TeluguOne - Grandhalayam
Dr Vasireddy Sitha Devi Rachanalu - 4

   

         డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం - 4


                                                           అడవిమల్లె

                                                           డాక్టర్. వాసిరెడ్డి సీతాదేవి

 

                                              

 

    వీధి దీపాలు వెలిగాయి. అయినా ఆ యింటి ముంగిలి చీకటిగానే ఉంది. కృష్ణారావు ఇంటిముందున్న మొక్కల దగ్గరనుంచి వరండాలోకి వచ్చాడు. సోఫాలో కూర్చుని నిట్టూర్పు విడిచాడు.

 

    "వరండాలో లైటన్నా వేయలేదేం?" వంట గదిలో నుంచి బయటికి వచ్చిన కాంతమ్మ అన్నది.

 

    భార్యమాట వినిపించుకోనట్లే లేచి కృష్ణారావు గేటుదగ్గరకొచ్చాడు. వీధిలోకేసి కాసేపుచూసి మళ్ళీ లోపలికి వచ్చాడు. వరండాలో లైటు వెలిగించి సోఫాలో జారగిలపడుతూన్న భర్తనుచూసి కాంతమ్మ అన్నది:

 

    "ఎందుకూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ బయటకూ తిరుగుతారు? ఇప్పుడేం కొంపలు మునిగిపోయినై?"

 

    "నీ కలాగే ఉంటుందే? అదే నీ కడుపున పుట్టిన బిడ్డయితే ఇలా ప్రవర్తిస్తావా?" అన్నాడు కృష్ణారావు.

 

    "బాగానే ఉంది సంబడం! నన్నంటారేం? తమ్ముడి మీద అంత ప్రేమ కారిపోయేవాడివి వెళ్ళలేకపోయావూ?" అంటూ రుసరుసలాడుతూ కాంతమ్మ లోపలికి వెళ్ళింది.

 

    అవును! తను వెళ్ళి వుండాల్సింది. స్కూల్లో 'పేరేంట్సు డే' అనీ అందరి పిల్లల తల్లిదండ్రులు వస్తారనీ, తననూ, వదిన్నీ తప్పక రమ్మని చంద్రం మరీమరీ చెప్పి వెళ్ళాడు. కృష్ణారావుకు ఆనాడు తల్లి అన్న మాటలు జ్ఞాపకం వచ్చి, ఎక్కడో గుండెల్లో కలుక్కుమన్నట్లయింది.   

 

    "ఇక తల్లివైనా తండ్రివైనా నీవే చంద్రానికి" అంటూ తల్లి పార్వతమ్మ, తమ్ముణ్ణి తనచేతిలో పెడుతూ ప్రాణాలు వదిలింది.

 

    "మామయ్యా! మా టీచర్లంతా చంద్రాన్ని ఎంత పొగిడారనుకున్నావ్! అన్నిట్లోనూ ప్రథమ బహుమతి చంద్రానికే. ముఖ్యంగా చంద్రం తను రాసిన కవిత్వం చదివితే - వచ్చిన అతిథులంతా ఎంత ఆనందించారనుకున్నావ్ మావయ్యా! అందరూ ఎవరబ్బాయి అంటే ఎవరబ్బాయి అని అడిగేవాళ్ళే!" చంద్రానికి లభించిన బహుమతుల్లో సగం మోసుకుని వచ్చిన పక్కింటి ప్రసాదరావుగారి అమ్మాయి హేమ గబగబా గుక్క తిప్పుకోకుండా చెప్పసాగింది.

 

    కృష్ణారావుకు ఆనందం, విచారం రెండూ ఒకదాన్నొకటి త్రోసుకువచ్చాయి. తలెత్తి తమ్ముడివైపు చూశాడు. చంద్రం తన చేతిలో ఉన్న పాకెట్లను టేబులుమీద పెడుతున్నాడు. అతని వదనంలో ఎంత దాచాలనుకున్నా దాగని విషాదచ్ఛాయలు కనిపిస్తున్నాయి.

 

    "మావయ్యా! నువ్వూ అత్తయ్యా రాలేదని చంద్రం ఎంత బాధపడ్డాడనుకున్నావ్? అందరూ తనను పొగుడుతుంటే చంద్రం ఏమీ వినిపించనట్లే ఉండిపోయాడు. అతని కళ్ళు చివరవరకూ మీ కోసం వెతుకుతూనే ఉన్నాయ్" అన్నది హేమ - ఒక్కొక్క ప్యాకెట్ విప్పి చంద్రానికి వచ్చిన బహుమతులను కృష్ణారావుకు చూపిస్తూ.

 

    "ఆఫీసులోనే ఆలస్యం అయింది. అందుకే రాలేక పోయాము," కృష్ణారావు తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో అన్నాడు.

 

    చంద్రం ఇదేమీ గమనించనట్లే తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని వెనకే హేమకూడా వెళ్ళింది.

 

    కృష్ణారావుకు తమ్ముడు చంద్రం అంటే అమితప్రేమ. కాని అతను భార్య కాంతమ్మకు జడిసి తన ప్రేమను పైకి చూపించడు. కాంతమ్మకు కారణం లేకుండానే మరిది చంద్రం అంటే వళ్ళుమంట. అసలు ఆమె తత్త్వమే అంత. ఆమెకు తన కూతురు రజని అంటే తప్ప ఇంకెవరన్నా ఎలాంటి ఆపేక్షలూ మమతలూ ఉన్నట్లు కనిపించదు. కనీసం కట్టుకున్న ఆయనమీద ఎంత ప్రేమాభిమానాలున్నాయోగాని, భర్త అని అయినా గౌరవంలేదు. సాధారణంగా ఆడవారికి పుట్టింటివారంటే ఉండే అభిమానం, మమత కూడా ఆమెలో ఉన్నట్లు గోచరించదు.

 

    కృష్ణారావు తాత, వయస్సులో ఉన్నప్పుడు గుంటూరులో పొగాకు కొట్టుపెట్టి ఆకూ, కాడా అమ్మి అలా అలా చనిపోయేనాటికి లక్షలు ఆర్జించాడు. నాలుగు పుగాకు బ్యారెన్లుకూడా కట్టించాడు. పొగాకు వ్యాపారంతోపాటుగా వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు. అసలు ఆయన ఆర్జించిందంతా వడ్డీ వ్యాపారంలోనూ, తాకట్ల వ్యాపారంలోనూ అని అంటారు, ఆయన సంగతి తెలిసినవాళ్ళు. ఆయనకు ఒకే ఒక కొడుకు భద్రయ్య. భద్రయ్యకు వ్యాపారంలోని మెలకువలు అంతగా తెలియవు. అతని హయాములో కుదువపెట్టుకున్న నగలు చాలావరకూ నకిలీ నగలని తేలింది. పొగాకు వ్యాపారంలో కూడా లాభాలు తగ్గాయి. ఆయన పోయేనాటికి తండ్రి వదలి పోయిన ఆస్తిలో సగం ఆస్తీ, భార్యా, ఇద్దరు కొడుకులూ మిగిలారు. అప్పటికి కృష్ణారావు పందొమ్మిది సంవత్సరాలు. తాతగారి తెలివి పెద్ద కొడుక్కు వచ్చిందని మురిసిపోయేవాడు తండ్రి భద్రయ్య. బి.ఏ. చదువుతున్న కృష్ణారావు తండ్రి మరణంతో చదువుకు స్వస్తిచెప్పి వ్యాపారంలో దిగాడు. భార్య కాపరానికి వచ్చిన మరునాడే అర్థం చేసుకున్నాడు కృష్ణారావు -తను నలుగుర్లో అల్లరి పడకుండా గౌరవంగా బతకాలంటే భార్యమాట వినక తప్పదని.

 

    తండ్రి చనిపోయే నాటికి చంద్రం ఐదేళ్ళవాడు.

 

    ఆ మరుసటి సంవత్సరమే తల్లిపోయింది.

 

    చంద్రానికి స్కూల్లో వచ్చిన బహుమతులన్నీ ఒక్కొక్కటే చూసుకుని కృష్ణారావు ఆనందానికి అంతులేకపోయింది. కాని ఆ ఆనందాన్ని బయటకు వెలిబుచ్చలేని తన అసమర్థతమీద తనకే కోపం వచ్చింది. తన తమ్ముడు చాలా తెలివైనవాడు. ఈ సంవత్సరంలో స్కూలుఫైనలు అయిపోతుంది. ఇప్పటినుంచే వ్యాపారంలో పెడితే తనకు చేదోడు వాదోడుగా ఉంటాడు. వ్యాపారం ముందు ముందు మూడు పువ్వులు - ఆరు కాయలు కాగల అవకాశం ఉంది. ఇంకో నాలుగైదు సంవత్సరాలకు ఒక ఇంటివాణ్ణి చేస్తే తన బాధ్యత తీరిపోతుంది.

 

    ఆలోచిస్తున్న కృష్ణారావు దృష్టి, బయటకు వెళ్ళిపోతున్న హేమ వేపు మళ్ళింది. హేమ చక్కని పిల్ల! చంద్రం కంటే రెండు సంవత్సరాలు చిన్న. ఏపుగా, తోటకూర మొక్కలా పెరిగిందేమో - చంద్రంకంటే ఓ సంవత్సరం పెద్దగానే కనిపిస్తుంది. హేమకు చంద్రం అంటే ఎంతో ఇష్టం. ఆ భగవంతుడు కనికరిస్తే తన తమ్ముడంత అదృష్టవంతుడు ఉండడు అనుకున్నాడు కృష్ణారావు.  

 

     హేమమాలిని ప్రసాదరావు ఏకైక పుత్రిక. వారి కుటుంబం మొదటినుంచి విద్యా సంస్కృతులకు ఆలవాలమై ఉంది. తాతగారు జడ్జి. తండ్రి వకీలు. ప్రసాదరావు అన్నగారు పబ్లిక్ ప్రాసిక్యూటరు. ప్రసాదరావు మాత్రం చిన్నప్పటినుంచి సాహిత్యం అంటే అభిరుచి చూపించేవాడు. కవిత్వం అంటే చెవి కోసుకునేవాడు. తండ్రి అతని అభిరుచిని అర్థంచేసుకొని ప్రసాదరావును తన వంశపారంపర్యంగా వస్తున్న వకీలు వృత్తినుంచి తప్పించి, తెలుగు ఎం.ఏ. చెప్పించాడు.

 

    ప్రసాదరావు ఆర్ట్సుకాలేజీలో లెక్చరరుగా చేరాడు. ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. సంస్కారాన్ని నిర్వచించటం కష్టం. కాని ప్రసాదరావు మూర్తీభవించిన సంస్కారం అనేవారు అందరూ. ఆయన వదనంలో పేరును సార్థకంచేస్తూ ప్రసాదగుణం ఉట్టిపడుతుంటుంది.

 

    ప్రసాదరావు పాతిక సంవత్సరాలు నిండకుండానే భార్యను కోల్పోయాడు. అప్పటికి హేమ రెండేళ్ళది. మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా హేమను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. సవతి తల్లి ప్రేమమీద ఆయనకు నమ్మకం లేదు. హేమను తన ఆదర్శాలకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నాడు - శిల్పి మట్టిముద్దను మలచినట్లు.

 

    హేమ సాహిత్యం అన్నా, లలితకళలన్నా ఎంతో అభిరుచిని చూపిస్తుంది. వినయవిధేయతలు ఆమె సొత్తు. అంత చిన్న వయస్సులోనే అలవరచుకున్న గాంభీర్యం, ప్రవర్తనలో నిండుతనం, స్కూల్లో మాష్టర్లందర్నీ చకితుల్ని చేసేవి.

 

    హేమ తెల్లగా సన్నగా ఉంటుంది. మధ్యకు విరిచికట్టిన రెండు జడలూ ముందుకు పడుతుంటే కొంచెం వంగి నడుస్తుంది. కళ్ళు పెద్దవి కాకపోయినా వయస్సును మించిన భావాలను వ్యక్తపరిచే ఏదో ప్రత్యేకత ఆ కళ్ళలో ఉంది. నిరుసోగ ముఖానికి కోటేరు వేసినట్లుండే ముక్కు, మొనతేలిన గడ్డం, చిన్ననోరూ - మొత్తంమీద పదిమందిలో తన ప్రత్యేకతను చాటించుకునే రూపం ఆమెది.        

 

    హేమకు చంద్రం అంటే ఎంతో ఇష్టం. ఐదో తరగతి నుంచీ కలసి చదువుతున్నారు. హేమ మాట్లాడుతుంటే శ్రద్ధగా ఆలకించటం చంద్రానికి ఇష్టం.

 

    తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని చంద్రానికి హేమ తండ్రి ప్రసాదరావు చూపే ఆప్యాయత, హేమ చూపే అభిమానం ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేవి.

 

    అన్నా - వదినలంటే చంద్రం హృదయంలో ఏ మూలో, అయిష్టం గూడుకట్టుకోసాగింది. వారు చూపే నిరాదరణవల్ల కలిగే బాధ చంద్రం గుండెల్లో రోజురోజుకు చిక్కగా పేరుకుపోసాగింది.

Related Novels