Next Page 

డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 1


                               డా||వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం     

 

                                        
                 

                                                                సమత
                     (1971లో అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల)

 

    వారం రోజులుగా ఒకటే ముసురు. ఆ రోజే కొంచెం తెరిపి ఇచ్చింది. ఇళ్ళ గోడలు నెమ్ము పీల్చుకొని, మండు టెండలో శ్రమించే కష్టజీవుల చెమటలు కక్కుతున్న శరీరాలలా వున్నాయి. వాతావరణంలో చల్లదనం, చెమ్మా ఇమిడి ఉన్నాయి. ఆ వాతావరణంలో ఇందుపల్లి గ్రామం మృత్యుదేవత కౌగిలిలో చిక్కుకున్నట్లుగా వుంది.

 

    కలిగిన మహారాజులు కడుపులనిండా తిని వెచ్చటి దుప్పట్లలో దూరి గాఢ నిద్రపోతూ సుఖ స్వప్నాలు కంటున్నారు. భోషాణాల్లాంటి ఇళ్ళు లేనివారు, వేడినిచ్చే దుప్పట్లు లేనివారు, చల్లని నేలమీద నిద్రపట్టక మరో పక్కకు పొర్లటానికికూడా భయపడుతూ అలాగే పడుకొనివున్నారు. కడుపునిండా తిండి లేనివాళ్ళు మూడంకెలేసి నిద్ర పట్టించుకోవటానికి వ్యర్ధప్రయత్నం చేస్తున్నారు. కడుపులో మంట, చుట్టూ చల్లదనం, నిద్రాదేవికి కూడా ఆ దరిదాపులకు అడుగు పెట్టాలంటే భయంగానే వుంది. వృద్ధులు అంత చల్లదనంలో పడుకోలేక, పొడిగా వుందనుకొన్న మూలకుచేరి మోకాళ్ళు ముడుచుకొని కూచుని, చుట్టుముక్కతోనో, బీడీతోనో శరీరంలోకి వేడిని తెచ్చుకోటానికి అవస్థపడుతున్నారు.

 

    షావుకారు భద్రయ్యగారి గోడగడియారం ఆ గ్రామం గుండెల మీద పదకొండు కొట్టింది. ఆ గడియారం గంటలు ముఖ్యంగా రాత్రి పూట ఆ చిన్న గ్రామంలోని సగం ఇళ్ళకు వినిపిస్తాయి. చలికి నిద్ర పట్టనివారు ఆ గంటల్ని లెక్కపెట్టుకొని తెల్లవారటానికి ఇంకెన్ని గంటలు గడవాలో గుణించుకుంటున్నారు.

 

    కారుచీకటి నాలుగువైపులా వంచకుని హృదయంలోని కాలుష్యంలా వ్యాపించి వుంది. బావురు కప్పల బెకబెకలు, కీచురాళ్ళ కీచుధ్వనులు, అనేక క్రిమి కీటకాదుల చిత్ర విచిత్ర ధ్వనులు, జుట్టు విరబోసుకుని నిల్చునివున్న పిచ్చివాళ్ళలా తుమ్మచెట్లు, రాక్షస దయ్యాలు చేతులు చాచినట్లున్న మర్రిచేట్లు, శ్మశాన వాటికలో కొరివి దెయ్యంలా నిలబడివున్న రావిచెట్టు, అపశ్రుతులతో నిండి వుండే పతిత జీవితంలా భయంకరంగా వుంది వాతావరణం.

 

    నల్లటి ఎంబాసిడర్ కారు వచ్చి, రోడ్డుకు పక్కగా ఆగింది. నల్లటి ఔరంగాబాదు శాలువా కప్పుకొన్న ఒక స్త్రీ కారులోంచి దిగింది. గబగబా కాలువ కట్టపైన నడుస్తూంది. తాటితోపు దాటి తుమ్మచెట్ల మధ్యనుంచి నడుస్తూంది. ఆమె తన పరిసరాలను గమనిస్తున్నట్లులేదు. ఆమెకు భయంగా కానీ, జంకుగా కానీ లేదు. ఆ చీకట్లో నిల్చున్న చెట్లనూ, రకరకాల క్రిమి కీటకాదుల భయంకర ధ్వనులనూ ఏమాత్రం గమనించకుండా, తనూ ఆ వాతావరణంలో ఒక భాగంగానే కలిసిపోయి యాంత్రికంగా నడుస్తూంది. జీవితం ప్రసాదించిన చేదు స్మృతుల తాలూకు అనుభూతులతో ఆమె హృదయం భయంకరమైన కీకారణ్యంలా వుంది. కాళ్ళు బురదలోకి కూరుకుపోతూ వుంటే, అడుగడుక్కూ బురద అంటుకుంటూ చెప్పులు బరువెక్కుతున్నాయి. ఆమె ఆ చీకట్లోనే చేతి గడియారంకేసి చూసుకుంది. రేడియం డయల్ తో ఆ గడియారం అంకెలూ, ముళ్ళూ నిప్పురవ్వల్లా కణకణలాడుతూ కనిపిస్తున్నాయి- పదిమంది పాపులమధ్యలో వున్న పుణ్యాత్మునిలాగా!

 

    పదకొండూ ఇరవై అయింది. మరో పది నిమిషాల్లో వూళ్ళో ప్రవేశించగలదు తను. అతను తనను రమ్మంది పన్నెండు తర్వాత. ఇంతకాలం తర్వాత ఆ ఇంటి తలుపులు తనకోసం తెరుచుకోబోతున్నాయి. కాని వీలయినంత త్వరలో ఆ గుమ్మం ముందుకెళ్ళి వాలిపోవాలని హృదయం ఆరాటపడుతుంది. ముందు వెళితే తలుపులు తెరిచి వుండకపోవచ్చు. అయితేనేం ఆ గుమ్మం ముందు....ఒకప్పుడు తనదైన తనదే అయిన....ఆ ఇంటిగుమ్మం ముందు కాసేపు కూర్చుంటేనేం? కాని ఆ సమయంలో తనను ఎవరైనా చూసి పోల్చుకుంటే? అతను ఆ విషయాన్ని గమనిస్తే తనను లోపలకు రానివ్వడేమో! అప్పుడు తను ఇంత ఆశతో వచ్చీ, తన బిడ్డను చూడకుండానే వెళ్ళాల్సి వస్తుంది. తన బిడ్డను చూడకుండానే తిరిగి వెళ్ళాల్సి వస్తే?

 

    ఆ ఆలోచన ఆమె హృదయాన్ని క్రూరమృగంలా నమలసాగింది. బాధతో హృదయం గిజగిజలాడి పోతుంది. లేదు ఎప్పటికి జరగదు. తన బిడ్డను తను ఇవ్వాళ తప్పక చూస్తుంది.

 

    తుమ్మతోపు దాటి ఆమె ఊళ్ళో కాలు పెట్టింది. గుండెలు దడదడలాడాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత....సరిగ్గా పదిహేను సంవత్సరాల తరువాత...తను ఈ గడ్డమీద...పుట్టినగడ్డ కాదు...మెట్టిన గడ్డమీదే కాలు పెడుతూంది. తన పదిహేడో ఏట తను ఈ ఊరికి కోడలుగా వచ్చింది. ఆ ఇంటిలో పెళ్ళికూతురుగా కాలు...కుడికాలే పెట్టింది. ఆనాడు ఆ ఊరు తనను కుతూహలమైన కళ్ళతో నిండు హృదయంతో ఆహ్వానించింది. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో, పల్లకిలో తనకెదురుగా ఓ యువకుడు కూచుని వున్నాడు. తన గడ్డం మోకాలుమీద ఆనించి తల వంచుకొని కూచుని వుంది. ఎదురుగా కూర్చున్న వ్యక్తి మధ్య మధ్య ఎవరూ చూడకుండా తనను చూస్తున్నాడనిపించినప్పుడు, మధుకలశంలా వున్న తన హృదయం తొణికి మధువును చిలికింది. మధువు భారాన్ని భరించలేక, ఆ మధువును ఎవరి దోసిలిలోనైనా పొయ్యాలని ఆరాటపడింది హృదయం. తియ్యటి తలపులతో మనస్సు నిండుగా వుంది. బుర్రలో తెలిసీ తెలియని ఆలోచనలు అల్లిబిల్లిగా తిరుగుతున్నాయి. పల్లకి ఓ ఇంటిముందు ఆగింది.

 

    చెవుల్ని బద్దలు చేసే మంగళ వాద్యాల ధ్వనిలో పెద్దల దీవెనలూ, పిన్నల సరసాలూ కలిసిపోతుండగా, తను ఆ ఇంట్లో, గుండెలు దడదడలాడుతుండగా ప్రవేశించింది. అత్తగారు సౌందర్యవతియైన కోడల్ని చూసుకొని మురిసిపోయింది. అందరూ శాంతమ్మ అదృష్టాన్నీ, శాంతమ్మ కొడుకు అదృష్టాన్నీ మెచ్చుకున్నారు. ఆ ఊరికి అంతవరకూ అంతఅందమైన కోడలు రాలేదన్నారు. కాని ఆ వచ్చిన వారిలో ఎవరూ తను అదృష్టవంతురాలవునో కాదో ఆలోచించినట్లూ, అన్నట్లూ లేదు. ఆడదాని అదృష్టాన్ని గురించి ఆలోచించే అలవాటే లేదేమో మన దేశంలో! పుట్టినప్పటి నుంచి ఆడది ఏమేమి చెయ్యకూడదో, ఎలా నడుచుకోవాలో బోధించే అలవాటే వుంది కాని, ఆడదాని హక్కుల్ని గురించిగానీ, అధికారాన్ని గురించిగానీ ఆలోచించే అవసరం మొదటినుంచి మన సాంఘిక వ్యవస్థకు లేకపోయింది. స్త్రీ ఎన్ని కష్టాలను భరిస్తే అంత పేరు సంపాదించుకోగలదు. ఆమె వల్ల రెండు వంశాల గౌరవం ఇనుమడించాలి.

 

    కాని తనవల్ల? తనవల్ల తన పుట్టింటికీ మెట్టినింటికీ తీరని కళంకం వచ్చింది. అది తన దృష్టిలో కాదు. లోకం దృష్టిలో. కారణం తనకూ ఓ వ్యక్తిత్వం ఉందని గుర్తించటాన్ని మగవాడి అహం సహించలేకపోయింది. ఈరోజు తను ఇంత అర్దరాత్రి పూట కటిక చీకటిలో ముఖాన్ని దాచుకొని, ఒకప్పుడు తనదే అయిన యింటికి వస్తూంది. తను కావాలని అలా రావడంలేదు. అలా రావలసిందిగా నిర్దేశించబడింది.

 

    తన భర్త.... కాదు... ఒకనాటి తన భర్త... ఇంత రాత్రిపూట తనను రమ్మనటానికి కారణం ఏమిటో! ఎందుకయినా తనకు భయం లేదు. ఈ జీవితంమీద తనకు ఆసక్తి లేదు. ఆ ఒక్క కోరికా తీరితే తను సంతోషంగా నవ్వుతూ చనిపోవడానికి సిద్ధంగా వుంది. తను ఒక్కసారి తన బిడ్డను చూసి, మనసారా కౌగిలించుకుని హృదయానికి గాఢంగా హత్తుకోవాలనే కోరిక తన మనస్సులో బలంగా ఏర్పడింది. తన బిడ్డ తనను చూసి అసహ్యించుకోదుకదా!

 

    ఈ పదిహేను సంవత్సరాలుగా దేశంలో ఎన్నో మార్పులను చూసింది తను. ఇంగ్లీషువాడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. ఎన్నో ప్రణాలికలద్వారా దేశ పురోవృద్ధికి కృషి జరుగుతోంది. నిర్భంద విద్యనూ అమలు పరుస్తున్నారు. దేశంలో విద్యావంతుల సంఖ్య పెరిగింది. స్త్రీ విద్యకు కూడా ప్రోత్సాహం లభిస్తున్నది. కాని ఇలాంటి మారుమూల గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పులేదు. వర్షాకాలంలో ఊళ్ళోకి బళ్ళు కూడా రాలేవు, అందుకే పల్లెటూర్లనుంచి జనం పట్టణాలవైపుకు పరుగులు తీస్తున్నారు.

 

    విజ్ఞానం పెరుగుతున్నది కాని మనిషి పెరగటం లేదు. మేధస్సు పెరుగుతోంది కాని మనస్సు పెరగటం లేదు. నాగరిక పెరుగుతోంది కాని సంస్కారం పెరగటం లేదు. జీవిత దృక్పథంలో చెప్పుకోదగిన మార్పులు లేవు.

 

    ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె తన గమ్యస్థానం ఇంకెంత దూరమో లేదని గ్రహించి ఆగిపోయింది. చేతి గడియారం చూసుకుంది. మరో పదిహేను నిముషాలుంది పన్నెండు కొట్టటానికి.

 

    తన ఇల్లు...అ మండువా పెంకుటిల్లు ఎక్కడుందో ఇంత చీకట్లో ప్రయత్నం లేకుండానే తను పోల్చుకోగలదు. తలెత్తి నాలుగువైపులా చీకటిని చీల్చుకొని దృక్కులను సారించింది. తనకు బాగా పరిచితమైన ఆ పరిసరాల్ని చూట్టానికి ప్రయత్నించింది. చీకటిలో మసక మసకగా కనిపిస్తున్న ఆ ఇళ్ళూ, చెట్లూ, పరిసరాలూ తననే ఆశ్చర్యంగా చూస్తున్నట్లనిపించింది ఆమెకు.

 

    ఆ నిశీథిలో, నిర్మానుష్యంగా వున్న ఆ ప్రదేశంలో ఒంటరిగా నిల్చొనివున్న తనను తనే చూసుకున్నట్లనిపించింది ఆమెకు. విశాలమైన వినీలాకాశంలో దూరంగా, చాలా దూరంగా మినుకు మినుకుమంటున్న ఒంటరి నక్షత్రంలా, కారుచీకటి రాత్రి నడి సముద్రాన పయనిస్తున్న చుక్కానిలేని చిన్న నావలా తను నిలబడి వున్నట్లు ఆమెకు అనిపించింది.

 

    గ్రామం బాహ్యరూపంలో పెద్ద మార్పేమీ కనిపించకపోయినా చాలా మార్పులు కనిపించనివి వచ్చే ఉంటాయి. ఈ పదిహేను సంవత్సరాల్లో ఆ గ్రామం తనకు తెలిసినవాళ్ళు ఎందరో చనిపోయి వుంటారు. పసివాళ్ళుగా తను ఎరిగినవాళ్ళు పెద్దవాళ్ళయి వుంటారు. ఎందరో కొత్తగా ఈ లోకంలో అడుగుపెట్టి వుంటారు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో కథలూ, కన్నీళ్ళూ గడిచివుంటాయి. కాని మనుషుల్లో ఆ మనుషుల నమ్మకాల్లో ఎలాంటి మార్పు వచ్చివుండదు. సమస్త ప్రపంచం పరుగెత్తుతూ వుంటే ఆ వూరు మాత్రం అలాగే చలనరహితంగా నిలిచిపోయి వున్నట్లు ఆమెకు అనిపించింది.

 

    మనిషికో గాథా, ఇంటికో చరిత్రా సాధారణంగా వుంటూనే ఉంటాయి. తన ఇంటికి ఇరుగు పొరుగులోవున్న ఆ నాలుగిళ్ళ చరిత్రా తనకు బాగా తెలిసిందే కాని తన ఇంటి చరిత్ర చాలా ఆకర్షణీయమైంది. బాహాటంగా చెప్పుకోగలిగింది. ఇంటింటికి ఏదో చరిత్ర ఉంటూనే ఉంటుంది కాని, ఇతర్ల ఇళ్ళ చరిత్రలు చెప్పుకోవటంలో ఆనందం లభిస్తుందేమో!

 

    తన ఇంటికి కుడిప్రక్కగా వున్న ఆ డాబా ఇల్లు చూసినప్పుడల్లా తనకు ఏదో కథను వినిపిస్తున్నట్లుండేది.


                                                         *    *    *


    పరంధామయ్యగారు ఆ వూరిలోవున్న అందరికంటే మోతుబరి రైతు. తండ్రి ఇచ్చిపోయిన పది ఎకరాల మాగాణీ, ఎకరం తాడితోపూ ఆయన హయాంలో ఏభయ్ ఎకరాల మాగాణీ, పది ఎకరాల తాడితోపూ అయ్యాయి. అంత కొద్దికాలంలో అంత ఆస్తిని పెంచగలిగిన పరంధామయ్యను గురించి వింత కథలు చెప్పుకొనేవారు. రూపాయికి అణా వడ్డీమీద అప్పులు ఇచ్చేవాడట. పనిపాటలు చేసుకొనేవాళ్ళు, అవసరాలకొద్దీ అప్పులకు వస్తే, వాళ్ళ ఆడవాళ్ళ వెండికడియాలూ, మంగళసూత్రాలూ మొదలైనవి కుదువ పెట్టుకొని అప్పు ఇచ్చేవాడట! వడ్డీ చక్రవడ్డీ అవుతూ తీసుకున్న దానికి పదింతలు అప్పు పెరిగి తీర్చలేక వస్తువుల్ని వదిలేసుకోవటం జరిగేదట. అదీకాక ఆ డాబా పునాదులు తీసేప్పుడు లంకెలబిందెలు దొరికాయనీ ఆ లంకెలబిందెలు నరబలి కోరాయనీ, హరిజనవాడలో నివసించే ఓ పది సంవత్సరాల బాలుణ్ణి వంటరిగా కనిపిస్తే పిలుచుకొని వచ్చి, తృప్తిగా భోజనం పెట్టించి, తలంటిపోసి కొత్తబట్టలు కట్టబెట్టి రెండో కంటికి తెలియకుండా బలి ఇచ్చాడని వదంతి! ఏది యేమయినా ఆ రోజుల్లో ఒక హరిజన కుర్రవాడు కనిపించకుండా పోయిన మాట నిజమేనట. పొలం-పుట్రా, ఇళ్ళూ - వాకిళ్ళూ తాకట్టు పెట్టించుకుని స్వంతం చేసుకున్నవి చాలా వున్నాయట.   

 

    ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు పుట్టుకతోనే అవిటివాడు. కుడికాలు పాదం వోరగా వుండటంవల్ల పాదం విసిరేస్తూ కుంటిగా నడుస్తాడు. పెరిగి పెద్దయిన కొద్దీ వెర్రిబాగుల వాడనేది తేలిపోయింది. తండ్రిచేసిన పాపాలే వాడిని కొట్టాయని అనుకుంటూ కొందరు సంతృప్తిపడేవారు. చిన్నవాడు కాలాంతకుడు. తండ్రిని మించినవాడు అనుకొనేవారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేశారు. పెద్దవాడికి వెదికివెదికి గంపెడు సంసారం దారిద్ర్యబాధను అనుభవిస్తున్న ఓ కుటుంబంలోని పిల్లను తెచ్చుకున్నారు. పిల్ల కుందనపు బొమ్మ. పిల్లవాడు వెర్రిబాగులవాడని తెలిసినా, ఇంట్లో తినేనోరు ఒకటి తగ్గినా తగ్గినట్టేనని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లని ఇచ్చారట. చిన్నవాడికి కలిగిన కుటుంబం పిల్లే దొరికింది. కట్నం కూడా బాగానే ఇచ్చాడు. పిల్లమాత్రం చామనచాయలో అతిసాధారణంగా వుండేది. వదినకూ, మరిదికీ సంబంధం వుండేదని గుసగుస లాడుకొనేవారు ఇరుగుపొరుగులు. క్రమంగా వూరంతా తెలిసింది. కాని ఎవరికి వారే రహస్యం అన్నట్లు మాట్లాడేవారు. బాహాటంగా చెప్పుకొనే ధైర్యంలేదు. కారణం- నిజం అనుకుంటున్న ఆ విషయంలో సందేహం కూడా వుండటమే!

 

    వెర్రిబాగులవాడికి ఓ కొడుకు పుట్టాడు. వాడు అచ్చం బాబాయి పోలికే అనుకొనేవారు. చిన్నకోడలు మాత్రం అప్పుడప్పుడూ భర్తచేత దెబ్బలు తినడం అందరికి తెలిసిన విషయమేనట!

 

    ఒకరోజు తెల్లవారుఝామున ఘొల్లున ఏడ్పులు వినిపించి తను ఉలిక్కిపడి లేచింది. అప్పటికే అత్తగారు లేచి బయటకు వెళ్ళారు. ఆ ఏడ్పులు వినవస్తున్నది పరంధామయ్యగారి ఇంట్లోనుంచేనని తను తెలుసుకుంది. కొంచెం సేపటికి తిరిగివచ్చిన అత్తగారు, పరంధామయ్య చిన్నకోడలు పాముకరచి చనిపోయిందని చెప్పింది. రాత్రిపూట బయటకు లేచినప్పుడు కాలుకు ఏదో చురుక్కుమన్నదట. ముల్లు గుచ్చుకుందేమోనని ఊరుకుందట. కొంచెం సేపటికి వంట్లో ఏదోలా వుండి భర్తను లేపి చెప్పిందట. తీరా వైద్యుడు రాకముందే ఆమె చనిపోయిందట. ఆనాడు తెలిసిన సంగతి అది. కాని, మరునాటి నుంచి మరోకథ వినిపించసాగింది. భర్తా, తోడికోడలూ పెట్టేబాధలు భరించలేక ఆ సాయంత్రమే గన్నేరుపప్పు తిన్నదని ఆగుబ్బుగా చెప్పుకొన్నారు. ఏది ఏమయినా ఆమె భర్తకు మాత్రం చిన్న వయస్సే అయినా, మళ్ళీ పెళ్ళి మాత్రం చేసుకోలేడు.

 

    అయినా, ఆ యింటికి ఆ ఊళ్ళో గౌరవం తగ్గలేదు. చాటుగా ఎన్ని మాట్లాడుకున్నా, ఆ ఇంటి వాళ్ళెవరయినా తమ యింటికి రావటమే మహాభాగ్యం అన్నట్టు ప్రవర్తించేవారు. కారణం ఆస్తిపరులు కావడమే, ఆ ఇంటిచరిత్ర నాలుగుగోడల మధ్య వుండిపోవడమే.


                                   *    *    *


    ఆమె రెండడుగులు ముందుకు వేసింది. గాఢంగా నిట్టూర్చింది. తన ఇంటికి ఎడమవైపునున్న చీకటిని చీల్చుకుంటూ చూసింది.

Next Page