Previous Page Next Page 

వెన్నెల వేట పేజి 2


    "నీకిది లాస్ట్ వార్నింగ్ భవానీ? నీవల్ల నా భవిష్యత్తు పాడుచేసుకోవటం నాకిష్టంలేదు."
    "ఓ.కే. అంకుల్! ఓ.కే."
    "అసలీ ఉద్యోగం నీకివ్వటమే పెద్ద రిస్క్ నాకు_"
    "టేకిట్ ఈజీ అంకుల్_ఏ జాబ్ అయినా తేలిగ్గా చేసేస్తాను"
    "వెళ్ళిక"_ చిరాగ్గా అన్నాడు బంగారయ్య.
    భవానీశంకర్ బయటికొచ్చేశాడు. తన సీట్లో కూర్చుని సిగరెట్ వెలిగించుకునేసరికి ప్యూన్ వెంకటేశం వచ్చాడు.
    "సార్!"
    "యస్ మైడియర్ వెంకటేశం! ఎనీ ప్రాబ్లమ్?"
    "సూపర్నెంట్ గారు పిలుస్తున్నారండి!"
    "ఆ గుంటనక్కకు వేరే పనేమీలేదా డియర్?"
    "గట్టిగా అనకండి సార్"
    "ఏంపర్వాలేదు బ్రదర్! అయ్ కెన్ టాకిల్ దట్ గూన్" అంటూ లేచి చలపతి టేబుల్ దగ్గరకు నడిచాడు.
    "యస్ మైడియర్ సూపర్నెంట్ పిలిచారట!"
    "అలా మైడియర్ సూపర్నెంట్ అని అనొద్దని చెప్పాను_"
    "చెప్పారా?"
    "అవును"
    "ఎప్పుడు?"
    "రోజూ"
    "ఐసీ_అందులో అభ్యంతరం ఏమిటసలు?"
    "బాస్ ని పిలిచే పద్ధతి కాదది"
    "ఏమిటి? కాదా? అయామ్ వెరీ సారీ మైడియర్ సూపర్నెంట్! ఇలా పిలవడమే లేటెస్ట్ ఫాషన్! అంతెందుకు? అమెరికాలో ప్రెసిడెంట్ ని ఎలా అడ్రస్ చేస్తారో తెలుసా? మిస్టర్ ప్రెసిడెంట్ అంటారు. మన ఇండియాలోనే ఇంకా పాతపద్ధతులు పురాతన వస్తు శిథిలాల్లా అలా వుండిపోయాయ్ మిష్టర్ చలపతీ!"
    చలపతి అదిరిపడ్డాడు.
    "నన్నలా పేరుపెట్టికూడా పిలవొద్దు" అన్నాడు కోపంగా.
    "వెరీ బాడ్ డియర్! వెరీ బాడ్! సూపర్నెంట్ అనకూడదు_ పేరుపెట్టి పిలవకూడదు_ ఇంక మిగిలింది ఏయ్_ఓయ్ అనేపదాలు బ్రదర్! వాటిని వాడటం నాకిష్టంలేదు ఫ్రెండ్! తప్పదనేటట్లయితే వాడతాను_"
    "అవేమీకాదు 'సర్' అని పిలవాలి"
    "సర్ అనా?"
    "అవును"
    "మిమ్మల్ని చూస్తుంటే నాకు మరింత విచారంగా ఉంది మైడియర్ సూపర్నెంట్! 'సర్' అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు? అది ఒక బిరుదు! ఏమయినా అద్భుతాలు చేసినవారికి క్వీన్ ఎలిజబెత్ ఆ బిరుదు ప్రధానం చేస్తుంది ఫ్రెండ్! అంతేకాని అడ్డమైనవాడినీ 'సర్' అనకూడదు"
    "భవానీశంకర్" విసుగ్గా అడ్డుపడ్డాడు చలపతి.
    "యస్."
    "నువ్వు నన్నేమీ పిలవక్కర్లేదుగానీ_ నీకో విషయం చెప్పటానికి పిలిచాను."
    "కారీ ఆన్ డియర్! ఏమిటది?"
    "ఆఫీస్ లో సిగరెట్ తాగకూడదని ఇదివరకు చెప్పాను."
    "చెప్పారా?"
    "యస్. అరడజనుసార్లు_"
    "అన్నిసార్లు చెప్పటం మంచి పాలసీ కాదు మైడియర్ చలపతీ! విల్సన్ మూండ్సే పాలసీ ఏమిటో తెలుసా? స్టాఫ్ కి పదేపదే చెప్పిందే చెప్పకూడదు. దానిని మార్చి కొత్త పద్ధతుల్లో, కొత్త పదాల్లో వివరించాలి డియర్! అప్పుడే వాళ్ళు దానిని ప్లెజెంట్ గా అమలుపరుస్తారు."
    "ఓ.కే_ యూ కెన్ గో" చిరాగ్గా అన్నాడు చలపతి.
    "థాంక్యూ డియర్! థాంక్యూ" భవానీశంకర్ మళ్ళీ తన సీట్ చేరుకున్నాడు.


                           *    *    *    *


    భవానీశంకర్ తలొంచుకుని ఎకౌంట్స్ రాసుకుంటున్నవాడల్లా "గుడ్ మాణింగ్ గురూ" అన్న డైలాగ్ విని తలెత్తి చూచాడు.
    ఎదురుగ్గా చిరునవ్వుతో నిలబడివున్నాడు శివానందం.
    "గుడ్ మాణింగ్ బ్రదర్!"
    శివానందం భవానీశంకర్ చెవి దగ్గరకు వంగాడు.
    "ఓ చిన్న హెల్ప్ చేయాలి గురూ_"
    "డెఫినెట్ లీ బ్రదర్! ఏం కావాలి?"
    "అయిదొందలు కాష్_ రేపు మాణింగ్ ఇచ్చేస్తాను. ఆఫీస్ కాష్ లో నుంచి ఇచ్చేసెయ్"
    భవానీశంకర్ ఉలిక్కిపడ్డాడు.
    తన అంకుల్ పదిరోజుల క్రితమే తనకీ కాషియర్ ఉద్యోగం ఇచ్చేప్పుడు స్పష్టంగా చెప్పాడు. ఆఫీస్ డబ్బులో ఒక్క పైసకూడా వ్యక్తిగతంగా వాడకూడదని.
    "ఆఫీస్ క్యాషా?"
    "డోంట్ వర్రీ గురూ! ఇవాళ ఏం పరిగెడుతోందో తెలుసా? రెడ్ స్టార్! ఒందర్ ఫుల్ గుర్రం! ఇవాళది దున్నేయటం ఖాయం!"
    "కానీ ఆఫీస్ కాష్..."
    "అసలు రెడ్ స్టార్ మదర్ ఎవరో తెలుసా నీకు? బ్లూ బర్డ్! కలకత్తాలో ఆరుసార్లు గెలిచింది! ఇవాళ రెడ్ స్టార్ కావటం మాత్రం షూర్!"
    "నిజమేననుకో... కానీ..."
    "రెడ్ స్టార్ అమ్మమ్మ ఎవరో తెలుసా? ఎల్లోఫీవర్! బాంబేలో నాలుగుసార్లు వరుసగా చెరిగేసింది. చూస్తూండు! సాయంత్రానికి యాభయ్ వేలు_ నేను గెలవాలని నీకు లేదూ?"
    "యాభయ్ వేలే?"
    "ఆరుసార్లు మిస్సయ్యాను ఆ ఎమౌంట్! ఎందుకని అడగవేం?"
    "ఎందుకని?"
    "సమయానికి అప్పిచ్చేవాడు లేక! ఇంతకు ముందున్న కాషియర్ పరమ ముసురు వెధవ అవటంవల్ల_"
    భవానీశంకర్ కి అతనిమీద జాలివేసింది. అయిదువందలు పెట్టుబడి లేక శివానందం అలా ఏడోసారి కూడా యాభైవేలు సంపాదించలేకపోవటం అతనికి నచ్చలేదు.
    "రేపు తప్పకుండా ఇచ్చేస్తావు కదూ?"
    "పువ్వుల్లో పెట్టి! యాభయ్ వేలొస్తుంటే అయిదొందలో లెక్కా?"
    భవానీశంకర్ సేఫ్ తెరచి అయిదువందలు లెక్కపెట్టి అతనికిచ్చేశాడు. శివానందం ఆనందంతో వెలిగిపోయాడు.
    "థాంక్యూ గురూ! యూ ఆర్ ఎ గ్రేట్ ఫ్రెండ్! అన్నట్లు ఇదిగో_ నా లీవ్ లెటర్. మన సూపర్నెంటుగారికిచ్చేసెయ్. రేపు ఏకంగా రాజీనామాయే వాడి మొఖాన్న కొడతాను."
    "రాజీనామా చేస్తావా?"
    "అవును మరి! యాభయ్ వేలతో సొంత బిజినెస్ పెట్టుకుంటానుగానీ ఇంకా ఈ వెధవ ఉద్యోగం ఎందుకు చేస్తాను?"
    అతను వెళ్ళిపోయాక భవానీశంకర్ చాలాసేపు రేసుల గురించి ఆలోచిస్తూండిపోయాడు. రేసుల్లో భలే సరదాలు జరుగుతాయని తెలుసు గానీ ఇలా గుర్రాల తాలూకు అమ్మలూ, అమ్మమ్మల్ని కూడా స్టడీ చేస్తారని తెలీదు.
    హఠాత్తుగా అతనికి ఏదో గుర్తుకొచ్చినట్లయింది. చప్పున లేచి తన పాంట్ జేబులోనుంచి ఓ నలిగిపోయిన కాగితం తీశాడు. సీట్లో కూర్చుని జాగ్రత్తగా దాని మడత విప్పి చూశాడు.
    ఆ అమ్మాయి నవ్వుతోంది. అందంగా, గుండెల్లో పూర్తిగా నిండిపోయేలా__
    ఎంత అందం? అది ఫోటో అవకపోయినట్లయితే_ అంత అందమయిన అమ్మాయి ఉంటుందని నమ్మేవాడేకాదు.
    ఇంత అందమయిన అమ్మాయిని ప్రేమించకుండా ఎలా ఉండటం? మళ్ళీ ఆమె ఫోటోవంక చూశాడు. ఏదో తెలుగు పత్రికలో ఫోటోఫీచర్ అది! ఫోటో కింద కవిత్వం ఉంది.

  Previous Page Next Page