Previous Page Next Page 

ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 2


    "సాయంత్రం అయిదున్నరకి మామూలు చోటికే" ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది అవతలవేపు.
    అనీజీగా కుర్చీలో వెనక్కివాలాడు. ఇప్పటికి అతను శృతిని కలిసి దాదాపు వారం కావస్తోంది. ఇంత హఠాత్తుగా ఆమె తనను కలవాలనడం_ పైగా ఈ పద్ధతిలో ఎంత వద్దనుకున్నా అనుకోని భయం వెంటాడసాగింది. అయిదు గంటలకే హోటల్ చేరి శృతికోసం నిరీక్షించ సాగాడు.
    అతను వచ్చాక ఆరవసారి అతని ముందు నిల్చున్నాడు స్టూవర్డ్.
    ఇప్పటికీ ఏమీ చెప్పకపోతే బాగుండదని ఓ కాఫీ ఆర్డర్ చేశాడు.
    జేబులోనుండి సిగరెట్ పాకెట్ తీసి సిగరెట్ తీసుకొని వెలిగించుకున్నాడు లైటర్ తో.
    గడచిన గంటలో ఇది ఏడవ సిగరెట్.
    క్షణాలు గడుస్తున్నాయి. అతనిలో ఆతృతా, ఆందోళనా అధికం కాసాగాయి. ఆలోచనలు పరిపరి విధాల పరిగెత్తసాగాయి. ఏమయ్యింది శృతికి?
    ఎప్పుడూ కాలం వృధాచేయని ఆమె ఎందుకింత ఆలస్యం చేస్తోందీ రోజు! అసలు ఫోన్ చేసింది శృతేనా? లేక ఎవరయినా ఆమె కంఠాన్ని అనుకరిస్తూ తనకి ఫోన్ చేశారా?
    ఆటపట్టించడానికయినా అసలు తమ విషయం ఇక్కడ ఎవరికి తెలుసని?
    "ఛ__తనే పిచ్చిగా ఆలోచిస్తున్నాడు. తమ విషయం ఇక్కడ, ఈ ఊర్లో అసలామాటకొస్తే ఈ ప్రపంచంలోనే కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. శృతికి, తనకి. మరలాగయితే ఆరూ యిరవై కావస్తున్నా రాదేం?
    కాఫీ వచ్చింది. దాంతోపాటు బిల్లున్న ప్లేటు కూడా ముందు ఉంచి ప్రక్కకెళ్ళాడు బేరర్.
    ఒకవేళ....ఒకవేళ.... వస్తున్న దారిలో ఏదైనా....
    ఆపైన ఆలోచించలేకపోయాడు. అతని మనసు కంపించింది. చెయ్యి సన్నగా వణికింది. ఇక అక్కడ కూర్చోలేకపోయాడు. కాఫీని మూడు గుక్కలలో తాగేసి, బిల్లున్న ప్లేటులో పదినోటొకటి పడేసి లేవబోయాడు.
    ఎదురుగా ఎంట్రెన్స్ లో శృతి....
    ఒక్కసారిగా ఆనందం, కోపం కలగాపులకంగా కలిగాయతనికి.
    అతనిని గమనించి నెమ్మదిగా టేబుల్ కేసి నడిచింది శృతి. ఆ మసక వెలుతురులో కూడా శృతి బాగా అలసిపోయి వున్నట్టు కనిపిస్తోంది.
    వచ్చి అతనికెదురుగా వున్న కుర్చీలో ఉసూరుమంటూ కూర్చుంది.
    "సారీ సాగర్....చాలా ఆలస్యమయ్యింది. ఐ యామ్ రియల్లీ సారీ...."
    ఉవ్వెత్తున లేచిన కోపమంతా అణగారిపోయిందతనిలో.
    "ఏం తీసుకుంటావ్?" అడిగాడు.
    "కాఫీ చాలు....తల పగిలిపోయేట్టుంది" కణతలు రుద్దుకుంటూ అంది.
    స్టూవర్డ్ ని పిలిచి కాఫీలు చెబుతూ అప్రయత్నంగా ఎంట్రెన్స్ వేపు చూశాడతను. అతని కళ్ళు అప్పుడే లోపలికొచ్చిన వ్యక్తిపైన నిలిచాయి.
    దాదాపు అయిదు అడుగుల ఎనిమిదంగుళాల పొడవు వుంటాడతను.
    పెద్ద పెద్ద కళ్ళు, సూటిగా వున్న ముక్కు, చిన్న పెదవులు, చిక్కటి మీసకట్టు, దాదాపు గడ్డం చివరివరకూ వచ్చిన సైడ్ లాక్స్.... అందంగా వున్నాడతను. ఎవర్నీ చూడకుండా, శృతీ సాగర్ కూర్చున్న టేబుల్ కి కాస్త కుడిప్రక్కగా ఇద్దరి కోసం కేటాయించబడిన టేబుల్స్ లో ఒక దాంట్లో కొచ్చి కూర్చున్నాడు అతను. అతడ్ని ఇంత క్రితమే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపించింది సాగర్ కి. కాని ఎవరో గుర్తురాలేదు.
    "ఏమిటి ఎటో చూస్తున్నావ్?" అడిగింది శృతి.
    "అతడ్ని గుర్తుపడతావా?" అతనికేసి చూపుతూ అడిగాడు.
    అర నిమిషంపాటు పరీక్షగా చూసిందామె.
    "లేదు....ఏం?"
    "ఏమీ లేదు. ఎక్కడో చూసిన మొహంలా అనిపిస్తేనూ.... అందంగా వున్నాడు కదూ?"
    ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు.
    కాఫీ వచ్చింది. స్పూన్ తో కప్పులోని కాఫీని కలుపుతూ మౌనంగా కూర్చుందామె. నెమ్మదిగా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు సాగర్.
    "ఏవిఁటి? ఏం జరిగింది?"
    ఆమె ఏమీ మాట్లాడలేదు.
    క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి వారి మధ్య...మళ్ళీ రెట్టించి అడగలేదు అతను. ఆమే స్వయంగా చెపుతుందని ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఐదు నిమిషాలు గడిచిపోయాయి అలా.
    చివరికి తలెత్తింది శృతి.
    "నిన్న రాత్రి మాట్లాడాను"
    "ఏమిటి?" వెంటనే అర్థం కాలేదతనికి.
    "మన విషయం"
    'మన పెళ్ళి విషయం' అనకుండా కేవలం 'మన విషయం' అనడం ఎందుచేతనో నచ్చలేదు అతనికి. కాని అలా చెప్పలేదు అతను.
    "ఏం జరిగింది?"

 Previous Page Next Page