Next Page 

బొమ్మరిల్లు పేజి 1


                               బొమ్మరిల్లు

                                                                           -వాసిరెడ్డి సీతాదేవి

 

                                       


    మద్రాసు జనరల్ ఆసుపత్రిలోని క్యాంటీన్.


    తెల్ల కోట్లలో యువతీ యువకులు కుర్చీలలో కూర్చుని ఉన్నారు. కొందరు బైటికి వెళ్తున్నారు. మరికొందరు సీట్లకోసం వెతుక్కుంటున్నారు.    

    
    ఆ వాతావరణంలో ఉత్సాహం ఉరకలు తీస్తోంది. యవ్వనం ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతోంది. కిలకిల నవ్వులు. 'హాయ్! హాయ్!' అనే పలకరింపులు. ఫలహారాలు అందించే సర్వర్స్ ను కొందరు టీస్ చేస్తుంటే, కొందరు స్నేహితులతో మాట్లాడినట్టు జోక్స్ విసురుతూ మాట్లాడుతున్నారు.


    కొందరు కబుర్లలో మునిగిపోతే, మరికొందరి కళ్ళు యువతుల్ని పరిశీలిస్తున్నాయ్.

    
    ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గిర నలుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూర్చుని ఉన్నారు. కాఫీ సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంచెం దూరంలో ఉన్న యువతులు ఎందుకో కిలకిల నవ్వుతున్నారు. చాలామంది యువకులు కళ్ళు నవ్వులు వినిపిస్తున్న వైపుకు తిరిగాయి.


    "ఒరేయ్ హనుమంతూ! నీ పేరు మార్చుకోరా! బొత్తిగా బాగాలేదు" అన్నాడు సుధాకర్.


    "అవునుర్రా! కమలాకర్ అని పెట్టుకో!" అన్నాడు రమేశ్.


    "నాకీ పేరేబాగుందిరా! అచ్చ తెలుగు పేరు. హనుమంతరావు. ఆంధ్రాకు వెళ్ళి పదిమంది ఉన్నచోట 'ఒరే హనుమంతురావ్!' అని పిలవండి. కనీసం ఇద్దరైనా తిరిగి చూస్తారు." స్పోర్టివ్ గా అన్నాడు హనుమంతరావు. అందరు గొల్లున నవ్వారు?


    "ఎందుకు పిరికి రింగో!" (ఎందుకు నవ్వుతున్నారు?) అన్నాడు జయకాంతన్.


    "నిన్ను చూసే! పేరు బ్రహ్మాండంగా ఉంది. కాని ముఖమేమాడు చెక్కలా వుంది. కాళ్ళూ చేతులూ తుమ్మమొద్దులా..." మళ్ళీ అందరూ నవ్వారు.

    
    "ఎన్నా పేశరా?" (ఏమంటున్నాడు?) గౌతమ్ చూస్తూ అడిగాడు.

    
    "ఉన్నఒల్లుం సోల్లలే!" (నిన్ను ఏమీ అనలేదు). అన్నాడు హనుమంతరావు.


    జయకాంతన్ చూడటానికి లారీడ్రైవర్ లా ఉంటాడు. చాలా మొరటుగా కన్పించడమే కాకుండా మొరటుగా ప్రవర్తిస్తాడు కూడ. సుధాకర్ మాటలు అర్థం అయి ఉంటే ఈపాటికి అతను టేబుల్ కిందకు దూరాల్సి వచ్చేది.


    గౌతమ్ గంభీరంగా ఉన్నాడు. ఆ మాటలు అతనికి వెకిలిగా అన్పించాయి.


    "ఒకరిరూపాన్ని విమర్శించడం, అదీ ఆ వ్యక్తికి తెలియని భాషలో దారుణం. మన మానసిక స్థాయిని తెలుపుతుంది" అన్నాడు గౌతమ్.


    "వీడొకడ్రా. ప్రతిదానికీ నీతులు బోధిస్తాడు" అన్నాడు సుధాకర్.


    "అయితే నువ్వు అన్న మాటలు జయకాంతన్ కు చెప్పమంటావా?"


    "ఒరేయ్! బాబూ! అంతపని చెయ్యకురా. నావళ్ళు హూనం చేసేస్తాడు." బ్రతిమాలుకున్నాడు సుధాకర్.


    "ఎన్న? అవన్ ఎన్నపేశం?" గౌతమ్ ను ప్రశ్నించాడు జయకాంతన్.


    సుధాకర్ భయం భయంగా గౌతమ్ ముఖంలోకి చూశాడు.


    అంతలో ఎవరోపిలవడంతో జయకాంతన్ లేచి బయటికి వెళ్ళాడు.


    "అంత భయపడేవాడివి అలాంటి మాటలు ఎందుకనాలీ? దాన్నే అంటారు అసమర్థుని దుర్జనతం అని" అన్నాడు గౌతమ్. సుధాకర్ ముఖం ముడుచుకున్నాడు.


    "అసలు సంగతికి వద్దాం? వాతావరణంలో గాంభీర్యాన్ని సడలించడానికి అన్నట్టు అన్నాడు రమేశ్.


    "ఏమిటి అసలు విషయం?"


    "అదే నీపేరు మార్పు గురించి"


    "వాడికి ఏపేరుంటేనేంరా! పూల రంగడు!" అన్నాడు సుధాకర్.


    "అవును! జల్సారాయుడు వాడికేం! ఎంతమంది ఆడపిల్లల్ని తన చుట్టూతా తిప్పుకుంటున్నాడో చూడటం లేదూ!" అన్నాడు రమేశ్.


    హనుమంతరావు తలపైకెత్తి సిగరెట్ పొగను విలాసంగా ఊదాడు.


    "ఒరేయ్ అంబుజాన్ని కాపాడుకోరా!"


    హనుమంతరావు నిర్లక్ష్యంగా నవ్వాడు.


    "అవున్రాపిట్ట ఎగిరిపోయేలా ఉంది. ఈ మధ్య ఆ రాఘవన్ తో తిరుగుతోంది"


    హనుమంతరావు ఘోల్లున నవ్వాడు.


    "నవ్వుతావేంరా? మేము అబద్ధం చెప్పడంలేదు. మొన్నరాత్రి బీచ్ లో చూశాను వాళ్ళిద్దర్నీ!"


    "ఓహో! అయితే నువ్వు కూడా ఆ అమ్మాయిని వెంటాడుతున్నావన్నమాట!" గౌతమ్ అన్నాడు.


    "ఛ! అదేంమాట! నేను మనవాడికి ద్రోహం చేస్తానా!"


    "నీమొహం! అది నువ్వు ఎంత వెంటపడ్డా తిరిగి కూడా చూడదు. దానికి కావాల్సింది డబ్బు!" అన్నాడు హనుమంతరావు.

    
    "అదికావాలన్నా నేను దాని ముఖం చూడను" ఉడుక్కున్నాడు సుధాకర్.


    "ద్రాక్షపళ్ళు పులుపు" అన్నాడు గౌతమ్.


    "ఏమంటోయ్. నేను ఏం మాట్లాడినా నువ్వు మహా ఇదిచేస్తున్నావ్?" కోపంగా అన్నాడు సుధాకర్.


    "సులోచన కూడా దక్కేలాలేదు. దాన్ని నిన్న శ్రీనివాస్ తో పానగల్ పార్కులో చూశాను"


    "ఊ" అన్నాడు హనుమంతరావు నిర్లక్ష్యంగా.


    "నిజంగా రా! గౌతమ్ కూడా చూశాడు! ఏరా గౌతమ్ నేను చెప్పింది నిజమే కదూ?" అన్నాడు రమేశ్.


    గౌతమ్ మాట్లాడలేదు. ముఖం చిట్లించుకున్నాడు.


    "ఏరా గౌతమ్ నీకోటు బొత్తిగా చిరిగిపోయినట్టు ఉంది. సాయంకాలం నాతో బజారుకురా!"

    
    "ఎందుకూ?"


    "కొత్త కోటుకుట్టిస్తాను" అన్నాడు హనుమంతరావు.


    "అక్కర్లేదు" గౌతమ్ ముఖం ఎర్రబడింది.


    "ఒరేయ్ మేము అంబుజం గురించీ, సులోచన గురించీ మాట్లాడుతూ ఉంటే, నువ్వు వాడి కోటు గురించి మాట్లాడతావేంరా?" అన్నాడు రమేశ్.


    "జాగ్రత్తపడరా బాబూ! లేకపోతే పిట్టలు ఎగిరిపోయే ప్రమాదం ఉంది"


    "ఉష్! అంతేగదా?"


    "అంతేనంటావా?"

Next Page