Previous Page Next Page 

అనుక్షణికం -2 పేజి 2


    వూరు వెళ్ళగానే తార గురించి అడిగితే యెప్పుడో తన దారి తను చూసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు రామారావు. మంచి సంబంధం చూస్తామన్నారు. అతనికి ముప్పయ్యేళ్ళు దాటలేదింకా. యీ సారి తను పెళ్ళిచూపులకి కూడా వెళ్ళదలుచుకోలేదు. పెద్దవాళ్ళనే చూసి కుదర్చమనదలచుకున్నాడు.

                                                  69

    వెంకటావదాని తండ్రి మానసికంగానూ, ఆర్థికంగానూ బాగా దెబ్బతిన్నాడు. వెనకటిలాగా గిట్టుబాటు అవటంలేదు. కాగా తనని బొత్తిగా గిట్టుబాటుకాని ప్రాంతపు స్టేషన్ కి బదిలీచేశారు. అది స్రవంతి తండ్రి రాఘవ రెడ్డి పలుకుబడివల్ల జరిగింది. నోరు మూసుకుని నువ్వూ నీ కొడుకూ పడి వుండండి. మెదిలారో, నిన్ను వో కేసులో యిరికించటమే కాక పాత కేసులన్నీ లాగించగలను_అని మళ్ళీ బెదిరింపు కబురుపెట్టాడు రాఘవరెడ్డి.
    వెంకటావధాని, ఆస్పత్రి నుంచి యెనిమిది నెలలకి డిశ్చార్జి అయ్యాడు. కుడికాలు కర్రకాలు. అలాగే కుంటుకుంటూ యింట్లోనే వుంటున్నాడు_ కవిత్వం చదువుకుంటూ, రాసుకుంటూ, ప్రేయసీ నీ నయవంచన నేత్రాలు, ప్రేయసీ నీ స్వార్థ మానసం, ప్రేయసీ నీ ప్రియుడి కాష్ఠపు వేడిలో చలి కాచుకో. నీ ప్రియుడి కన్నీటిలో నీ మలిన దేహాన్ని కడుక్కో_ అంటూ మకుటాలు కూర్చుకుని గేయాలు రాస్తున్నాడు. 'నా గాయాల గేయాలు' అని పేరు పెట్టాడు.
    ఐతే వొకసారి, వుండబట్టలేక_ సిటీలో పి.డబ్ల్యుడి ఇంజనీరుగా వుద్యోగం చేస్తున్న స్రవంతి భర్త ఆచూకీ తెలుసుకుని వెళ్ళి_తమ యిద్దరి సంగతీ చెప్పాడు వెంకటావధాని, వెంకటావధానివంక స్రవంతి భర్త జాలిగా చూసి, "చూడు మిస్టర్ ఇట్లా అబద్ధాలాడి కాపరాలు చెడగొట్టటంకంటే అడుక్కుతినటం గౌరవప్రదం" అన్నాడు. అహం దెబ్బతిన్నట్లుగా అనిపించి "డబ్బుకోసం భార్య ఎట్లాంటిదైనా సరిపెట్టుకునేవాళ్ళేం తెలుసుకోగలరు!" అన్నాడు వెంకటావధాని. "షటప్. నీ నీచపు బుద్ధులన్నీ నాకు బాగా తెలుసు, గెటవుట్" అని అరిచాడు స్రవంతి భర్త. గుర్రుగా చూసి బయటికి వొచ్చేశాడు వెంకటావధాని.
    కాపరానికి వెళ్ళిన రెండో నెలలోనే, స్రవంతి తన కాలేజీ కబుర్లు చెబుతూ, మాటల సందర్భంలో తనవెంట వెధవలు చాలామంది పడుతూండేవాళ్ళనీ, అందులో వెంకటావధాని అని వొకడు వాళ్ళవూరి యాయదారం బ్రాహ్మడి కొడుకు కూడా వున్నాడనీ, వాడితండ్రి వాడి కాళ్ళూ వీడికాళ్ళూ పట్టుకుని కానిస్టేబుల్ అయ్యి యస్సైదాకా పాక్కుంటూ వెళ్ళాడనీ_ వాడి కొడుకు ఆ వెంకటావధాని కాలేజీలో జులాయి వెధవలా తిరుగుతుండేవాడనీ, తన వెంటపడి వొకటే విసిగిస్తుండేవాడనీ, వొకసారి చొరవగా ప్రవర్తించబోతే చెప్పుతో వాయించినట్లూ, ఆ కక్ష మనసులో పెట్టుకుని తనమీద అవీ ఇవీ కల్పించి అందరికీ చెబుతుండేవాడనీ_ చెప్పింది. ఒకసారి రైలు దిగుతూ జారిపడితే, చావాల్సినవాడే గాని బతికాడు. కుడికాలు పూర్తిగా విరిగి కుంటివెధవ ఆ కొంపలో పడి వుంటున్నాడనీ చెప్పింది. దాపరికం లేకుండా తన విషయాలన్నీ అలా తన భార్య తనకి చెబుతున్నందుకు స్రవంతి భర్త యెంతో సంతోషపడ్డాడు. తను వుత్తరాలు రాయడం చేత అందుకు తనని తను యెంతో అభినందించుకునేది స్రవంతి.
    నిజానికి వాళ్ళిద్దరికీ వొకరంటే వొకరికి చాలా యిష్టం. మధ్యలో వొచ్చిన రకరకాల కలతలు కక్షలతో వెంకటావధాని వల్ల తనకు మనసులో వుండే భావం చెదిరిపోయింది స్రవంతికి. ముఖ్యంగా లాడ్జికి తీసుకెళ్ళి తనని ఆ విధంగా అవమానించిన తరవాత_ఆమె భర్త, తండ్రికి దగ్గిలో వుంటామని స్రవంతి కోరినమీదట, వొంగోలుకి బదిలీ చేయించుకున్నాడు. వాళ్ళకిప్పుడు నాలుగు నెలల పిల్లాడు.
    అలా స్రవంతి భర్తకి చెప్పి విఫలమై భంగపడిన తరవాత మరీ కుంగిపోయాడు వెంకటావధాని. అటు తండ్రీ నిరసనగా చూస్తున్నాడు. అదివరకంతా ఎంతో యిదిగా చూసే తండ్రి, పై సంపాదన దాదాపుగా నేరమే. యస్సైగా వొచ్చే జీతం యేపాటి! పెద్ద సంసారం. చదువుకుంటున్న కొడుకులూ, కూతుళ్ళూ.
    వెంకటావధానిని, అతని తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ కూడా తృణీకారంగా అసహ్యంగా చూస్తున్నారు_ అతనివల్ల తండ్రి పరిస్థితి అలా అయ్యి తమ భవిష్యత్తు పాడైందని.
    భోజనాల దగ్గిరో, బట్టల దగ్గిరో, మరో దగ్గిరో__అన్ని విషయాల్లో _యీ కుంటివెధవ, వీడిక్కూడానా. కుంటికులాసం యింటికి మోసం, యెద్దులాగా వున్నాడు కర్రకాలు వుందిగా. యేదన్నా పని చూసుకోకూడదూ__ వంటి మాటలు మొదలెడితే కుమిలిపోయి__
    ఆవేదనని, కవిత్వం చదవటంలో రాయటంలోనూ పూడ్చేసెయ్యటం సాధ్యంకాక ఎక్కడన్నా పని చూసుకోవాలన్న ఆలోచనతో వుద్యోగ ప్రయత్నాలు ప్రారంభిస్తే__
    విజయ్ కుమార్ అతని స్థితి గ్రహించి జాలిపడి, వాళ్ళ హోటలూ, మిల్లుల లెక్కలు చూసే పని యిప్పించాడు. వెంకటావధానికి కవిత్వం వొచ్చుగానీ అంకెలు రావు. తప్పులు చేసి చివాట్లు తిన్నాడు. "యియ్యి బిజినెస్ లెక్కల్రా కుంటెదవా. అంకెలు పొరపాటొస్తే వేలల్లో లక్షల్లో మునిగిపోతాం కాగా నీకు ఇన్కంటాక్స్ పాయింటాఫ్ వ్యూ తెలిసేడవదు. యెందుకూ పనికి రాని దద్దమ్మవి. విజయ్ చెప్పాడని పెట్టుకుంటే నీతో పెద్ద అవస్థగా వుంది. మీదెక్కడన్నావూ ఒంగోలా. పోయి రాగిచెంబుచ్చుకు బతకరాదూ! కవిత్వం రాస్తావంటగా_-కవిత్వం గివిత్వం దేనికి యాడవను. లెక్కలు సరిగా నేర్చుకుని తగలడు వెంకటీ, లేకపోతే యీ బతుకూ వుండదు." అని వొకటి రెండు సార్లు బాగా వాయించాడు విజయ్ కుమార్ పినతండ్రి.
    అంతటితో కవిత్వం కూడా వొదిలిపోయింది. యిప్పుడు వెంకటావధాని నాలికమీదకి కవిత్వం ముక్కరావటం మానేసింది. కలంలోంచి వొక్క కవిత్వచరణమూ రావటంలేదు.
    పెన్సిళ్ళు, రూళ్ళకర్ర. అంకెలు, కూడికలు, తీసివేతలు, లెక్కలు__అణా పైసల లెక్కలు_ ఇన్కంటాక్స్ వాళ్ళకోసం లెక్కలు తయారుచేసే నిపుణులకి అందించే చిత్తు లెక్కలు. యిది యిప్పుడు వెంకటావధాని జీవన ప్రపంచం.

                                 70

    ఆ రకంగా రామనాధం యింట్లోంచి బయటపడిన రవీ గంగీ నేరుగా రాంనగర్ చేరుకొని రవి పాకలోకి వెళ్ళారు.
    చెరో రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగి పరుపుమీద కూర్చున్నారు.
    "నువ్వెంత ధైర్యంగా ప్రవర్తించావు గంగీ! నువ్వే లేకపోతే వాడు నా ప్రాణాలు నిలువునా తీసేసుండేవాడు!"

 Previous Page Next Page