Next Page 

అజ్ఞాత బంధాలు పేజి 1


                           అజ్ఞాత బంధాలు

                                                                            సి.ఆనందారామం

 


    "ర....త్న....మ్మా!"
    ఒక్కొక్క అక్షరమూ అప్రయత్నంగా వచ్చింది లలిత నోటినుండి.
    "రత్నమ్మ కాదు. రాగిణి" కిలకిల నవ్వింది, పల్చని జార్జట్ చీరలో స్పష్టంగా కనిపిస్తోన్న అంగసౌష్ఠవంతో... విలాసంగా     నిలబడి మెడలో మెరుస్తోన్న నెక్లెస్ తో ధగధగలాడుతోన్న రాగిణి.
    "రా! కూచో!" లలిత భుజాలమీద చేతులు వేసి కూచోబెట్టబోయింది రాగిణి.
    జడ ప్రాయంగా నిలబడ్డ లలిత ఆ స్పర్శకు జుగుప్సతో జలదరించింది. రాగిణి చేతులు విదిలించింది.
    భగ్గుమంది రాగిణి. మనసు ఎంత నిశితమైనదో, అంత సుకుమారమైనది. అన్ని విషయాలూ గాఢంగా అనుభవిస్తుంది. ఆ అనుభూతి గాఢమైనకొద్దీ దానిని వెలిగ్రక్కటానికే ప్రయత్నిస్తుంది. రాగిణి మనసులో మంటలు బయటపడాలి!
    "నువ్వే నెగ్గావు రాజూ!" అంది రాజువైపు తిరిగి నవ్వుతూ.
    అంతవరకూ పాలిపోయిన లలిత ముఖం మీదే చూపులు నిలిపిన రాజు ఎవరో చెయ్యిపట్టుకుని తిప్పినట్లు రాగిణి వైపు తిరిగి "ఇహిహి!" అని నవ్వాడు.
    ఆ నవ్వు విని ఆశ్చర్యపోయింది లలిత. ఆ సందర్భంలో రాజు నవ్వినందుకు కాదు- ఆ నవ్వులో వున్న చవటతనానికి! స్వయంకృషితో I.A.S. ఆఫీసరయిన రాజులో తెలివితేటలు మాత్రమే చూసింది లలిత ఇంతవరకు.
    ఎంతటి విజ్ఞానవంతులయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏరికోరి చవటతనాన్ని ఆహ్వానిస్తారా? లేక అద్భుతమయిన మేధను వెన్నంటే అజ్ఞానం దాక్కుని ఉంటుందా? అవకాశం రాగానే బయటపడుతుందా?
    "అన్నట్లు లలితా! నీకు మా పందెం గురించి తెలియదుకదూ! చెప్తానుండు! నేను నిన్ను చూడాలనుకున్నాను. నిన్ను తీసుకురమ్మని రాజుతో చెప్పాను. నువ్వే వస్తావన్నాడు రాజు. "లలితకు అభిమానం ఎక్కువ_ రాదేమో!" అన్నాను. "రెండు మూడు రోజుల్లో రాకపోతే చూడు! లలిత నన్ను చూడకుండా ఉండలేదు!" అని పందెం వేశాడు. ఏం పందెమో తెలుసా? ఒక తియ్యటి ముద్దు_ బండబ్బాయి! పందెం గెలుచుకున్నాడు. ఏయ్ రాజూ! "ఆఫ్ట్రరాల్, ముద్దు మాత్రమే కదా" అనుకునేవు! నా ముద్దు ఖరీదు ఎంతో తెలుసా? అయిదు వందల రూపాయలు!"
    పకపక నవ్వింది రాగిణి! రాగిణితో కలిసి నవ్వాడు రాజు! అది నవ్వెనా? నవ్వటం కనిపిస్తోంది మరి!
    ఎవరో మనసు హిప్నటైజ్ చెయ్యక్కర్లేదు. చాలా సందర్భాల్లో మనను మనమే హిప్నటైజ్ చేసుకుంటూ బ్రతికేస్తాము. అదే నిజం బ్రతుకనుకుంటాము!
    తన ముద్దుకు విలువ రూపాయలలో చూపిస్తోంది రాగిణి. ఆ విలువను అలాగే గ్రహిస్తున్నాడా రాజు?
    'లలిత నన్ను చూడకుండా ఉండలే'దని పందెం వేశాడు రాజు! ఆ పందెం నెగ్గినందుకు రాగిణితో కలిసి నవ్వుతున్నాడు!
    ప్రతిరోజూ రాజు లలితను కలుస్తూనే ఉంటాడు. ఆఫీస్ పని పూర్తయ్యాక లలిత ఇంటికి రావటం, ఇంటనో_ బయటనో_ ఇద్దరూ సాయంత్రాలు సరదాగా గడపటం పరిపాటి.
    వారం రోజులుగా రాజు రాకపోవటంతో లలిత మొదట కోపగించుకుంది. తరువాత తల్లడిల్లిపోయింది. రాజు ఆరోగ్యం పాడయి ఉంటుందనే ఆలోచన తప్ప మరొక ఆలోచన రాలేదు లలితకి. రాజు దగ్గరకి బయలుదేరి వస్తూ తెలిసిన దేవతల కందరికీ మొక్కుకుంది రాజు ఆరోగ్యంగా కనిపించాలని.
    దేవతలు కరుణించారు. రాజు ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. కానీ...
    దేవతలనేవాళ్ళు నిజంగా ఉండి కోరిన కోరికలన్నీ ప్రసాదిస్తే మానవులు సుఖపడగలరా? అంతులేని ఆశలతో అలమటించిపోతూ ఒకదాని వెనుక మరొకటిగా కోరికలు పెంచుకునే మనుష్యులలో నిజంగా తమకేం కావాలో తమకు తెలిసిన వాళ్లెందరు?
    రాజు నవ్వుతున్నాడు_ శత్రువర్గంలో ఉన్న గూఢచారి శత్రువులు తనను గుర్తుపట్టకుండా నవ్వినట్లు నవ్వుతున్నాడు! తనదికాని నవ్వును తనదిగా చేసుకుని నవ్వుతున్నాడు.
    లలిత లేచి "వెళ్తాను!" అంది శాంతంగా. ఆ శాంతం రాగిణికి నచ్చలేదు.
    "ఉండు లలితా వెళ్దువుగానీ! ఇదిగో, ఈ పూలు పెట్టుకో! వద్దంటున్నా రాజు ఇన్ని పూలు తెచ్చిపడేసాడు."
    దగ్గరగా వచ్చి తలలో పూలు పెట్టబోయింది రాగిణి. విసురుగా తల పక్కకు తిప్పింది లలిత. "వద్దు" అంది.
    రాగిణి వెటకారంగా నవ్వుతూ "ఎందుకు అంత కోపం!" అంది.
    "కోపం కాదు! ఏ రకం పూలనైనా ఎప్పుడంటే అప్పుడు పెట్టుకునే స్వభావం కాదు నాది!"
    లలిత మాటలు రాగిణి కర్థంకాలేదు. అదే రాగిణి అదృష్టం. పైపైకి తోచేవే తప్ప ఆలోచించవలసినవేవీ అర్థంకావు.
    రాగిణి ఒక్కసారి లేచి నిలబడి అభ్యాసవశాన వచ్చిన భంగిమలో అంగ సౌష్ఠవాన్ని అందంగా ప్రదర్శిస్తూ "నువ్వెప్పుడూ ఇంతే! అడవి మాలోకానివి!" అంది. "కదు రాజూ!" గారాబంగా దీర్ఘం తీసింది.
    "అవునవును! లలితకేం పట్టదు_ అడవి మాలోకం!" అన్నాడు రాజు. కానీ అలా అంటూ లలితను గౌరవంగా చూసాడు. లలితను గౌరవంగా చూశాడు. లలితను రాజూ రాగిణీ ఇద్దరూ "అడవి మాలోకం"గానే చూశారు. కానీ ఆ మాటకు రాగిణి అర్థంవేరు, రాజు అర్థం వేరు.
    "నేను వెళ్తున్నాను" అంది రాగిణి కొంటె నవ్వుతో ఓరగా రాజుని చూస్తూ.
    చటుక్కున రాగిణి చెయ్యి పట్టుకుని "వెళ్దువుగానిలే, వుండు!" అన్నాడు రాజు.
    రాగిణి ఆ చెయ్యి వదిలించుకోకుండా ఆకతాయితనంగా ఊపుతూ "ఎందుకు? ఎప్పటికయినా మీరూ మీరూ ఒకటే! నేనే మధ్యలో వచ్చి మధ్యలో పోయేదానిని" అంది ముద్దు ముద్దుగా.
    "రాగిణి చెయ్యి వదిలేశాడు రాజు. "ఉండు!" అన్నాడు గొణుగుతున్నట్లు.
    "లలితను కూడా ఉండమను! నాకొక్కదానికీ వుండాలని లేదు!" పెంకిగా అంది రాగిణి.
    లలిత రాజును చూస్తూ కూచుంది. లలిత చూపులు తప్పించుకున్నాడు రాజు.
    ఎంతటి బలహీనులైనా హిప్నటిజమ్ ప్రభావంలో ఎల్లకాలం ఉండలేరు. అప్పుడప్పుడు తాము బయట పడక తప్పదు.
    శాంతంగా స్థిరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఆ ఇంటి గడప దాటబోయేముందు కాళ్ళు వణికాయి లలితకి. కొంచెం తూలి తననెవరయినా పట్టుకునేలోగానే నిలదొక్కుకుని అక్కడనుండి బయటపడింది.

Next Page