TeluguOne - Grandhalayam
Pranaya Prabamdham


            
THINGS TURNOUT BEST FOR THE PEOPLE WHO MAKE THE BEST OF THE WAY THINGS TURNOUT.
    
                                                                                                    -TONY STEIN    
    
    
                                                 ప్రణయ ప్రబంధం
    
                                                                         ----కొమ్మనాపల్లి గణపతిరావు
    

    
                                   

 
    "సో, డియర్ ఫ్రెండ్స్! చివరగా నేను చెప్పేదేమిటంటే ఈ రాష్ట్రంలో ఎన్నో యూనివర్శిటీలు, కాలేజీలు, స్కూల్స్-అంతేగాక మేధావులూ పుష్కలంగా వున్నా-రాష్ట్ర స్థాయి ఐక్యూ టెస్ట్ లో వరుసగా మూడవసారి ఫస్ట్ ప్లేస్ సంపాదించిన కుమారి ప్రబంధ మన యూనివర్శిటీకే గర్వకారణం. అంతేకాదు- కేవలం రెండుసార్లు మాత్రమే నోబుల్ ప్రయిజ్ అందుకున్న మేడమ్ క్యూరీకన్నా మేధావిగా మనం అంగీకరించాలని తెలియజేస్తూ, ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఖ్యాతి గడించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను...."
    
    ఉపన్యాసంలో అంతవరకూ మాట్లాడిన సుధీర్ గ్లాసులో మిగిలిన లిక్కర్ ని గడగడా తాగేసి సమీపంలోని బేరర్ ట్రేలోని మరోగ్లాసు అందుకున్నాడు.
    
    కరతాళ ధ్వనులతో ఆ భవంతి ప్రతిధ్వనించింది.
    
    తనను అభినందిస్తూ చుట్టుముట్టిన యువకులకేసి సగర్వంగా చూస్తూ రాయంచలా నడుస్తూంది కుమారి ప్రబంధ.
    
    నిజానికి అది సన్మానసభ కాదు. రాత్రి ఎనిమిదిగంటల సమయంలో విశాఖపట్టణంలోని అఫీషియల్ కాలనీ బంగళాలో ప్రబంధ అన్నయ్య శౌరి ఏర్పాటుచేసిన ఓ గెట్ టుగెదర్.
    
    ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వాసుదేవరావు కూతురయిన ప్రబంధ ఆంధ్రా యూనివర్శిటీ సోషియాలజీ విద్యార్ధిని. నిజానికి ప్రబంధ కిలాంటి సోషల్ టుగెదర్స్ అంటే గిట్టవు కాని పొలిటికల్ సైన్స్ లో పీ.జీ చేస్తున్న శౌరి తమ అంతస్తుని ప్రదర్శించాలని అప్పుడప్పుడూ ఏర్పాటుచేసే ఫంక్షన్సులో ఇలా అందర్నీ కలుస్తూ ఉంటుంది.
    
    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురునన్న ఆలోచనతో రాజసంగా బ్రతికే ఆమెకు స్నేహితులంటూ లేరు. అయినా తన స్నేహంకోసం వెంపర్లాడే జనాన్ని చూస్తూ చాలా ముచ్చటపడుతుంది.
    
    భాగ్యనగరంలో తండ్రితోబాటు వుండకుండా వైజాగ్ లో అన్నయ్యతో ఇదే బంగళాలో వుండటంలో ప్రత్యేకించి కారణంలేదు. కాని, ఈ రాష్ట్రంలో తమకంటే అందరూ అల్పులే అయినప్పుడు తను ఎక్కడ వుంటేనేం అని కూడా ఆలోచిస్తూ వుంటుంది.
    
    తన స్థాయికి తగ్గట్టు తన అందం కూడా చాలా అరుదయినదన్నది ఆమెకున్న మరో బలమయిన నమ్మకం.
    
    అలాంటి స్వాతిశయం శౌరికీ వుంది. కాని దాన్ని మరో పద్దతిలో ప్రదర్శిస్తూంటాడతను.
    
    ఇప్పటి రాజకీయాల్లో అడుగుపెట్టడానికి విద్యాలయాలే మంచి సోపానాలుగా భావించడంతో, కాలక్షేపంగా చదువుతూన్న ఫైనలియర్ విద్యార్ధి అయిన శౌరి, ఇప్పటికి రెండుసార్లు యూనియన్ ప్రెసిడెంటు గా ఎన్నిక కావడమేగాక, తన రాజసాన్ని అడపాదడపా ఇలాంటి ఫంక్షన్సు ఏర్పాటు చేయడం ద్వారా నలుగురిముందూ ప్రదర్శిస్తూంటాడు.
    
    ఏం చేయాలో తెలీనంత డబ్బు, ఏదోలా పబ్లిసిటీ కోరుకునే మనస్తత్వం ఇవి రెండూ ఈరోజు చెల్లి ఘనవిజయాన్ని పండగలా చేసుకోవాలన్న తలంపుకి కారణం కావడంతో తనకు ఆత్మీయులయిన విద్యార్ధినీ విద్యార్ధులను ఆహ్వానించి కాక్ టెయిల్ పార్టీ ఏర్పాటుచేశాడు.
    
    దూరంగా సముద్రపు హోరు.
    
    బంగళా ఆవరణలో నియాన్ లైట్లకాంతి.
    
    ప్రబంధ అందంతోబాటు ఆమె మేధనీ ప్రస్తుతిస్తున్న స్టూడెంట్స్.
    
    అమ్మాయిలంతా ఆమెతో వుత్సాహంగా కబుర్లు చెబుతుంటే-కొందరు విద్యార్ధులు అలవాటుగా బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు.
    
    కేకలు... నవ్వులు.... కేరింతలతో వాతావరణం వేడెక్కిపోతూంది.
        
    అవసరానికి మించిన అతిశయోక్తులతో ఇందాక ఉపన్యసించిన శౌరి మిత్రుడు సుధీర్ ప్రబంధని మరింత ఆకట్టుకోవాలనుకున్నాడేమో నెమ్మదిగా అమ్మాయిల ముందుకొచ్చి ప్రబంధని చూస్తూ అన్నాడు..." క్షమించాలి. మీకున్న టాలెంట్ గురించి ఇంకా వివరంగా చెప్పాలనుకుంటూ కొంతే చెప్పగలిగాను. నిజానికి మేడమ్ క్యూరీతో పోల్చడం కూడా మీ స్థాయికి తగ్గది కాదేమో. అయినా మీ మేధను సరిగ్గా అంచనా వేయలేని నిస్సహాయతో, లేక గగుర్పాటో మేడమ్ క్యూరీ స్థాయికి దిగజారిపోయాను."
    
    "ఇట్సాల్ రైట్!" పరవశంతో భుజాల్ని ఫ్రగ్ చేసింది.
    
    ఈ చర్చ అక్కడ ఓ మూల తాగుతున్న ఓ వ్యక్తిని చురుక్కుమనిపించింది.
    
    "క్యూరీకన్నా మీరు బ్యూటిఫుల్ గా వుంటారని తెలుసు. ఆమాట చెబితే మీరు హర్టవుతారేమో అని సంశయంగా దాటేశాను." సుధీర్ మరో అస్త్రాన్ని సంధించాడు-"నన్ను క్షమించాలి..."
    
    రాగరంజితమయిన మొహంతో "ఇట్స్ ఓకే" అంది ప్రబంధ మరింత గర్వంగా.
    
    మూడో పెగ్గు తాగి మూల నిలబడ్డ వ్యక్తి ఇప్పుడు ముందుకొచ్చాడు తూలుకుంటూ.
    
    "వాగటానికి సరిహద్దులేమిటి సుధీర్? చెప్పేయాల్సింది" సుధీర్ కి ఓ చురక అంటించిన ఆ వ్యక్తి ప్రబంధని చూస్తూ అన్నాడు- "పేరు సూరి. ఫిజిక్స్ లో పీజీ చేస్తున్నాను. మీ అన్నయ్య స్నేహితుడ్ని."
    
    "సో వాట్?" అది ప్రబంధ పెడసరంగా.
    
    ట్రాన్స్ లోకి జార్చే ఓ అద్భుతమైన సన్నివేశంలో అతడు జోక్యం చేసుకోవడం ఆమెకు నచ్చలేదు.
    
    సూరి మృదువుగా నవవాడు "వాస్తవాన్ని అభినందించడాన్ని అడ్మిరేషన్ అంటారు. అతిశయోక్తులతో బుజ్జగించడాన్ని ఫ్లాటరింగ్ అంటారు."
    
    "లేదు సూరీ...." కంగారుపడ్డాడు సుధీర్. "నేను వాస్తవాన్ని అభినందించాను తప్ప ఫ్లాటరింగ్ చేయలేదు."

Related Novels