకు అంటగట్టినందుకు" మండిపడింది అరుంధతి.


    "ఇదేంటి.....ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.....నా మీద ఎటాక్ ప్రారంభించావు. ఏదో నాలుగు సినిమాలు, రెండు ఇంగ్లిషు నవలలు చదువుతూ బ్రతికేదాన్ని" అంది లౌక్యంగా బామ్మ.


    కోడలికి, కొడుకుకు మధ్య లౌక్యంగా వుండడం నేర్చుకుంది ఆవిడ.


    సినిమాలు చూడ్డం, నవలలు చదవడం అలవాటు ఆవిడకు. కొడుకుతో గుడికెళ్ళి వస్తానని చెప్పి మార్నింగ్ షో కి వెళ్తుంది. హరికధకి వెళ్తానని చెప్పి ఫస్ట్ ఫోకి వెళ్తుంది.


    భగవద్గీత మధ్య ఇంగ్లిషు నవలలు ఉంచుకుని చదువుతుంది. అది ఆవిడ క్యారెక్టర్.

 

                                                             * * *


    నీట్ గా క్రాఫ్ చేసుకుని శిధిలావస్థలో వున్న షూకు ఫాలిష్ చేసుకుని ఓసారి అద్దంలో తన మొహం చూసుకుని "ఎంత మొద్దోస్తున్నావు చందు" అంటూ తనను తాను కాంప్లిమెంట్ ఇచ్చుకున్నాడు శ్రీచంద్ర.


    ఈలోగా సన్నగా చిన్న విజిల్ వినిపించింది. కిటికీ లోంచి చూశాడు.


    పిట్టగోడ దగ్గర్నుంచి సత్తిపండు విజిలేసి పిలుస్తున్నాడు. అతను శ్రీచంద్రకు  రైట్ హ్యాండ్ లాంటి వాడు. పొద్దున్నే డైరెక్ట్ గా ఇంట్లోకి వస్తే గరుడాచలం చేత తిట్లు తినాల్సి వస్తుందని , ఇలా పిట్టగోడ దగ్గర నిలబడి విజిలేసే కొత్త విద్య కనిపెట్టాడు.


    వెంటనే కిటికిలో నుంచి సత్తిపండు వైపు చూసి చేయి వూపి 'వస్తున్నా' ఆగమన్నట్లు తనూ విజిలేసాడు.


    "ఇంట్లో సైరన్ కూతలేంటి? ఈ వెధవ ఇంకా కొంపలోనే ఉండి చచ్చాడా?" గరుడాచలం హాలులో నుంచి కేకేశాడు.


    "వాడేక్కడెం ఏడుస్తున్నాడో , మీరేం అంటున్నారో నేను విని చావాలా? బోల్డు పనులున్నాయి" అంది కిచెన్ లో నుంచి గట్టిగా మొగుడికి వినిపించేలా!


    
    "చీ....నిన్ను చేసుకోవడమంత బుద్ది తక్కువ తనం మరోటి లేదు" గరుడాచలం కస్సుమన్నాడు.


    "తెలిసిందిగా.....మరోసారి ఇలాంటి పొరపాటు చేయకండి. నేనూ చేయను" రిటార్ట్ ఇచ్చింది అతని భార్య సతీ అరుంధతి.


    చేతిలో వున్న షూ పాలిష్ డబ్బాతో తలమీద బాదుకున్నాడు శ్రీచంద్ర.


    మరో పాతికేళ్ళు దాటినా ముసలితనం వచ్చి పళ్ళుడిపోయినా వీళ్ళ గొడవ మానుకోరని అర్ధమైంది శ్రీచంద్రకు.


    కిచెన్ లో కెళ్లి ప్లేటులో చల్లారిన ఉప్మాని స్పూన్ తో గబగబా తినేసి చెంబుడు నీళ్ళు తాగి మెల్లగా శబ్దం చేయకుండా హాల్లోకి వచ్చాడు . తండ్రి పేపర్ చదువుతున్నాడు.


    గట్టిగా కళ్ళు మూసుకుని 'వన్....టు....త్రీ" అనుకుని స్ప్రింగ్ లా ముందుకు గెంతి పరుగెత్తాడు చెవులు మూసుకుని.


    వెనగ్గా కొడుకు పరుగెత్తడం చూసి గరుడాచలం తిట్ల పురాణం విప్పాడు. అతని తిట్లు వినిపించనంత దూరం పారిపోయాడు శ్రీచంద్ర.

 

                                                             * * *


    ఇంట్లో నుంచి పరుగెత్తిన శ్రీచంద్ర ఇంటి గేటు దాటాక ఆయాసం తీర్చుకోవడానికి ఒక్క క్షణం ఆగాడు.

    
    లోపల వరండాలో నుంచి తండ్రి తిట్ల దండకం వినిపిస్తోంది.


    "గురూ! భలే ఫాస్ట్ గా, వింటి నుంచి సంధించిన బాణంలా, ఏ.కె. 47 నుంచి దూసుకొచ్చిన తూటాలా, పి.టి. ఉష కజిన్ లా భలే పరుగెత్తుకొచ్చావు ఎందుకంటావు?" తన భూతద్దాల కళ్ళ జోడు నుంచి చూస్తూ అడిగాడు సత్తిపండు.


    అతని వైపోసారి సీరియస్ గా లుక్కేసి-


    "ఇప్పుడది అంత అవసరమంటావా? టెన్షన్ తో నేను పరుగెత్తుకొస్తే డిటెయిల్స్ అడుగుతావా?" అన్నాడు.


    "అది కాదూ గురూ.....నువ్వలా కళ్ళు మూసుకుని వన్....టూ....త్రీ... అంటూ ఇంట్లో నుంచి పరుగెత్తుకోస్తుంటే భలే ముద్దొస్తావ్. ఎందుకంటావ్?" ప్రతి మాట చివర ఎందుకంటావ్.....అని అనడం అలవాటు సత్తిపండుకు.

 Previous Page Next Page