Next Page 

అష్టపది పేజి 1


    
                                 అష్టపది
    
                                                                   ----కురుమద్దాలి విజయలక్ష్మి        
                                   

                                       
  

   ఆడపెళ్ళివారి యిల్లు కళకళలాడిపోతున్నది.
    
    గోవర్ధనరావు లకారాలకి అధిపతి. లక్షాధికారియింట్లో పెళ్ళి అంటే మధ్యతరగతి వారి యింట్లో కన్నా లక్షరెట్లు అందంగా, వేయిరెట్లు ఆనందంగా, అద్భుతంగా వుంటుంది.    
    
    లక్షాధికారి గోవర్ధనరావుకి ఒక్కడే కొడుకు. ఒక్కతే అమ్మాయి. ఇప్పుడు జరిగేది ఆ అమ్మాయి పెళ్ళి.
    
    మగ పెళ్లివారికి విడిది ఎదుటి మేడలో ఏర్పాటు చేశాడు. మగపెళ్ళివారి కనుసన్నల్లో తిరిగేలా పదిమంది నౌకర్లని విడిదిలో వుంచాడు. మగపెళ్ళివారికి వేన్నీళ్ళనుంచి యాస్ప్రో వరకు పెదవి కదిపి అడిగేలోపల అందించడానికి రెడీగా వున్నారు వాళ్ళు.
    
    లడ్లు, జిలేబీ, అరిశెలు పాత పద్దతి. బాసుంది, కట్టకాల్, మేదీలాడ్, బాదంఘీర్, పపూ హల్వా, కోవాపూరీ లాంటి స్వీట్స్ చాలా ఖరీదైనవి అప్పటికప్పుడు వెన్నకాచిన నేతితో తయారు చేస్తున్నారు. వంటకాల ఘుమాయింపు వంద మైళ్ళు కొడుతున్నది.
    
    మోడరన్ దుస్తులు ధరించి సీతాకోక చిలకల్లాగా అమ్మాయిలు అటూ ఇటూ తిరుగుతుంటే ఖరీదైన పట్టు చీరలు ధరించి ఆ రెపరెపలతో ఆడవారు పెద్దరికంగా నగలు ధరించి తమ తమ గొప్పలు ప్రదర్శిస్తున్నారు. సన్నజాజులు, సంపెంగలు, ఒక్కొక్కరి వంటినుంచి ఒక్కొక్క పరిమళం వెదజల్లుతూ ఆ వాసనలు అన్నీకలిసి గమ్మత్తుగా వున్నాయి. గాలిలో తేలి ఎంతో దూరం వ్యాపించి పోతున్నది.
    
    ఆ ఇంట్లో ఎవరికీ పనిలేదు నౌకర్లకీ, దాసదాసీలు తప్పించి. రోబోట్స్ లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. పెళ్ళివారికి, పెళ్ళికి వచ్చినవారికి ఇసుమంతైనా పనిలేదు. అయినా అంతటా వాళ్ళే తిరుగుతూ పెద్ద పని వున్న వాళ్ళలా హడావుడి పడుతున్నారు.
    
    కూతురి మెడలో ఆ మూడు ముళ్ళూ పడకముందే అలసిపోయిన గోవర్ధనరావు తన బెడ్ రూమ్ లో యూ ఫోమ్ బెడ్ మీద ముఖమల్ దుప్పటి మీద మేను వాల్చాడు.    
    
    ఇందిరారాణి గదిలో కాలు పెడుతూనే "ఇక్కడున్నారా మీరు, గంటనించీ మీ కోసం వెతుకుతున్నాను" అంది మూరెడు పొడుగున్న పట్టుచీర అంచుని సరిచేసుకుంటూ.
    
    గోవర్ధనరావు మాట్లాడలేదు. భార్యని విప్పరిత నేత్రాలతో చూస్తున్నాడు.
    
    ఇందిరా రాణి బొద్దుగా, తెల్లగా, మామూలు హైటుతో వుంటుంది. మనిషి అందమైనది. యాభయ్యో పడిలో పడినా ఆకర్షణీయంగా కానవస్తుంది. కొంత డబ్బు తీరు, మరికొంత వస్తుతః వున్న అందము, హుందాతనము.    
    
    ఇందిరారాణి మబ్బురంగు పట్టుచీర జరీ ముద్ద లోంచి తీసినట్లు దగ్గర దగ్గర జరీపూలున్నది కట్టుకుంది. మ్యాచింగ్ బ్లవుజ్ ధరించింది రవ్వల గాజులు, రవ్వల ముక్కు పుడక, రవ్వల దిద్దులు, మెడలో కెంపుల హారంతో ధగధగ మెరిసిపోతున్నది. పెద్ద ముడి చుట్టుకుని పూలు చుట్టుకుంది.
    
    "ఏమిటి మాట్లాడరు?" ఇందిరారాణి అడిగింది.
    
    "నిన్ను చూస్తున్నాను" గోవర్ధనరావు చెప్పాడు.
    
    "ఆ విషయం వేరే చెప్పాలా? మిమ్మల్ని చూస్తేనే తెలుస్తున్నది. తీరుబడిగా పడుకున్నారు. ఆడపెళ్ళి వారం అన్న విషయం మర్చిపోయారా?"
    
    "లేదు లేదు పెళ్ళికూతురు తండ్రివన్న విషయం కూడా గుర్తుంది" గోవర్ధనరావు చిరునవ్వుతో జవాబు చెప్పాడు.
    
    భర్తకి దగ్గరగా వచ్చి బెడ్ మీద కూర్చుని తగ్గు స్వరంతో అంది "నాకు భయంగా వుందండి"    

    
    "ఎందుకు ఇందూ!"
    
    "ఈ పెళ్ళి సవ్యంగా అవుతుందో లేదో నని..."
    
    "వీడెవడు? నీ భర్త అంతవరకే తెలుసు నీకు. వీడు సామాన్యుడు కాడు. గోవర్ధనరావు ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. చిటికెన వేలు కూడా కదపకుండా అన్ని ఏర్పాట్లూ ఎంత పకడ్బందీగా చేశానో చూడు భయపడకు అన్నీ సవ్యంగా జరుగుతాయి. బైటనుంచి చీమ లోపలికి రాదు. లోపలనుంచి చీమ బైటికి పోదు. సరేనా!"
    
    "శీతల్ ముఖం చూస్తే భయంగా వుందండి."
    
    "బలవంతంగా పెళ్ళి చేస్తున్నామని కోపం."
    
    "కోపంలో ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే?"
    
    "అఘాయిత్యం చేసుకోవడానికి అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వము. ఆ ఏర్పాట్లు అన్నీ ఎక్కడి కక్కడ ఏర్పాటు చేశాను. నీవు మాత్రం ముఖంలో ఎటు వంటి ఫీలింగ్స్ చూపకు".

 

    "అలాగే మీరు లేచి ఓసారి మగ పెళ్ళివారి వద్దకు వెళ్లి ఏమన్నా కావాలేమో అడిగిరండి అన్నీ సవ్యంగా అందుతున్నాయో లేదో కనుక్కోండి."
    
    "నేనా?"
    
    "నేనా అంటే అర్ధం ఏమిటి? అయ్యో గోవర్ధనరావు గారూ! కాసేపు మీరు మీ పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యము మర్చిపోవాలి. ఆడపిల్ల తండ్రిగా వ్యవహరించండి...."

Next Page