Next Page 

ఆత్మబలి పేజి 1


                                 ఆత్మబలి

                                                                    సి. ఆనందారామం

                          


    సభలో మారుమ్రోగుతున్న కరతాళధ్వనులకు ఆశ్చర్యపోయింది గ్రీన్ రూంలో ఉన్న శోభారాణి. సభికులనంత సమ్మోహపరచిన దేమిటా అని సైడ్ వింగ్ లోంచి చూసింది. వక్త ఉపన్యాసంలోని ఏదో చమత్కారానికి సభికులంతా హర్షధ్వానాలు చేస్తున్నారు. అదేమిటో ఆవిడకు తెలియలేదు. వక్తవంక నిదానించి చూసింది. మనిషి పొడగరి కాదు. పొట్టి అనడానికీ వీల్లేదు. కళ్ళు పెద్దవి కావు.. కాని చురుగ్గా, తీక్షణంగా ఉన్నాయి. కొనదేరిన ముక్కు ముచ్చటగా ఉంది. పెదవులు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉన్నాయి. ఆ చిరునవ్వులో చిలిపితనం, గడుసుతనం తొంగిచూస్తున్నాయి.
    సభికులనింత ముగ్ధులను చేసిన అతని ఉపన్యాసం విందామని అక్కడే నిలబడింది.
    "ఈనాడు మనదేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ప్రతి పౌరుడూ నిర్విరామంగా కృషి చెయ్యవలసిన సమయం ఇది. విద్యాధికుల బాధ్యత మరీ ఉంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను వాటి స్వరూపమే తెలియని సామాన్య ప్రజలకు వివరించటం విద్యాధికుల కనీస కర్తవ్యం. అనేక సమస్యలకు మూలం అజ్ఞానం. ఈనాటికీ మన దేశంలో రాత్రి పాఠశాలలు ఉండవలసినన్ని లేవు. వయోజన విద్యా వ్యాప్తికి జరగవలసినంత కృషి జరగటం లేదు. 'ఇది నా దేశం. ఈ సమస్యలు నావి' అన్న భావన ఇప్పటికీ గాఢంగా అందరి హృదయాల్లోనూ చోటుచేసుకోలేక పోతూంది. హక్కుల కొరకు పోరాడే తీవ్రత కనిపించనంతగా బాధ్యతా నిర్వహణలో వ్యగ్రత కనిపించటం లేదు. దేశరక్షణ నిధికి విరాళాలూ బంగారము పోగుచెయ్యటమూ, సిపాయిలకు కావలసిన స్వెట్టర్స్ వగైరా తయారుచెయ్యటమూ, ఏ సామాన్యులైనా చెయ్యొచ్చు. ఆ పూనిక ఎంతమందికి?
    "దేశం బయట శత్రువులు మారణాయుధాలతో బెదిరిస్తున్నారు. లోపల ఆర్థిక సమస్యలు, ఆహార సమస్యలు, అర్థం లేని విభేదాలు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్నవాడెవడూ గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోలేని తరుణమిది.
    "ఇట్లాంటి పరిస్థితులలో కూడా అమూల్యమైన తమ కాలాన్ని ఈ రకంగా వినోద ప్రదర్శనలకు వినియోగించే ఈ 'యువజన సాంస్కృతిక సమాజం' వారి ఉత్సాహాన్ని ఎలా అభినందించాలో తెలియటం లేదు. ఇట్లాంటి సమాజాలు ఇంకో నాలుగయిదుంటే దేశం చాలా త్వరలో ముందుకొస్తుంది."
    శోభ నిర్ఘాంతపోయింది.
    ఏమిఁటిది? ఇతను సమాజాన్ని పొగుడుతున్నాడా? లేక తిడుతున్నాడా? సమాజాన్ని గురించి మాట్లాడమంటే ఇదా?
    సభలో కరతాళధ్వనులు మార్మోగుతున్నాయి. మూర్తి, కేశవ, భాస్కరరావులు కూడా హుషారుగా చప్పట్లు కొడుతున్నారు.
    "మూర్ఖులు" అంటూ తనలో తానే విసుక్కొని విసురుగా గ్రీన్ రూంలోకి వచ్చేసింది శోభారాణి.
    ఆరోజు ఏలూరు ఆంద్ర యువజన సాంస్కృతిక సమాజం వార్షికోత్సవం. శోభాదేవి, సరోజిని, మాలిని, మూర్తి, కేశవా, భాస్కరరావులు ఆ సమాజానికి మూల స్తంభాల్లాంటివాళ్ళు. అసలలాంటి సమాజమొకటి ఏర్పడటానికి ముఖ్య కారకురాలు శోభాదేవి. ఆమెకు కుడిభుజం సరోజిని. ఉత్సాహమూ, సాహసమూ, మనోబలమూ, శక్తీ శోభాదేవిని. ఆర్థికమైన అండదండలు సరోజినివి. వాళ్ళిద్దరూ చేసే ప్రతిపనిలోనూ వంకపెట్టి పొడుపుమాటలనకపోతే మాలినికి తోచదు. అందుకే ఆమె వాళ్ళిద్దరినీ వదలదు.
    కేశవ, భాస్కరరావు అవివాహితులు. ఇట్లాంటి ఉత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టిస్తానంటే సహకరించటానికి సంతోషంతో పూనుకున్నారు. మూర్తి వివాహితుడు. అయినా, అన్నింట్లోనూ తనున్నానంటాడు.  
    సరోజిని వాళ్ళింట్లోని విశాలమైన ముందుగది ఈ సమాజానికి ఇచ్చేసింది. వాళ్ళ దొడ్డంతా పరిశుభ్రం చేయించి నెట్ కట్టించారు.
    ప్రవేశ రుసుము రెండురూపాయలు. ప్రతినెలా ఒక రూపాయి చందా అని నిర్ణయించారు. ఈ డబ్బులెక్కల బాధ్యత భాస్కరరావు కప్పగించింది శోభ. మూర్తి, భాస్కరరావు, శోభ, మాలిని తాలూకా ఆఫీస్ లో గుమాస్తాలు. కేశవరావు విద్యార్ధి, చిన్నవాడు. సమాజంలో ఇటీవలే చేరాడు. సరోజిని బాగా డబ్బున్న, చదువంటని మంచి మనసుగల కన్నెపిల్ల. ఆలిండియా రేడియోలో శోభకంఠస్వరం విని అతిప్రయాసతో ఆమె చిరునామా కనుక్కొని వెతుక్కుంటూ ఇంటికి వచ్చి శోభతో స్నేహం చేసుకుంది.
    "జీవితం మరీ యాంత్రికంగా ఉంది. ఏదైనా ఒక సమాజం లాంటిది ఏర్పాటు చేసుకుని నలుగురం ఒకచోట చేరి ఆటలూ, లైబ్రరీ మొదలైన వేర్పాటు చేసుకుంటే కాస్త హుషారుగా ఉంటుందేమో?" అంది శోభ ఒకనాడు. వెంటనే ఆ సూచనకు అంగీకరించింది సరోజిని. అంగీకరించటమే కాక కార్యరూపంలోకి దింపింది. ఇంత చక్కని ఆలోచన వచ్చినందుకు శోభను ప్రశంసించాడు భాస్కరరావు. తనూ చేతులు కలిపాడు.
    "ఇట్లాంటివి నాకు గిట్ట"వని మూతి ముడుచుకున్న మాలిని సమాజానికి దూరంగా ఎక్కువరోజులుండలేకపోయింది.
    రింగ్, బాడ్ మింటన్, షటిల్ కాక్ ఆటలు మొదలయ్యాయి. అన్నిరకాల మేగజైన్సు తెప్పించారు. మంచి మంచి పుస్తకాలు కూడా కొంతవరకు సేకరించారు. చివరకు అలా ఇలా చాలామంది పోగయి, ఆ సమాజానికి మంచిబలం వచ్చింది. ఇటీవలనే సమాజంలో చేరిన కేశవ లైబ్రరీ బాధ్యత వహించి దాన్ని వృద్ధి చెయ్యటానికి చాలా పాటుపడ్డాడు. తన స్వంత ఖర్చుతో నాలుగయిదు పుస్తకాలు కొని లైబ్రరీకి బహూకరించాడు. ఒక్క సంవత్సర కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిన సమాజాన్ని చూసి గర్వపడింది శోభ. ఇంకొక్క వారంరోజుల్లో సమాజం స్థాపించి సంవత్సరమవుతుంది. "వార్షికోత్సవం చేసుకుంటేనో?" అంది శోభ.
    "చాలా బాగుంటుంది. కాని డబ్బు?" అన్నాడు భాస్కరరావు. అతనికి డబ్బు లెక్కలు బాగా తెలుసు.
    "చందాలకు తిరగండి" వెక్కిరింపుగా అంది మాలిని.

Next Page