Next Page 

చీకటి కడుపున కాంతి పేజి 1

 

                       చీకటి కడుపున కాంతి

                                                                                సి. అనందారామం

                         

 

    తెలతెలవారుతోంది.చెరువులో కమలాలు మత్తుగా బద్దకంగా విచ్చుకోలేక ముడుచుకుపోతున్నాయి. అతి పలచని అరుణ కిరణాలు చెరగని చీకట్లోనే కాంతులను చూపిస్తున్నాయి. ప్రకృతి మొత్తం మత్తుగా అవులిస్తుంది. మైకం వదిలించుకొంటూ పక్షులు గొంతు సవరించుకొన్నాయి.
    ప్రకృతి మైకపు చూపులకు రాగరంజితుడయిన అరుణుడు తన నులి వెచ్చని కరాలతో చక్కలిగిలి పెడుతున్నాడు. ఒక చేత్తో తెల్ల చీర నల్లని అంచు కొద్దిగా కాళ్ళ మించి పైకి పట్టుకొని, మరొక చేతిని గట్టు మీద ఆనించి ఆ చేతి మీద కొద్దిగా వెనక్కు జరిగి , చెరువులోని నీళ్ళలో కాళ్ళు కీరాడేసి లోపలి చూసుకోలేక చూపులను చుట్టుపక్కలకు తిప్పిన వారిజ ఒక్కసారి ఉలిక్కిపడింది.
    ఆమెనలా ఉలిక్కిపడేలా చేసినది మరొక జతకళ్ళు. ఆ కళ్ళు రామచంద్రం. వారిజ ఉలికిపడే వరకూ తను వారిజ కేసి కళ్ళప్పగించి చూస్తున్నానని రామచంద్ర కే తెలీదు. వారిజ ఉలికిపాటు వల్ల తనున్న తన్మయత్వం లోంచి బయటికి రాగలిగాడు. బహ్యస్మృతి రాగానే భరింపరాని లజ్జ ఆవేశించింది. చటుక్కున తల వంచుకుని చకచక అడుగులు వేస్తూ కదిలి పోయాడు.
    ఏదో తన్మయత్వంలో ఉన్నట్లున్న అతని చూపు ---- అంతలో కలిగిన బెదురూ - ఏదో తప్పు చేసిన వాడిలా లజ్జతో చక చక కదిలిపోతున్న కాంతి వంతమైన అతని ఆకృతి - ఇవన్నీ ఒక దానిని మించిన వేగంతో మరొకటి వారిజ మనసును ఆవరించుకున్నాయి . కొన్ని క్షణాలు అలాగే కూర్చుని నవ్వి అక్కడ నుంచి లేచింది.
    ఆ తరువాత రోజు కూడా అతను కనిపించాడు వారిజకు. కానీ , ఈసారి ఇది వరకు లాగ గబగబ నడిచిపోలేదు. ఒకసారి వారిజ వంక చూసి తల వంచుకున్నాడు. కొద్ది సేపట్లోనే మళ్ళీ తలెత్తి వారిజ వంక చూశాడు. ఆ ప్రయత్నంగా ఆమె నవ్వింది.
    సిగ్గిపదినట్లు తల తిప్పుకుని నెమ్మదినెమ్మదిగా కదిలిపోయాడు. ఆ తరువాత రోజు వారిజ అతని కోసం చూస్తూ కూచుంది. బాగా తెల్లవారిపోతుండగా నెమ్మదిగా వస్తున్నాడు. వారిజను అతడు చూశాడనటానికి గుర్తుగా తల బాగా వంచుకుని ఎటూ తిఅప్పకుండా ఏటి కేసి వస్తున్నాడు. బాగా దగ్గరిగా చూడగలిగింది అతడ్ని. పచ్చని శరీరచ్చాయ, చిన్న కళ్ళు, రేఖలుగా సాగిన కనుబొమ్మలలో పలచని చెక్కిళ్ళలో, కొద్దిగా ముడుచుకున్నట్లున్న పెదవులలో ఏదో అమాయకత్వం కన్పిస్తోంది. పెద్ద రూపసి అనడానికి లేకపోయినా ఒక వింత ఆకర్షణ వుంది మనిషిలో-
    "ఇంత ఆలస్యంగా వచ్చారేం?"
    "ఉలిక్కిపడి తలెత్తాడు - ఎదురుగా సౌందర్య దేవతలా చిరునవ్వుతో మెరుస్తోన్న వారిజ." ఆ ప్రభాత కాంతులతో , పులకరింతలతో విచ్చుకొంటున్న కమలంలా స్నిగ్ధంగా మెరసి పోతోంది నిలువునా. ఎన్నాళ్ళ నుండో పరిచయం ఉన్నదానిలా అతి చనువుగా అడిగేస్తోంది. చిత్రం! తనకూ ఆమె అపరిచితలా కనిపించటం లేదు.
    తెల్లని జరీ చీర, తెల్లని జాకెట్టు, తెల్లని ముత్యాల గొలుసు, తెల్లని పూవులు ....ఆ ధవళతేజోరాశితో కాంతి పుంజంగర్భాన కటిక చీకటిలో నల్లని నల్ల పూస తాడు కంఠాన్ని చుట్టుకొని అతడ్ని భయపెట్టింది.
    ఆ నల్ల పూసల మీద నిలిచిన చూపులు బలవంతాన మరల్చుకుని సమాధానం చెప్పాడు. "ఈపాటికి మీరు వెళ్ళిపోతారను కున్నాను. "కిలకిల నవ్వింది వారిజ. ఆ నవ్వులలో అప్పుడప్పుడే చైతన్యం పుంజు కొంటున్న ప్రకృతి యావత్తూ ఊగిపోయింది.
    ప్రకృతి సిద్దంగా బిడియస్తుడయిన అతని బిడియం కరిగిపోయింది. కనురెప్పలెత్తి , తనను తాను మరిచి ఏదో అపూర్వ దృశ్యం చూస్తున్నట్లు మధుర విభ్రాంతితో నిలిచిపోయాడు. అపుడు తెలిసింది వారిజకి - అతని కన్నులలో అమాయకత్వం మాత్రమే కాక తీక్షణత కూడా ఉందని. వల్లమాలిన బిదియానికే కాక అలవి మానిన ఆత్మాభిమానానికి కూడా అతని అంతరంగ నెలవు అని.
    "ఇప్పుడు వెళ్ళిపోతారా మరి?" చిలిపిగా అడిగింది ఏదో ఆర్ద్రత అంతర్లీనమయిన చిలిపితనం, చైతన్యం తొణికిసలాడే  ఆ తళతళ లాడే కన్నుల్లోకి రెండు క్షణాలు చూసి చటుక్కున తల వంచుకుని అన్నాడు ......
    'అంత తేలిగ్గా కదలలేననిపిస్తోంది ... అయినా వెళ్ళి పోడానికే ప్రయత్నిస్తాను" గిర్రున వెనక్కు తిరిగి రెండడుగులు వేశాడు. "ఆగండి" నవుతూ అంది వారిజ. ఆవిడ ఆ మాట అంటుందని ముందే ఊహించినట్లు ఆగి దగ్గరగా వచ్చాడు రామచంద్ర.'
    రెండు రోజుల్నుంచి ఎందుకంత తెల్లవారు జామునే వస్తున్నారు మీరిక్కడకు?"
    "రెండు రోజులనుంచి వస్తున్నది మీరు. నేను చాలా కాలంగా రోజూ వస్తున్నాను. తెల్లవారితే అందరూ వస్తారు. అందుకని తెల్లవారు జామునే వచ్చి ఏటిలో ఈతలు కొట్టుకుంటాను." "మరి ఏటిలో దిగకుండానే వెళ్ళిపోయారేం?"
    రామచంద్ర సమాధానం చెప్పలేదు. తలెత్తి ఒక్కసారి వారిజ కళ్ళల్లోకి చూశాడు. "సమాధానం మీకు తెలుసు" అన్నట్లు. "మీ ఏకాంతానికి అంతరాయంగా నేను దావుపించానన్నమాట!" నవింది వారిజ.
    "దాపురించలేదు, సాక్షాత్కరించారు అంతరాయంగా కాదు .....ఆశించిన అదృష్టంలా ..."
    "కవిత్వం చెపుతున్నారు......"
     "నేను కవిని కాను...కనీసం రచయితనయినా కాను . మాములు రైతును."
    "మీరు చదువుకోలేదా?" ఆశ్చర్యంగా అడిగింది వారిజ.
    "ఎగ్రికల్చర్ బి.ఎస్.సి. పాసయ్యాను. సొంత వ్యవసాయం చేసుకుంటున్నాను."
    'ఓహో..." అని ఆగింది వారిజ.
    "మీరు .......?" సందేహపు తెరలు చీల్చుకుంటూ అడిగాడు.
    "నేనా? నేను? ఏమో, నాకేం తెల్సు?"
    "అదేమిటి?"
    "మనమెవరమో మనకు తెలియకపోవడమే కదా సృష్టి రహస్యం."
    "వేదాంతం మాట్లాడుతున్నారా?"
    "కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ జీవితంలో వేదాంతంగా పరిణామించనిదేది?"
    'నిజమే! లోతుగా ఆలోచిస్తే ప్రతీదీ వేదంతంలానే అనిపిస్తుంది. కాని అప్పుడు వేదాంతం అంటే చప్పని శున్యత్వం కాదని మమతా మానవతలతో అల్లుకున్న దివ్యతపు సోపాన పంక్తని అర్ధమౌతుంది. " కళ్ళు విప్పార్చుకుని చూసింది వారిజ. అంతలో అప్రయత్నంగా ఆ నల్లని కళ్ళలో తెల్లని నీటి బిందువులు మిలమిల లాడాయి.
    కలవరపడ్డాడు రామచంద్ర.
    "ఊహు! మిమ్మల్ని గురించి ఏమి అడగను. కాని ఆ నీటి బిందువులు ! ..అవి తుడిచెయ్యండి! నా కారణంగా ఆ అందమైన కళ్ళలో కన్నీరు చోటు చేసుకుంటే నేను సహించలేను." వారిజ చప్పున కళ్ళు తుడుచుకుంది.
    "అవి కన్నీళ్లు కావు - మీ కారణంగా రాలేదు .....నా గురించి చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు." ఒక్క క్షణం ఆగి అల్లరిగా నవ్వి అంది వారిజ. "కాని యిలా మనం నిలబడి మాట్లాడుకొంటుంటే నలుగురూ ఏమనుకుంటారు? అప్పుడే చూడండి , ఏటి కొచ్చే వాళ్ళంతా మన కేసి ఎలా చూస్తున్నారో!"
    రామచంద్ర ముఖం ఎర్రబడి పోయింది. వడలి పోయిన ముఖంతో "వస్తాను" అంటూ అడుగు ముందుకూ కదిపాడు. "రండి - మా ఇంటికి , వీలు చూసుకుని . రామాలయం తెలుసుగా , దాని కెదురుగా ఉన్న సందులో పెంకుటిళ్ళ మధ్య పెద్ద మేడ నాది వస్తారుగా?"

Next Page