Previous Page Next Page 

అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 2


    "సుజా! మనమిలా మాట్లాడుకుంటూంటే నాకో అనుమానమొస్తోంది."
    "ఏమిటండీ?"
    "మనం మరీ జటిలమైన భాషలో మాట్లాడుకుంటున్నామేమోనని..."
    "అవునా?"
    "అంతేకాదు. అందులో కొంచెం కవితా శిల్పం కూడా తొంగి చూస్తోందని..."
    "అచ్చం మీకు కలిగిన అనుమానాలే నాకూ కలుగుతున్నాయండీ...మీకో పాయింటు చెప్పాలి."
    "ఏమిటా పాయింటు?"
    "చిన్నప్పుడు నేను కవిత్వం రాసేదాన్ని"
    "మినీ కవిత్వమా? సినీ కవిత్వమా?"
    "రెండూ కాదు. ప్రేమ కవిత్వం"
    విజయ్ ముఖం కొంతవరకూ సీరియస్ గా మారింది. అతని భావాలు ఆమె కనుకొసలలోంచి గమనిస్తోంది.
    "వాట్? ప్రేమ కవిత్వం? అంటే అప్పట్నుంచే నీకు ప్రేమ గురించి తెలుసన్నమాట."
    "అప్పట్నుంచీ అంటే?"
    "పెళ్ళికాకముందు నుంచీ..."
    "నాకు పెళ్ళయ్యేసరికి యిరవయ్యేళ్ళు. ఇరవయ్యేళ్ళవరకూ ప్రేమంటే తెలీయదటండీ...మీరు మరీనూ. అసలు వయసులో వున్న ఇద్దరాడపిల్లలు కలిస్తే_మాట్లాడుకునేది దాన్ని గురించే కదండీ."
    దేన్ని గురించి?"
    "అదేనండీ. ప్రేమ గురించి"
    "ప్రేమ కవిత్వం రాశావంటే కొంచమో గొప్పో అనుభూతి వున్నదన్న మాటేగా?"
    "ఉండకుండా ఎలా వుంటుందండీ?"
    "ఇంకో ప్రశ్న"
    "అడగండి."
    "కొంచెం ఘాటుగా వుంటుంది."
    "ఏం చేస్తాను? భరిస్తాను. భార్యను కదా"
    "అడిగేస్తున్నాను"
    "వినటానికి నేను సిద్ధంగా వున్నాను."
    "పెళ్ళికాకముందు నీకెవరన్నా అబ్బాయిలతో పరిచయం వుండేదా?"
    "అదేమిటండీ అంత సిల్లీగా అడిగారు. కాలేజీలో చదివేటప్పుడు పరిచయం కాకుండా ఎలా వుంటుందండీ"
    "ఒట్టి పరిచయమేనా? స్నేహం కూడానా?"
    "మీ పిచ్చిగానీ_ఆడపిల్ల పరిచయంగా వుంచుకుందామన్నా కుర్రాళ్ళు అంతటితో ఆగుతారండి. దాన్ని సాధ్యమైనంత త్వరలో స్నేహంగా మార్చేస్తారు. ఆ తర్వాత..."
    "ఊ? ఆ తర్వాత?"
    "నన్నడిగితే స్నేహానికీ, ప్రేమకూ ఎక్కువ తేడా లేదంటాను"
    "అయితే నా అనుమానం నిజమేనంటావు?"
    "ఏమయింది?"
    "పెళ్ళికిముందు నువ్వెవర్నో కొంచమో, గొప్పో... ఆ కథంతా నాకు తెలీదుగాని ప్రేమించే వుంటావు"
    ఆమె సైలెంటుగా ఉండిపోయింది.
    "మాట్లాడవేం?"
    "ఏం లేదండి...నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని ఆలోచిస్తున్నాను."
    "విజయ్ ముఖంలోని సీరియస్ యింకా ఎక్కువయింది.
    "ధైర్యంగా, జంకూ బొంకూ లేకుండా నిజమే చెబుతున్నావుగా. మన సంభాషణ ఈ స్థాయి కొచ్చాక, అబద్ధం చెప్పినా నమ్మను...ఇదిగో అబద్ధం చెప్పి నమ్మించగలననుకుంటున్నావేమో, నీ కళ్ళలోని చూపులు, పెదాలు కదలికలు గమనిస్తూ నిజం పసిగట్టి వెయ్యగలను జాగ్రత్త"
    "నా పెదాల కదలికల గురించి మీకు తెలుసునని నాకు తెలుసులెండి."
    విజయ్ కోపంగా కనబడటానికి ప్రయత్నిస్తున్నాడు. "సుజా!" అన్నాడు. ఆ పిలుపు అతనికే రుచించలేదు. మళ్ళీ గొంతులోని మాడ్యులేషన్ మారుస్తూ "సుజాతా!" అన్నాడు.
    "అదేమిటండీ రెండు రకాలుగా పిలుస్తున్నారు" అన్నది సుజాత అమాయకంగా ముఖం పెట్టి.
    "కోపంగా వున్నప్పుడు నేన్నిన్ను సుజా అని గోకుగా పిలవను. నేనిప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నాను... అవును... ఏమంటున్నాను?"
    "పెదాల కదలికల గురించి మాట్లాడుతున్నారు."
    "యస్. గుర్తొచ్చింది. నేను గంభీరంగా అడుగుతున్నాను నిజమే చెప్పేయ్.
    "మధ్యలో ఓ పాయింటు చెప్పనివ్వండి. లేకపోతే మరిచిపోతాను. మరి చెప్పాలనుకున్నది, సరియైన సమయంలో చెప్పకపోతే, అందులో థ్రిల్ వుండదు కదండి."
    "ఏమిటది?"
    "మీకు కోప్పడటం, సీరియస్ గా ఉండటం చేతకాదు."
    "నో. అవన్నీ వేరే సందర్భాలలో, ఇక్కడ కాంటాక్ట్సు వేరు"
    "అవునా?"
    "అవును. ఊ త్వరగా చెప్పు."
    "అన్నట్లు మనం దేన్ని గురించి మాట్లాడుతున్నాం?"
    "మళ్ళీ మరిచిపోయావా? ఎన్నిసార్లు గుర్తుచెయ్యాలి? పెదాల కదలికలు. ఉహు...పెళ్ళికిముందు నో ప్రేమ వ్యవహారాల గురించి"
    "ఆఁ గుర్తొచ్చిందండీ. నేను కూడా సీరియస్ గా నిజమే చెబుతున్నాను. ప్రేమించాలనుకున్నానుగాని ప్రేమించలేకపోయాను."
    "ఎందుకని?"
    "నా హృదయ వీణా తంత్రుల్ని కదిలించగల వాడెవడూ కదిలించలేదండి"
    "బహుశా...నిజమే అయివుంటుంది. ఎందుకంటే...నాలాంటి పర్సనాలిటీ, ఆకర్షణ శక్తి కలవాడెవడూ నీకు తారసపడి ఉండడు."
    "ఆ పాయింటు ఆనక మాట్లాడుకుందాం. ఎందుకంటే టాపిక్ మారిపోతుంది. ఈ ఇంటర్ ఫియరెన్స్ తో మంచి మంచి పాయింట్లాగి పోతున్నాయి... ప్రేమించలేదుగాని, ఒక్కటి జరిగింది?
    అతని గుండె వేగం ఎక్కువయింది. "ఏమిటది? నాకు ఇబ్బంది కలిగించేదేనా?" అనడిగాడు అనునయంగా.
    "అది మీ స్పోర్టివ్ నెస్ మీద ఆధారపడి వుంటుంది. నాకు చాలామంది అబ్బాయిలు ప్రేమలేఖలు రాసేవారు."
    "మైగాడ్ లవ్ లెటర్స్" అంటూ కుర్చీలో కూలబడిపోయి తల రెండు చేతుల్తో పట్టుకున్నాడు.
    కొంచెంసేపటికి తేరుకుని "అవి నీకు ఎలా అందించేవారు?" అనడిగాడు.
    "కొన్ని పోస్టులో వచ్చేవి. కొన్ని... కాలేజీకి పోతూంటే పని వున్నట్లు పలకరించి చేతికందించేవారు.
    మరి ఆ ప్రేమలేఖలు నువ్వు తీసుకుని చదివావా?
    "ప్రేమలేఖలు ఇచ్చినప్పుడు చదవకుండా ఎలా వుండగలను" అంది సుజాత.
    వాళ్ళందరినీ కాదని నన్నెందుకు పెళ్ళి చేసుకున్నావు అన్నాడు విజయ్.
    ఎందుకంటే మీలో నాకు నచ్చిన కొన్ని లక్షణాలు వున్నాయి అనిపించింది. అందుకే పెళ్ళి చేసుకున్నాను అంది.
    "అయితే నేన్నీకు నచ్చింది డబ్భయి శాతమేనన్నమాట. సెంట్ పర్సెంట్ కాదు" అన్నాడు.
    అమెకతన్ని చూస్తే జాలేసింది. దగ్గరకు తీసుకుని లాలించాలనిపించింది. మెడచుట్టూ చేతులువేసి ముఖాన్ని తనవైపు లాక్కుని పెదవులమీద ముద్దు పెట్టుకోవాలనిపించింది. కాని ఆ రెండూ చెయ్యకుండా నిగ్రహించుకుంది.
    "డబ్భయి శాతమంటే గొప్పే కదండీ డిస్టెన్షన్ మార్కు. ఆ మాటకొస్తే నూటికి నూరుపాళ్ళూ నచ్చే రూపం గానీ, గుణంగానీ ఎవరిలోనూ వుండవు. నాతోకూడా కలిపి. కలిసి వుండటం మొదలుపెడతాం కాబట్టి అలవాటు పడిపోతాం అంతే" అన్నది.
    "అంతేనంటావా?"
    "అంతేనండి మరి"
    అతను వున్నట్టుండి సైలెంట్ గా అయిపోయాడు. ముఖంలోని భావాలు గబగబ మారిపోతున్నాయి.
    "ఏమిటండీ అలా వులక్కుండా, పలక్కుండా అయిపోయారు."
    అతను మాట్లాడలేదు.
    "మిమ్మల్నేనండి"
    అప్పటికీ పలకలేదు.
    "ఏమిటండీ మీ మొహంలో రంగులలా మారిపోతున్నాయి?" చివరకు "చూడూ" అంటూ పెదవి విప్పాడు.

 Previous Page Next Page