TeluguOne - Grandhalayam
Money Bomb


                            మనీ బాంబ్

                                                                  - మైనంపాటి భాస్కర్

 

                                          

పంతొమ్మిది వందల ఎనభై అయిదో సంవత్సరం నవంబరు మొదటి తారీఖు :
రోజుకి దాదాపు నలభై లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొనివస్తూ భూమిని సమీపిస్తోంది 'హేలీ' తోకచుక్క. ప్రతి డెబ్బయ్ అయిదు సంవత్సరాలకీ ఒకసారి అది కనబడుతుంది. క్రితంసారి పంతొమ్మిదివందల పదవ సంవత్సరంలో కనబడి వెళ్ళిపోయిన ఆ తోకచుక్క దాదాపు ముప్ఫయ్యేడేళ్ళ క్రితం తన తిరుగు ప్రయాణం మొదలుపెట్టి, వర్ణనాతీతమైన వేగాన్ని పుంజుకుంటూ దగ్గరవుతోంది.
తోకచుక్క కనబడటం అరిష్ట హేతువు అని ఒక నమ్మకముంది. అది కనబడితే జాడ్యాలూ, జననాశనం, యుద్ధాలూ, రాజ్యాల పతనం, మహాపురుషుల మరణం సంభవిస్తాయని విశ్వసిస్తారు కొందరు.
1985 నవంబరులో హేలే తోకచుక్క జూపిటర్ గ్రహాన్ని దాటుతుంది. ఆ సమయంలో దానిని టెలిస్కోపు ద్వారా చూడవచ్చు. 1986 జనవరి ప్రాంతంలో అది టెలిస్కోపు సాయం లేకుండానే కనబడే సూచనలు ఉన్నాయి. 1986 ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం మూడున్నర - నాలుగున్నర గంటల మధ్య అది సూర్యుడికి అత్యంత సమీపంగా రావచ్చు. అప్పుడు దాని చుట్టూ ఉన్న ఒక మంచుపొర కరుగుతుంది. ఆ సమయంలో, తోక చుక్కను పరిశీలించి, ఇంత వరకూ అంతుబట్టకుండా ఉన్న సూర్యకుటుంబం పుట్టుక తాలూకు రహస్యాలనెన్నింటినో గ్రహించవచ్చునని శాస్త్రజ్ఞులు ఉద్వేగంతో ఎదురుచూస్తూ ఉంటే, దాని రాకవల్ల కీడు తప్పదని నమ్మేవారు భయందోళనతో సతమతమై పోతున్నారు.
క్రీస్తు జననానికి రెండువందల సంవత్సరాలకు ముందు-అదే తోకచుక్క వచ్చినప్పుడు, విషాదకరమైన పరిస్థితులలో మరణించగా, శరీరానికంతా రకరకాల రసాయనాలు పూసి, ఒక రహస్యమైన ప్రక్రియలో "మమ్మీ"గా మార్చబడిన ఒక అందమైన రాకుమారి సమాధి పరిసరాల్లో చలనం కలిగింది.
అలజడిగా మారింది వాతావరణం!

                                                          తోకచుక్క

పొద్దున ఎనిమిదిన్నర అవుతున్నా చలి ఇంకా తగ్గలేదు. ఎండ లేతగా ఉంది. నేవీబ్లూ రంగు టర్ట్ ల్ నెక్ స్వెట్టర్ వేసుకుని, రెండు చేతులూ జేబుల్లో పెట్టుకుని బస్ స్టాప్ లో నిలబడి ఉన్నాడు సందీప్.
ఆ బస్ స్టాపులో రంగురంగుల చీరెలు కట్టుకుని ఉన్న అమ్మాయిలూ, స్కర్టులూ, జీన్సూ, టాప్సూ వేసుకుని ఉన్న అమ్మాయిలూ చాలామంది ఉన్నారు. అక్కడ పూల వాన కురిసినట్లు అనిపిస్తోంది వాళ్ళని చూస్తూవుంటే. వాళ్ళలో ఎక్కువ మంది కాలేజ్ స్టూడెంట్స్.
లేత ఆకుపచ్చ రంగు చీరె కట్టుకుని ఉన్న అమ్మాయి మీద పడింది సందీప్ దృష్టి. ఆ అమ్మాయి కూడా క్రీగంట అతన్ని చూసి, పమిట సర్దుకుంది.
జనంలో కిక్కిరిసిపోయి, ఒక విఅపుకు ఒరిగిపోతున్నట్లున్న బస్సు వచ్చి ఆగింది. ఆ అమ్మాయితో బాటే బస్సు ఎక్కి, అందరినీ తోసుకుంటూ ముందుకు పోయి, తనని తాకేంత దగ్గరగా నిలబడ్డాడు సందీప్.
ఆ అమ్మాయి అభ్యంతరం ఏమీ ప్రదర్శించలేదు.
అసలు అతన్ని గమనించనట్లే ఇంకెటువైపో చూస్తోంది.
చిన్నగా దగ్గాడు సందీప్. రెండు వెళ్ళే మధ్య పట్టుకుని ఉన్న టిక్కెట్సుని ఆ అమ్మాయికి మాత్రమే కనబడేటట్లు ఒకసారి చూపించి, తర్వాత జేబులో పెట్టేసుకున్నాడు.
"మార్నింగ్ షోకి రెండు టిక్కెట్లు బుక్ చేశాను. ఓ.కే?" అన్నాడు మెల్లిగా.

Related Novels