Previous Page Next Page 

ఫాలాక్షుడు పేజి 2


    వెనక-

 

    ఠీవిగా, అటూ ఇటూ చూస్తూ నడుస్తున్నాడు... భారీ శరీరంతో అహోబలపతి-

 

    "ఇదే రూమ్..." చెప్పాడు యాదగిరి.

 

    "రూం...లో...లైటు వెలుగుతుందంటే... పాపం... బిడ్డ... సీరియస్ గా చదువుకుంటున్నట్టుంది..." అన్నాడు అహోబలపతి.

 

    "లేదు... వాడికి... లైటు ఆర్పకుండా... నిద్రపోవడం అలవాటు..." చెప్పాడు ముఖేష్ నవ్వుతూ.

 

    తలుపు చప్పుడికి మెలకువొచ్చింది ఆదిత్యకు.

 

    "ఇక మీరెళ్ళొచ్చు..." ఆ మాటతో యాదగిరి, ముఖేష్ రెడ్డి, గోవిందరాజ్ ముందు కెళ్ళిపోయారు.

 

    "వీడసలే... భయంకరమైన పొలిటీషియన్... ఆదిత్య మీద... వీడి దృష్టెలా పడింది..." అన్నాడు ముఖేష్ రెడ్డి అనుమానంగా.

 

    "అహోబలపతి... స్వయంగా... ఇక్కడ కొచ్చాడంటే... ఆదిత్య పని సఫా..." కామెంట్ చేశాడు గోవిందరాజ్...

 

    వాళ్ళ ముగ్గురికీ తెలీదు... అంతవరకూ వాళ్ళు, ఏ పాయింట్ గురించి చర్చించుకున్నారో... ఆ పాయింట్ అక్కడో విత్తనం తొడగబోతోందని- ఒక స్టూడెంట్ ని, హార్డ్ క్రోర్ క్రిమినల్ గా తయారుచెయ్యడానికి, అహోబలపతి భయంకరమైన కుట్ర పన్నాడని...

 

    ఆదిత్య తలుపు తెరవడం, అహోబలపతి రూమ్ లోకి అడుగు పెట్టడం...

 

    రెండూ ఒకేసారి జరిగాయి.

 

    పబ్లిసిటీ అఖ్ఖర్లేని పొలిటికల్ లీడర్ అహోబలపతి.

 

    ఆ అహోబలపతిని చూడగానే గుర్తుపట్టాడు ఆదిత్య - మూడు రోజుల క్రితమే. ఫ్రైమ్ మినిస్టర్ పక్కన టీవీలో దర్శనమిచ్చాడు - టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఫెయిలై... హుసేన్ సాగర్లో దూకి చనిపోయిన యిద్దరు అమ్మాయిల తల్లిదండ్రుల్ని ఓదారుస్తూ క్రితంరోజు పేపర్లో కనిపించాడు అహోబలపతి.

 

    అందుకే వెంటనే గుర్తుపట్టాడు ఆదిత్య.

 

    "నా పేరు నీకు తెలుసనుకుంటాను. నీ పేరు ఆదిత్య! లా ఫైనలియర్ చదువుతున్నావని తెలుసు..." అంటూ ఇనప మంచమ్మీద కూర్చుని చుట్టూ చూశాడు అహోబలపతి.

 

    ఆదిత్యకు పాతికేళ్ళుంటాయి. అయిదడుగుల ఎత్తు, మనిషి ధృఢముగా, బలంగా వుంటాడు. నల్లకోటు వేస్తే లాయర్ లాగా, ఆ కోటు తీసివేస్తే వస్తాదులాగా వుంటాడు ఆదిత్య.

 

    "మీ గురించి నాకు తెలుసు. కానీ మీతో నాకెప్పుడూ పరిచయం లేదు" షర్ట్ వేసుకుంటూ అన్నాడు ఆదిత్య.

 

    "పరిచయం లేని అవసరమైనవాళ్ళతో పరిచయం చేసుకోవటమే నా పని, నా టెక్నిక్ అది. గల్లీల్లో ఓ మూల పనికొచ్చే కుర్రాడున్నాడంటే, స్వయంగా వెళ్ళి పరిచయం చేసుకుంటాను. ఆ హాబీయే నన్నింత పెద్ద లీడర్ ని చేసింది" నవ్వాడు అహోబలపతి.

 

    "నేను కూడా మీకు పనికొచ్చే కుర్రాడ్నా? అందుకే ఇంత అర్దరాత్రి వచ్చారా?" అడిగాడు ఆదిత్య.

 

    "పాయింట్ కొచ్చావయ్యా! అమెరికా దగ్గర్లోనో, ఎక్కడో రాత్రీ పగలూ తేడా వుండదట. పాలిటిక్స్ కి కూడా అంతేనయ్యా! నీ గురించి నేనొచ్చానంటే, నీ గురించి తెలుసుకోకుండా రాను. అలాగే నీ హెల్ప్ నేను అడిగాననుకో! అలాగే నీక్కూడా నా హెల్ప్ వుంటుందన్న మాట..."

 

    "నా హెల్ప్ కోరి వచ్చారా మీరు? దగ్గరలో ఎలక్షన్స్ కూడా లేవు. నేను స్టూడెంట్ లీడర్ ని కాను రౌడీనీ కాను" అయోమయంగా అన్నాడు ఆదిత్య.

 

    "నువ్వు బుద్ధిమంతుడివి. ఓ జీనియస్ వి. ఏ గొడవల్లోకీ వెళ్ళని వాడివి. వరంగల్ లో చదువుకుంటున్నప్పుడు కూడా ఏ రాడికల్ ఏక్టివిటీస్ జోలికి వెళ్ళని వాడివి. గొప్ప క్రిమినల్ లాయర్ వి కావాలని నీ కోరిక... అవునా?" అడిగాడు అహోబలపతి.

 

    "నా గురించి చాలా ఇన్ఫర్మేషన్ గేదర్ చేశారే?" ఆశ్చర్యంగా అన్నాడు ఆదిత్య.

 

    నవ్వాడు అహోబలపతి.

 

    "ఇంకా చాలా విషయాలు తెలుసు. నీకు ఒకే ఒక చెల్లెలుంది. కాలేజీలో ఒకడ్ని ప్రేమించింది. ఫలితంగా గర్భవతి అయింది. నీ చెల్లెలు కళ్యాణిని పెళ్ళి చేసుకోడానికి ఆ కుర్రాడు నిన్ను అయిదు లక్షలడిగాడు. అయిదు లక్షలు యిస్తేనేగానీ నీ చెల్లెలికి పెళ్ళికాదు! ఈ రోజు ఆ విషయమే మాట్లాడటానికి మీ నాన్న వచ్చి వరంగల్ వెళ్ళిపోయాడు."

 

    అహోబలపతి చెబుతున్న ఒక్కొక్క విషయాన్నీ ఆశ్చర్యంగా వింటున్నాడు ఆదిత్య.

 

    "పొలిటీషియన్ అన్నవాడికి వెయ్యి కళ్ళుండాలి, వెయ్యి చెవులు వుండాలి. ఈ హాస్టల్ లో ఎక్కువమంది కుర్రాళ్ళకు ఈ పార్టీయే పాకెట్ మనీ యిస్తుంది. నీకు తెలీదా?" సగం సిగరెట్ ను ఆర్పేసి, రూమ్ లో ఓ మూలకి విసిరేస్తూ అన్నాడు అహోబలపతి.

 

    ఆదిత్య దిగ్భ్రాంతిగా చూస్తుండిపోయాడు.

 

    "ఇప్పుడు నువ్వా అయిదు లక్షలు సంపాదించకపోతే ఆ కుర్రాడు నీ చెల్లెల్ని పెళ్ళి చేసుకోడు. ఫలితం... నీ తల్లీ తండ్రి సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. అసలు నీ చెల్లెలు చేసిన తప్పుకి నువ్వే కారణం... నీ చెల్లెలు ఎవర్నో ప్రేమిస్తోందని మీ యింట్లో తెలీగానే, మీ నాన్న మీ చెల్లెల్ని కొడుతుంటే, నువ్వే అడ్డుపడి ప్రేమించటం తప్పు కాదని లెక్చర్లిచ్చావే! ఒక అన్నగా దారిలో పెట్టవలసిన నువ్వే అతి ప్రేమలో నీ చెల్లెలికి స్వేచ్చనిచ్చావు! ఫలితం... కడుపు, కట్నం. ఆ కట్నం నువ్వేగదా యివ్వాలి?

 

    ఆ అయిదు లక్షలూ సంపాదించటం కోసం రూమ్ లోంచి కనీసం బయటకు రాకుండా కూడా నువ్వాలోచిస్తున్నావు."

 

    అహోబలపతి ఒక్కొక్క మాటా చెబుతుంటే ఆదిత్యకి మతిపోయింది. అయినా వెంటనే తేరుకున్నాడు.

 

    "ఆ అయిదు లక్షలూ ఇవ్వడానికొచ్చారా?" వ్యంగ్యంగా అడిగాడు ఆదిత్య.

 

    ఆ వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్నాడు అహోబలపతి.

 

    "ఎవడికీ ఎవడూ ఫ్రీగా దేన్నీ యివ్వడు. అందులోనూ డబ్బు..."

 

    "అంటే?"

 

    "నాకు నువ్వో పని చేసిపెట్టు. నీక్కావలసిన డబ్బు నేనిస్తాను" మళ్ళీ మరొక సిగరెట్ వెలిగిస్తూ అన్నాడతను.

 

    "అయిదు లక్షలిస్తారా..." షాక్ తిని అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు ఆదిత్య.

 Previous Page Next Page