TeluguOne - Grandhalayam
Ounante Kadantaa


                                     ఔనంటే కాదంటా...
        
                                                                  ---బలభద్రపాత్రుని రమణి

    
                                   
  

         జీవితం ఒక పెద్ద ఫిక్షన్ నవలలాంటిది! పుస్తకాల్లో, సినిమాల్లో చూసి అసహజం అని గోలపెట్టిన సంఘటనలే నిజజీవితంలో జరిగితే చాలా మామూలుగా తీసుకుంటాం.
    
    ఆమె సముద్రం దగ్గరగా కూర్చుని వుంది.
    
    అయినా కెరటాల హోరు ఆమెకు వినపడటంలేదు.
    
    అంతగా ఆలోచనల్లో మునిగిపోయి వుంది!
    
    గాలికి నుదుటిమీద వాలి చిరాకుపెడుతున్న ముంగురుల్ని కూడా పట్టించుకోకుండా శిల్పంలా కూర్చొని వుంది.
    
    ఆ అందం, ముగ్ధత్వం వాటితో పోటీపడే పరువం చూస్తుంటే ఆ అమ్మాయి అలా కూర్చోవడానికి కారణం తప్పకుండా ప్రేమలో పడటమే అనిపిస్తుంది.
    
    కానీ అది తప్పు అభిప్రాయం!
    
    ఆమె ప్రేమరాహిత్యంతో బాధపడుతోంది.
    
    అవసరాన్ని బట్టి వేషాలు మారుస్తూ జీవిత రంగస్థలంమీద నటించేస్తున్న నటుల నిజమైన ముఖాలు తెలీక బాధపడుతోంది. ఆ బాధావీచికలు ఆమెముఖంలో కనిపించిపోతున్నాయి.
    
    ఆమె గబగబా సముద్రంవైపు అడుగులు వేయసాగింది.
    
    పాలనురగలాంటి అలలు ఎగసిపడుతూ ఆమెని వెనక్కి తోసేస్తున్నా ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, జంకూ బొంకూ లేకుండా ముందుకి అడుగెయ్యడానికే ప్రయత్నిస్తోంది.
    
    ఇంకా కొద్దిదూరం వెళితే ఏం జరిగేదో....
    
    కానీ ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
    
    ఆమె ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే ఓ యువకుడు ఆమెని రెండుచేతుల్తో పైకి ఎత్తేసి వేగంగా ఒడ్డుకి తీసుకొచ్చి ఇసుకమీద పడుకోబెట్టేశాడు.
    
    ఆమె ఎంత ఆశ్చర్యానికి లోనయిందంటే కనీసం ప్రతిఘటించలేక పోయింది.
    
    ఆ యువకుడు ఆమె జాకెట్టుకీ చీర కుచ్చెళ్ళకీ మధ్యన చెయ్యేసి బలంగా నొక్కబోతుంటే..... అప్పుడు అరిచిందామె!
    
    "ఏయ్.... ఏం చేస్తున్నావ్?"
    
    అతను చేస్తున్న పనాపి ఆమెవైపు సీరియస్ గా చూశాడు.
    
    ఆమె లేచి కూర్చుంటూ "యూ ఇడియెట్..... హౌ డేర్ యూ... నన్ను నీ ఇష్టం వచ్చినట్లు టచ్ చేయడానికి!" అంది.
    
    ఆమె మాట పూర్తి చేసేలోపే చెంప చెళ్ళుమనిపించాడు అతను.
    
    ఈసారి ఆమె కళ్ళల్లో కోపంకన్నా విస్మయం హెచ్చుగా కదలాడింది. చెంప పట్టుకుని అతనివైపు మాట రానట్లు చూస్తూండిపోయింది.
    
    ఆమెని కొట్టినచేతిని ఓసారి చూసుకుని అతను ప్యాంటుకి తుడిచేసుకున్నాడు. పెద్ద గిల్టీఫీలింగ్ ఏం లేకుండా "జీవితంలో ఆడపిల్లమీద చెయ్యి చేసుకోకూడదనుకున్నాను.....జీవితం మొదట్లోనే తప్పేట్లు చేశావు" అన్నాడు.
    
    ఆమె అప్పటికి తేరుకుని "నీకెంత ధైర్యం? మొదట నన్ను టచ్ చేశావు. తర్వాత కొట్టావు. ఇప్పుడు నీ అభిప్రాయాలూ, నిర్ణయాలూ ముచ్చటిస్తున్నావు. పద పోలీస్ స్టేషన్ కి నీమీద కేసు పెడతాను" అని ఆవేశంగా అరిచింది.
    
    "పద.... ముందు నిన్ను ఆత్మహత్యా నేరంమీద అరెస్ట్ చేసి పడేస్తాను" అతనూ లేచి నిల్చుంటూ అన్నాడు.
    
    "ఆ....త్మ....హ....త్యా...!!!" కళ్ళు పెద్దవిచేసి వినకూడని విషయం విన్నట్లుగా అంది.
    
    "వయసు రాగానే హడావుడిగా ఎవడ్నో ప్రేమించడం, నమ్మడం, సర్వస్వం అర్పించడం ఆ తర్వాత సముద్రాలూ, నదులూ వెదుక్కుని అమాంతం దూకి చావడం..... ఛీ! ఛీ! ఎన్ని యుగాలైనా మీ ఆడాళ్ళు మారరు" అన్నాడు.
    
    "షటప్!" ఆమె కోపంగా అరుస్తూ అతని ముందుకెళ్ళింది. "నేను ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అందులోనూ స్విమ్మింగ్ ఛాంపియన్ ని. పిచ్చిపిచ్చిగా వాగకు" అంది.
    
    "మరి నీళ్ళల్లోకి ఎందుకెళ్ళావు?" అడిగాడు.
    
    "నీళ్ళల్లోకి స్నానం చెయ్యడానికీ, చేపలు పట్టడానికీ, ముత్యాలు ఏరుకోవ డానికీ కూడా వెళతాను" అంది.
    
    "తమరు ముత్యాలకోసమా?" హేళనగా అడిగాడు.
    
    "ఉహూ! గవ్వలకోసం" అంది.
    
    అతను కొంచెం అనుమానంగా "నిజంగా ఆత్మహత్యా ప్రయత్నం కాదా?" అన్నాడు.
    
    "ఆత్మహత్య చేసుకునే ఖర్మ నాకేం పట్టలేదు" ఆమె విసుగ్గా అంది.
    
    అతను తలగోక్కుని "చాలాసేపట్నించీ గమనించాను. ఆ వాటం....అదీ అచ్చు ఆ అమ్మాయిల్లా వుంటే" అన్నాడు.
    
    "ఏ అమ్మాయిల్లాగా?" ఆమె చిరాగ్గా అరిచింది.
    
    "అదే.... ఇంతకుముందు నేను వాటేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చిన ముఫ్ఫై మూడుమంది ఆడపిల్లల్లాగా" అన్నాడు.
    
    "మీకు ఇంతకన్నా వేరే పనేంలేదా?" అంది.
    
    అతను నవ్వి "నిజం చెప్పాలంటే.....అంతే పరోపకారం తప్ప నేనింకే పనీ చెయ్యను" అన్నాడు.
    
    "పరోపకరమా?" అతను ముట్టుకున్న ప్రదేశాన్ని విసుగ్గా చూసుకుంది.
    
    అతను తేలిగ్గా నవ్వేసి "ఆల్ రైట్ అప్పుడప్పుడు మేధావులు కూడా పొరపాటు పడతారన్నమాట. సరే కానీ, అసలు ఇంత అందమైన ఫేస్ లో ఆ విచారమేఘాలేలా? ఎందుకంత శాడ్ మూడ్ లో వున్నారు? తెలుసుకోవచ్చా?" అన్నాడు.
    
    "ఉహూ! తెలుసుకుని మీరు ఉద్దరించేదేం లేదు" ఆమె చీరకి అంటిన ఇసుక దులుపుకొని వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది.

Related Novels