Next Page 

మానిని మనసు పేజి 1


                   మానిని మనసు

                                   -  వాసిరెడ్డి సీతాదేవి


    "అనూ! అనూ! ఏయ్ నిన్నేనోయ్!"
    "వస్తున్నానండీ!"
    "త్వరగా రావాలి."
    "ఏమిటండీ ఆ గావు కేకలు?" అంటూ అనసూయ వంటింట్లో నుంచి వచ్చింది.
    చేతులనిండా అట్టపెట్టెలు, ప్లాస్టిక్ బ్యాగులూ పట్టుకొని నిల్చుని వున్నాడు రమణమూర్తి.
    "అవన్నీ ఏమిటండీ?" ఆశ్చర్యంగా అడిగింది.
    "తీసుకొని చూడు! త్వరగా అందుకో నా చేతులు పీకుతున్నాయ్!"
    "బజారంతా కొనుక్కొచ్చి నట్టున్నారు" అందుకుంటూ అన్నదమసూయ.
    పాకెట్సు ఒక్కొక్కటే విప్పసాగింది. ఆమె కళ్ళలో కాంతిరేఖలు కదిలాయి.
    "బాగున్నాయా చీరలు?"
    "చాలా బాగున్నాయ్! అయినా ఒకేసారి ఇన్ని చీరలెందుకండీ!"
    "మీ ఆడవాళ్ళకు ఎన్ని చీరలున్నా తృప్తి ఉండదుగా?"
    "ఈ రోజుల్లో ఆడవాళ్ళకంటే మగవాళ్ళకే బట్టల మీద మోజు ఎక్కువైంది."
    "ఓహో రాణీగారు కొత్త విషయాన్ని కనిపెట్టినట్టున్నారు."
    "టికెట్లు దొరికాయా?"
    "వెయిటింగ్ లిస్టులో ఉన్నాం!"
    "కన్ ఫరమ్ కాకపోతే!"
    "నా స్నేహితుడు ఒకడు రైల్వేలో పనిచేస్తున్నాడు, రేపు కన్ ఫరమ్ చేయిస్తానన్నాడు."
    "మీరు బట్టలు తెచ్చుకోలేదేం?"
    "నాకున్నవి చాల్లె."
    "కనీసం రెండు షర్టులైనా కొనుక్కోకూడదూ."
    "ఈ నెల బడ్జెట్ అయిపోయింది. వచ్చే నెలలో కొనుక్కుంటాను."
    ఒక్కొక్క చీరే అద్దం ముందు నిల్చుని భుజం మీద వేసుకుని చూడసాగింది అనసూయ.
    ఆమె పెళ్ళయి ఆరు నెలలైంది. హనీమూన్ కు వెళ్లాలని ఎంతో కుతూహలపడింది. కాని రమణమూర్తికి ఆఫీసులో శెలవు దొరకలేదు. ఇంత కాలానికి భర్తతో కలసి ఊటీకి వెళ్ళబోతున్నది. భర్తతో ఊటీలో గడపబోయే మధుర క్షణాలను ఊహించుకుంటూ అద్దం ముందు నిలబడిపోయింది.
    ఒక ప్యాకెట్ లో మబ్బురంగు ఫుల్ హాండ్స్ స్వెట్టర్ కన్పించింది. దాన్ని చేతిలోకి తీసుకొని విప్పింది.
    "దేవిగారు అద్దం ముందు నుంచి కదులుతారా లేదా? నాకు ఆకలేస్తూంది?"
    "ఈ ఉలన్ స్వెట్టర్ ఎంతయింది?"
    "నూట ఇరవై."
    "అంత పెట్టి ఇప్పుడు ఇదెందుకండీ."
    "మనం వెళ్ళేది ఊటీకండీ" ఆమె మాటల్ని అనుకరిస్తూ అన్నాడు రమణమూర్తి.
    "ఎండలు మండిపోతుంటే స్వెట్టర్ ఎందుకూ?"
    "ఊటీలో ఇప్పుడూ చలిగానే ఉంటుంది." భార్య ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ మెత్తగా అన్నాడు.
    "నాకు ఒక స్వెట్టరుందిగా?"
    "దానికి చేతులు లేవు. అది ఊటీ చలికి పనికిరాదు."
    "మీకు మాత్రం చలివెయ్యదూ?"
    "నాకు రెండు ఉలెన్ సూట్సు ఉన్నాయిగా?"
    "నాలుగురోజుల భాగ్యానికి అంత పెట్టి ఈ స్వెట్టర్ కొనుక్కురాకపోతే ఏం! ఎలాగో ఉన్నదానితో సరిపెట్టుకునే దాన్నిగా?"
    "అంత కర్మ నీకేం వచ్చింది?"
    "ఇందులో కర్మ ఏముంది? అనవసరంగా డబ్బు ఖర్చు ఎందుకంటున్నాను."
    "ఏది శాశ్వతం అనూ!"
    "అంతేనా!"
    "అంతే!"
    "ఏదీ శాశ్వతం కాదా?" భర్త కళ్ళలోకి కొంటెగా చూస్తూ అంది.
    "ఏదీ శాశ్వతం కాదు."
    "మన అనుబంధం కూడా!"
    "మన అనుబంధం అమరం. అపూర్వం"
    "నిజంగా?"
    "సందేహంగా ఉందా?"
    "ఏమో! మగవాళ్ళను యెలా నమ్మడం!" నవ్వుతూ అన్నది అనసూయ.
    "నన్ను నమ్మవచ్చును. నువ్వు నా ఆరోప్రాణానివి, మన ఈ అనుబంధం శాశ్వితం - విడదీయరానిది - నాకు నువ్వూ నీకు నేనూ."
    "అబ్బాయిగారికి కవిత్వం పొంగు కొచ్చేస్తూంది."
    "ఈ అనుబంధం ఇలాగే ఉండాలని నేను ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను."
    "మధ్యలో వాళ్ళెవరు?" అంటూ అనసూయను బాహుబంధంలో బంధించాడు.
    భర్త చేతులనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నది ఆమె.
    "వదలండి! వేళాపాళా లేదు బొత్తిగా?" మెత్తగా అన్నది.
    "అయితే ఈ జన్మకు ఇంతే? ఏమిటి?" తన చేతుల్లో నుంచి జారిపోతున్న భార్యను గుండెలకు హత్తుకుంటూ అన్నాడు.
    అనసూయ చెంపలు కెంపులే అయ్యాయి.
    "ఇంకా పదమూడు జన్మలున్నాయి? అంతా ఈ జన్మలోనే తీర్చేసుకుకుంటే ఎలా?" అన్నది. వెంటనే సిగ్గుతో భర్త గుండెల్లో ముఖం దాచుకుంది.
    "అరెరె! అంతేనా?"
    "ఏమిటి?"
    "పదమూడు జన్మలేనా? ఏడైళ్ళు నలభై తొమ్మిది జన్మలు అనుకున్నానే! నీ దేవుణ్ణి ప్రార్ధించి కనీసం నలభై ఏడు జన్మలైనా ఉండేలా వరం పొందు. లేకపోతే నేను చాలా తొందరపడాల్సి ఉంటుంది" అన్నాడు రమణమూర్తి భార్యను గాఢంగా కౌగిలించుకొని.
    అనసూయ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ భర్త చేతులనుంచి జారిపోయింది.
    "భోజనానికి రండి!"
    "అప్పుడేనా?"

Next Page