Previous Page Next Page 

రక్తచందనం పేజి 2


    వెనుక సీట్లోని వ్యక్తి భయంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు....
    కన్ను పొడుచుకున్నా ఇసుమంతయినా కానరాని గాధాంధకారం....చీకటి దుప్పటి కప్పుకున్న ఆ అటవీ ప్రాంతానికి ఆ సమయంలో రావలసి రావటం_ఊరు పేరు తెలీని వ్యక్తికి వైద్యం చేయబోవటం ప్రమాదాన్ని ఆహ్వానించటమేనా....?
    భయంతో అప్రయత్నంగా అతని చేతివేళ్ళు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ హేండిల్ మీద బిగుసుకున్నాయి.
    "నాకు బాగానే డబ్బిస్తున్నారనుకోండి. కానీ సమయంలో ఊటీకి బయలుదేరడం...." సిగరెట్ ని బయటకు విసిరి కారుని తిరిగి స్టార్టు చేస్తూ అన్నాడతడు.
    మరికొద్దిసేపటికి కారు గుండ్లుపేట చేరుకుంది.
    ఆ భయానక వాతావరణానికి గుండ్లుపేట భయపడినట్లుగా నిశీధి నిశ్శబ్దం మాటున ముడుచుకుని ఉంది. రోడ్డు కిరువైపులా వున్న హోటల్స్ మూసి వేసున్నాయి. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. రక్తాన్ని గడ్డకట్టించేలా ఉన్న చలికి భయపడి ఆ ఊరి ప్రజలు తలుపులు బిడాయించుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నారు.
    వేగం తగ్గిన కారు తిరిగి గుండ్లుపేట దాటి ఊటీవైపు కేసి వేగంగా దూసుకుపోతోంది. రోడ్డుమీద ఉన్న చిన్న చిన్న గుంటల్లో నిలిచినా వర్షపు నీరు వేగంగా వెళ్తున్న కారు టైర్ ని తాకి సర్రున చింది దూరంగా పెద్ద శబ్దం చేస్తూ స్ప్రే అవుతున్నాయి.
    కందిరీగ శబ్దాన్ని సృష్టిస్తూ దూసుకుపోతున్న కారు పదోకిలోమీటర్ రాయి దగ్గర మలుపు తిరగ్గానే వెనుక సీట్లో ఉన్న వ్యక్తి అప్రమత్తమయ్యాడు. సీట్లో నిటారుగా కూర్చుని ముందుకు చూస్తూ "బాబూ! కారుని కొంచెం స్లోగా పోనివ్వు" అన్నాడు.
    "ఇక్కడి సంగతి మీకు తెలీదనుకుంటాను. మనం ప్రయాణిస్తున్న ఈ ప్రాంతం అడవిలోని జంతువులకు క్రాసింగ్ పాయింట్. ఆహారాన్వేషణలో రోడ్డుకి ఇటువైపున్న అడవిలోని జంతువులు అటువైపు_ అటువైపున్నవి ఇటువైపు క్రాస్ అవుతుంటాయి. బస్సులు, లారీలయితే ఫర్వాలేదు. అగ్గిపెట్టెలాంటి మారుతీ కారంటే ప్రమాదమే. వేగం తగ్గితే...." కారు వేగాన్ని ఒకింత తగ్గిస్తూ ఆర్థోక్తిలోనే మాటల్ని మింగేశాడు.
    అందుక్కారణం....దూరంగా దట్టంగా పరుచుకున్న చీకటిలో మిణుకుమిణుకుమంటూ ఏదో కాంతి అస్పష్టంగా ఉండుండి కనిపిస్తోంది. అది ముణుగురు కాదు. అలా అని అక్కడేమీ ఊరులేదు కనుక లైటూ కాదు. మరి....?
    కారు మరికొంత దూరాన్ని అధిగమించింది. అప్పుడు గమనించాడతను. ఎవరో రోడ్డువారగా నించుని కావాలనే లైట్ ని వెలిగించి ఆర్పుతున్నారు.
    వెనుక సీట్లోని డాక్టర్ ఒకింత స్థిమితపడ్డాడు.
    కానీ డ్రైవింగ్ సీట్లోని వ్యక్తి ఆందోళనకు గురయ్యాడు.
    కారు మరికొంత ముందుకెళ్ళాక_
    "బ్యాటరీ లైట్ వెలిగి ఆరిపోతుందేమిటి? ఎవరైనా లిఫ్ట్ కావాలని ఆ విధంగా అడుగుతున్నారా?" డాక్టర్ తెలీనట్లుగా ప్రశ్నించాడు.
    డ్రైవర్ గొంతులోని తడారిపోయింది.
    భయాందోళనలతో ఒళ్ళు జలదరించింది.
    "వెనుకా ముందు చూసుకోకుండా మీరు, డబ్బు కోసం నేను పెద్ద సాహసమే చేశాం...." ఒణుకుతున్న కంఠంతో డ్రైవర్ అంటుండగానే రోడ్డుమీద హెడ్ లైట్స్ కాంతిలో ఇద్దరు వ్యక్తులు సాయుధులై కనిపించారు. ఇద్దరి చేతుల్లోను రైఫిల్స్ ఉన్నాయి.
    డ్రైవర్ కి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. అసంకల్పితంగా కారు వేగం బాగా తగ్గిపోయింది.
    "ఎవరా వ్యక్తులు....? పైనుంచి కిందవరకు ముసుగులో ఉన్నారు? దొంగలా....? అరే....వారి పక్కనే ఒక వ్యక్తి కాలు పట్టుకొని ఒరిగిపోయి ఉన్నాడు.
    ఏమైందో....?" డాక్టర్ అంటుండగానే కారు వారిని సమీపించి ఆగిపోయింది విధిలేక.
    "వాళ్ళే...." భయంతో బిగుసుకుపోయిన డ్రైవర్ ఓకర్ కార్డ్స్ నుంచి వచ్చిన ఆఖరి మాట అదే.
    ఇంజన్ ఆఫ్ అయింది.
    ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి కారు దగ్గరకు వచ్చాడు.
    "మా మనిషి ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు. మీ కారులో లిఫ్ట్ కావాలి" అన్నాడా వ్యక్తి. అతని ముఖం కనిపించకుండా కళ్ళకి కిందవరకు నల్లటి రగ్గుని చుట్టుకొని ఉన్నాడు. మరోవ్యక్తి గాయపడిన వ్యక్తి దగ్గరే ఉన్నాడు.
    "ఏమయింది?" డాక్టర్ అడిగాడు గుండెల్ని చిక్కబట్టుకుంటూ.
    "కాలికి ఏదో కొర్రు గుచ్చుకుంది. రక్తం బాగా పోయింది. కాలు లోపల కొర్రు కొంత ఉండిపోయిందనుకుంటాను. ఉండుండి కలుక్కుమంటోందట...." అన్నాడతను భావరహితంగా.
    అక్కడ పరచుకున్న శ్మశాన స్తబ్ధతను మించిన నీరసం ఎవరినైనా భయకంపితుల్ని చేస్తుంది. కానీ అతనిలో అదేమీ కనిపించటం లేదు.... చిరుజల్లు ఈదురు గాలితో కలిసి పడుతూనే ఉంది. కీచురాళ్ళ రొద ఓ పక్క....గాఢాంధకారం మరో పక్క....
    డాక్టర్ నెమ్మదిగా కారులోంచి దిగాడు.
    "నేను డాక్టర్ నే....నా దగ్గర కిట్ ఉంది. పేషెంట్ ని చూద్దాం పదా...." అన్నాడు ధైర్యాన్ని ప్రోదిచేసుకుంటూ, అతను కదిలాడు.
    కారు ఇంజన్ ఆగిపోయినా హెడ్ లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. ఆ కాంతిలో డాక్టర్ సాయుధుడితో కలిసి రోడ్డువారగా వున్న పేషెంట్ దగ్గరకు వెళ్ళాడు. అతను కాలు పట్టుకొని బాధగా మూల్గుతున్నాడు.
    డాక్టర్ కిట్ ని రోడ్డుమీదుంచి అతనికి దగ్గర కూర్చుంటూ పేషెంట్ మొహంలోకి చూస్తే ప్రయత్నం చేస్తుండగానే_
    "అప్పగించిన పని పూర్తిచేసి డబ్బు తీసుకొని వెళ్ళిపోవటం నీకు క్షేమం" అన్న మాటలు వినిపించి డాక్టర్ ఉలిక్కిపడ్డాడు.
    క్షణాల్లో సర్దుకుంటూ పేషెంట్ కాలుని తన ఒడిలోకి తీసుకొని పరీక్షించి కిట్ ని ఓపెన్ చేసి పావుగంటలో కట్టుకట్టి ఇంజెక్షన్ చేశాడు. ఆపైన ఏవో కాప్స్యూల్స్ ఇచ్చి, అవెలా వేసుకోవాలో చెప్పి, తన పనయినట్లుగా కళ్ళద్వారా సంజ్ఞ చేస్తుండగానే, ఒక సాయుధుడు తనచేతిలో అప్పటివరకు దాచుకున్న కవర్ ని కనురెప్పపాటులో ఆ కిట్ లోకి జారవిడిచాడు.

  Previous Page Next Page