Next Page 

మళ్ళీ తెల్లవారింది పేజి 1


                               మళ్ళీ తెల్లవారింది!
                                                                                  __ వాసిరెడ్డి సీతాదేవి


తెలతెలవారుతోంది.
    వీధి దీపాలు వెలవెల పోతున్నాయి.
    సరూర్ నగర్ దరిదాపుల్లో ఉన్న ఒక పెద్ద బంగళా గేటు ముందుకొచ్చి ఒక ఆటో ఆగింది. ఆటోలోనుంచి వయసు మళ్ళిన ఒక స్త్రీ దిగింది. చేతిలో ట్రంకు పెట్టె ఉంది. రెండడుగులు ముందుకు వేసి ఆగి, బంగళాకేసి చూస్తూ నిలుచుంది.
    రంగులు మాసి, శిథిలావస్థలో వున్న ఆ బంగళా, ఒకనాటి హైదరాబాదు నవాబు వైభవాన్ని చాటుతోంది. బంగళా చుట్టూ వున్న ప్రహరీగోడ పెచ్చులు ఊడిపోయి వుంది. ఆ పెద్ద గేటుతలుపుల్లో ఒకటి సగానికి పగిలిపోయి వుంది.
    ఆమె రెండడుగులు ముందుకు వేసి గేటు బయటే ఆగిపోయింది. ఏదో సంకోచం, బాధ, ఆమె మనసును చుట్టేశాయి. అడుగు ముందుకు పడడంలేదు. మరోసారి కూలడానికి సిద్ధంగా వున్నట్టు కన్పిస్తున్న కోటలాంటి ఆ భవనాన్ని చూసింది.
    ఆ భవనాన్ని తన జీవితంలో పోల్చుకుంటూ ఆలోచించసాగింది.
    పెద్దగా అష్టఐశ్వర్యాలతో తులతూగక పోయినా, తనూ బాగానే బతికింది. గౌరవంగా బతికింది. సంతృప్తిగానే బతికింది. తన సంసారాన్ని చూసుకుంటూ గర్వించిన క్షణాలు కూడా లేకపోలేదు.
    ఈ బంగళా కూలడానికి సిద్ధంగావున్న, నిలువనీడ లేక భూమిలోకి కుంగిపోతున్న తనలాంటి వారికి ఆశ్రయం కల్పించి నిలదొక్కుకోవడానికి ఆసరా ఇస్తున్నది.
    'ఎవరది?'
    ఆమె చివ్వున తలెత్తి చూసింది.
    ఖాకీ దుస్తుల్లో వృద్ధుడు కన్పించాడు.
    'ఎవరమ్మా?'
    ఆమె సమాధానం ఇవ్వలేదు. కళ్ళల్లో నీరు తిరిగింది.
    'నీకు ఎవరూ లేరా?'
    'వుంటే ఇక్కడకెందుకొస్తాను?' ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
    తనేమంది? ఎవరూ లేరన్నది. నిజంగా తనకు ఎవరూ లేరా? ఉన్నారు. ఉన్నారా? వుంటే మరి ఇక్కడికెందుకు వచ్చినట్టు? తనకు అందరూ వున్నారు. కానీ తనే ఎవరికీ లేదు. అందుకే వచ్చింది.
    'ఆ వరండాలో కూర్చో. ఎనిమిదింటికి వార్డెనమ్మ వస్తుంది.' అన్నాడు అతను.
    'నువ్వు ఇక్కడ.' ఆపైన ఏమడగాలో తెలియక అతడి ముఖంలోకి చూసింది.
    'నేను ఈ బంగళా వాచ్ మెన్ గా పనిచేస్తున్నాను. ఆ వరండాలోకెళ్ళి కూర్చో'.
    యాత్రికంగా లోపలకు వెళ్ళి, వరండాలో గోడకు చేరబడి కూర్చుంది. భర్త గుర్తొచ్చాడు. చివరిసారిగా ఆయన తనకేసి చూసిన చూపు గుర్తొచ్చింది. ఆ చూపులోని అంతరార్ధం తనకు ఆనాడు అర్ధం కాలేదు. ఇప్పుడు అర్ధం అవుతోంది. ఆయన తను ఎదుర్కోబోయే దుస్థితి గురించి ముందే ఊహించుకున్నారు. ఆ చూపులో ఎంత జాలి! ఎంత కరుణ!
    గతాన్ని నెమరు వేసుకుంటూ, చెంపలమీదుగా జారిపోతున్న కన్నీటిని తుడుచుకుంటూ కూర్చుంది.
    'ఏయ్! ఏమిటా అరుపులు? మీ పనులు చూసుకోండి. అమ్మగారు వచ్చే టైము అయింది' మగగొంతు లోపల నుంచి వినిపించింది.
    లోపల నుంచి ఆడవాళ్ళ కంఠాలు గోలగోలగా అరుస్తున్నాయి. తిట్లు విన్పిస్తున్నాయి.
    ఆమె ఆలోచనలు చెల్లా చెదురయినాయి.
    ఇక్కడ కూడా పోట్లాటలేనా? జీవిత సంధ్యాకాలంలో అన్నీ పోగొట్టుకుని, తల దాచుకోవడానికి వచ్చి కూడా.... కక్షలూ....ద్వేషాలూనా? అవున్లే! ఎక్కడున్నా ఆ మనుషులేగా?
    'ఎవరూ?'
    ఆమె తృళ్ళి పడిలేచి నిల్చుంది.
    ఎదురుగా నిల్చుని వున్న యువతిని చూసింది. ఆమె కళ్ళల్లో ఆర్ద్రత వుంది. కంఠంలో ఆప్యాయత. తను ఎదురు చూస్తున్న వార్డెన్ ఆమేనని అర్ధం చేసుకుంది.
    ఇంత చిన్నపిల్ల వార్డెనా?
    'ఎవరమ్మా నువ్వు? ఎక్కడ్నుంచి వచ్చావ్?' అని ప్రశ్నలుగా లేవు. పలకరింపులుగా ధ్వనించాయి.
    'నాపేరు సుందరమ్మ. గుంటూరునుంచి వచ్చాను'.
    'అంత దూరం నుంచి వచ్చావా? రా లోపలకు' అంటూ పక్కగదిలోకి నడిచింది వార్డెన్. సుందరమ్మ ఆమె వెనకే నడిచింది పెట్టె పట్టుకుని.
    అంతవరకు గోలగోలగా విన్పిస్తున్న అరుపులు, ఎవరో మీట నొక్కినట్టుగా, ఒక్కసారిగా ఆగిపోయాయి.
    'అన్నమ్మా!' టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చుని కేక వేసింది వార్డెన్.
    'అమ్మా! వస్తున్నా!' దాదాపు అరవై ఐదేళ్ళున్న ఓ స్థూల కాయరాలు. గునగున దొర్లుతున్నట్లుగా వచ్చి నిల్చుంది.
    'మళ్ళీ మొదలుపెట్టారా? ఇట్లా అయితే నువెక్కువ కాలం ఇక్కడ వుండవు. జాగ్రత్త. ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్నా లాభం ఉండదు. ఎన్నిసార్లు హెచ్చరించినా నీ బుద్ధి మారదాయె!'
    'నేనేం చేశానమ్మా! అన్నిటికీ నన్నే అంటారేం?' ఏడుపు గొంతుతో అంది.
    'ముందు గొడవ లేవదీసేది నువ్వే!'
    అనండమ్మా అనండి. ఇక్కడ అందరూ మంచివాళ్ళు. నేనొక్కదాన్నే.... ఆ ద్రౌపది మీకు మంచిది'.
    'ద్రౌపది ఏం చేసిందేమిటి?'
    'నేను స్నానాల గదిలో ముందుగా బట్టలు పెట్టుకున్నాను. నాకంటే తనే ముందుగా సబ్బు ముక్క పెట్టుకుందట. తనే ముందు స్నానం చెయ్యాలట. నా బట్టలు తీసి బయటకి గిరాట వేసింది.' పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పింది.
    అంతలోసన్నగా, పొడవుగా ,ఎముకల గూడులా వున్న ఓ వృద్ధురాలు, విల్లంబు బద్దలా వంగిపోయి, వెనకనుంచి ఎవరో ముందుకు తోస్తున్నట్లుగా రంగంలోకి ప్రవేశించింది.
    సుందరమ్మ ఆమెను ఆశ్చర్యంగా చూసింది.
    ఈమె పేరు ద్రౌపదా?
    సుందరమ్మకు అంత బాధలోనూ నవ్వొచ్చింది.
    ఏం! ఎందుకు కాకూడదు?
    ఒకప్పుడు ఈ ద్రౌపది, తల్లిదండ్రుల కళ్ళ వెలుగుగా, అల్లారుముద్దుగా పెరిగి వుంటుంది.
    జీవితం పరవళ్ళు తొక్కే వయసులో భర్త ప్రేమానురాగాలకు కేంద్రబిందువు అయి వుండవచ్చు.
    ప్రశాంతమైన గంగా భవానిలా బిడ్డలకు పాలు ఇస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కనివుండవచ్చు.
    ఒక్కొక్క బిడ్డే పెరిగి తనకంటే పొడవుగా తన ముందు నిల్చున్నప్పుడు, తల పైకెత్తి ఆశ్చర్యంగా, గర్వంగా తనివితీరా చూసుకొని మురిసిపోతూ, మైమరచిపోయి వుంటుంది.
    ఆ మాటకొస్తే తన పేరు సుందరమ్మ. తను మాత్రం ఎలా వుంది? ఎండిపోయిన గుండెలతో ,మోడువారిన శరీరంతో కాంతిహీనమైన కళ్ళతో, ముడుతలు పడిన చర్మంతో... మరి తనను చూస్తే నవ్వురాదూ!

Next Page