TeluguOne - Grandhalayam
Nestham Neepere Nishshabdham

                           

                      నేస్తం నీ పేరే నిశ్శబ్దం

 

                                                                             కొమ్మనాపల్లి గణపతిరావు

 

                         

 

 

    "కోటాను కోట్ల క్షణాల పరిష్వంగంతో రూపుదిద్దుకున్న కాలమా! అమీబా నుంచి అనంత విశ్వం దాకా చొచ్చుకుపోయిన నువ్వు అనాదివని మాత్రమే కాదు, లిప్తిలపసిడి శకలాల పారాణితో నింగి చరణాలను రంజింపజేసే నేలవని తెలుసు.....నువ్వు గతితప్పిన ఘడియలో ఇతిహాసాలని పరిహసంతో ఆహుతి చేసి చితిగా మారిన చరిత్ర పుటం నడుమ వాల్మీకి వ్యాసర్షులని సమాధి చేయగల చేవగాలదానివని కూడా తెలుసు.

 

    నీ గొప్పతనాన్ని నేనెప్పుడో అంగికరించానే.....నీ కనురెప్పల కటకటాలనుంచి రాలిపడ్డ కవితలా బ్రతకాలనుకుంటున్నానని నీకు నివేదించానే......మరెందుకు ఉన్నట్టుండి దూరమయ్యవ్! నేను యీ నేలపై అడుగుపెట్టింది ఎప్పుడైనా గానీ అజ్ఞానశిలగా బ్రతుకుతున్న నేను అయినంత జ్ఞాన శిల్పంగా మారింది నులివెచ్చని ఉలితాకిడితోనేగా.....

 

    నిన్నెలా మరువగలనమ్మా....

 

    కడలిస్వప్నంలో నుంచి ఎగిసిపడే కెరటంలా ప్రతిరాత్రి నా తలపుల తలుపుల వాకిట నిలబడి.....ప్రణవంలా......ప్రత్యూషపవనంలా పలకరిస్తూ యుగాంతపు యుగళగీతంలా తోడుంటానని మాటిచ్చావే.....మరెందుకు అదృశ్యమయ్యావ్.....

 


    నీ సంగమ సంగీత ఝురి నుంచి జాలువారిన గమనంలా .....నీ కనురెప్పలు మాటున దాగిన ఛిలిపి తమకంలా నిన్నటిదాకా నిన్ను అలరించానే.....

 

    నీ ఆలోచనల కాన్వాసు మీద నా అనుభవాల ఆకృతుల్ని అందంగా చిత్రీకరించి ఆద్యంతాలు లేని మన సంస్కృతీ నుదుట నువ్వు పెట్టిన సంతకాల్ని భావితరపు సౌఖ్యనగరాల చొరస్తా' లో ప్రతిష్టించలనుకుంటే ఎందుకు నన్ను గాయపరిచి మాయమయ్యావ్.

 

    వద్దు నేస్తం.....

 

    నువ్వు ప్రకృతి జడలో వాడిపోని 'విరి' గానే మిగిలాలి తప్ప'ఆవిరి'వై మృతిస్మృతిలా మా బ్రతుకుల్ని శాసించకు.

 

    నువ్వు అర్ధంకాని 'వేదాని' వై నా దేవుడి పాలభాగాన పేరుకున్న 'స్వేదాని' వై నా మాకు అనవసరం కానీ నువ్వు కనిపించని ఖనిజంలా కాకా స్పూర్తినందించే నిజంలా మా ముందు వుండటాన్నే మేం మనసారా కోరుకుంటాం.

 

    అయినా నీ శక్తి అపారమని నీకు మాత్రం తెలిదు. ఇంకిపోయిన నదిలా నువ్వు అప్పుడప్పుడు మమ్మల్ని భ్రాంతిలోకి నెత్తినా గానీ నువ్వు తలుచుకుంటే కానిదేముంది. మబ్బులకుండల్ని నీలో నింపుకోగలవు. మరుక్షణం మానవాళి దాహం తీర్చగల మంచినీటి సముద్రంగా మారగలవు."

 

    ఎవరో పిలిచినట్టయి చదువుతున్న వీక్లీలో నుంచి తల పైకెత్తి చూశాడు ధన్వి.

 

    హాలంతా ఇంటర్యూ కొచ్చిన అభ్యర్ధులతో నిండిపోయి వుంది.

 

    "ఇంటర్య్వులు మొదలైనట్టున్నయి సర్"

 

    ఆ మాటన్నది ధన్వి సమీపంలో కూర్చున్న ఓ అభ్యర్ధి. " అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను."

 

    "థాంక్యు" అంటూ విక్లినీ ఎదురుగా వున్న టిపాయి మీద వుంచాడు ధన్వి....టక్ చేసుకుని నలగని 'టై' తో ట్రిమ్ గా వున్న తన సమీప అభ్యర్ధి చెమటతో తడిసిపోతున్నాడు టెన్స్ గా......

 

    "గ్రూప్ వన్ సర్విస్ ఇంటర్వ్యూ కదండి" అన్నాడా అభ్యర్ధి ధన్వి అడగకుండానే.....

 

    "గుడ్' అభినందనగా చూశాడు ధన్వి. "సైకాలాజిలో పి.జి. చేశారా?"

 

    "మీకెలా తెలుసు సర్?" అప్రతిభుడిలా అడిగాడా వ్యక్తీ.

 

    "నేను మీ గురించి ఏమనుకుంటున్నానో నన్ను అడక్కుండానే గుర్తించారు. మీకు పట్టిన చెమట గ్రూప్ వన్ సర్వీసెస్ ఇంటర్వ్యూ టెన్షన్ మూలంగా అంటూ "ఎక్స్ ప్లనేషన్ యిచ్చారు."

 

    ఆ అభ్యర్ధి యిప్పుడు కంపించడం మొదలుపెట్టాడు. ఏ క్షణంలో అయినా ఉరికంబం ఎక్కబోయే ఖైదిలా,


    
     "ఇలా ఇంటర్వ్యూ కెళ్ళడం తోలిసారా?"ధన్వి అడిగాడు.

 

     గొంతు తడారిపోతున్నట్లు అతను దిక్కులు చూస్తుంటే......నిజానికి అడిగింది యిబ్బంది పెట్టాలని కాదు.....ఎందుకో అతడ్ని చూస్తుంటే ధైర్యం చెప్పాలనిపించింది.

 

    "మీకు తొలిసారి కాదనుకుంటాను" ధన్వి అంత నిబ్బరంగా వుండటం నచ్చలేదేమో "డెఫినెట్ గా అయ్యుండదు....అసలు మీరు ఇంటర్వ్యూ కని వచ్చి లీజర్ గా వీక్లీ సీరియల్ చదువుతున్నప్పుడే అనిపించింది......"ఇంకా విశ్లేషించేవాడే కాని తడబడిపోయాడు. "నీరసం సీరియల్ చాలా బాగుంది కదూ? బహుశా అందుకే చదివుంటారు."

 

    మృదువుగా నవ్వాడు ధన్వి.....పాతికేళ్ళ వయసులో దూకినా గానీ లోతుతెలీని లోయలా అనిపించే ధన్వికి యిలాంటి అనుభవాలు కొత్తకాదు. "నేను ఆ సీరియల్ చదివింది మీలాగే ఎవరో బాగుందని చెప్పాక మాష్టారు."

 

    "ఎవరు చెబితేనేం మొత్తానికి బాగుందిగా?" ఏ క్షణంలో అయినా పేలే బాంబు పక్కన కూర్చున్నట్టు మాటిమాటికి ఇంటర్వ్యూ  బోర్డు ఆఫీసు ద్యారం కేసి చూస్తూ వున్నాడా అభ్యర్ధి. "అబ్బ...ఏం భావుకత్వం సర్....ఎంత బాగా రాసిందావిడ."

 

    "బాగున్నది రచన కాదు."       


Related Novels