Next Page 

జీవనయానం  పేజి 1


                                           జీవనయానం

                                                  డా||. దాశరథి రంగాచార్య

 

 

    బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవః స్మయదూషితాః
    అబోధోపహతాశ్చాన్నే జీర్ణమంగే సుభాషితమ్           (భర్తృహరి)

 

    "పండితులు అసూయాపరులు. ప్రభువులు గర్వాంధులు. ఇతరులు తెలిసికోలేరు. అందువలన సుభాషితము నాలోనే జీర్ణమైంది."

 

    జీవితం స్థావరం కానేకాదు. అంటే జీవితం ఒకచోట నిలిచి ఉండేది కాదు. జీవితానికి నిలకడలేదు. జీవితం జంగమం మాత్రం కాదు. అంటే జీవితానికి కదలిక మాత్రమే కాదు. కదలిందంతా జీవితం కాదు.

 

    జీవితం ప్రవాహం. జీవితం నది. జీవితం స్రవంతి. [ప్రవాహం నిరంతరం కదులుతుంటుంది. కదలికలేని ప్రవాహం లేదు. నది నిరంతరం కదులుతుంది. కదలని లిఫ్తలేదు. అయినా నది కదలినట్లు కనిపించదు.

    నిరంతరం కదులుతూ - కదలినట్లు కనిపించనిది జీవితం. జీవితం కదలిక. కదలిక జీవితం.]

 

    చలనం జీవితం. నిశ్చలం మృత్యువు.

 

    మన పూర్వులు జీవితానికి ఉపమానంగా వృక్షాలను అనేక సందర్భాల్లో వాడారు.

 

    "భవన్తి నమ్రాస్తరవః ఫలోద్గిమైః," అంటాడు   భర్తృహరి. కాసిన చెట్టు వంగుతుంది అంటాడు. సద్గుణవంతుడూ వంగుతాడు.

 

    చెట్టు రుతువును బట్టి మారుతుంది. శిశిరంలో ఆకురాలుతుంది. చెట్టు ఎండినట్లవుతుంది. ఎండదు. వసంతం వస్తుంది. చెట్టు చిగురుస్తుంది. నవనవలాడుతుంది. పచ్చని మాను అవుతుంది.

 

    జీవితమూ అంతే. వాడినా చిగురిస్తుంది. చిగురుస్తుంది!

 

    యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే
    తావద్రామాయణ కథా లోకేషుప్రచరిహ్యతి.  

 

    భూమిమీద కొండలూ - నదులూ ఉన్నంత కాలం రామాయణ కథ ఉంటుంది అంటాడు వాల్మీకి.

 

    జీవనానికి చెట్లు - కొండలు - నదులు ఉండాలి. ఈ నిత్య సత్యాన్ని మన పూర్వులు ప్రవచించారు. వీటిని పూజించమన్నారు. పూజించడం అంటే కనీసం హాని జరుపకుండడం.

 

    "త్వం హి త్రిపధగాదేవీ! బ్రహ్మలోకం సమీక్ష్యసే
    భార్యాచోదధి రాజస్య లోకేస్మిన్ సంప్రదృశ్యతే!"

 

    "గంగాదేవీ! నీవు త్రిపథగవు. అందువలన బ్రహ్మలోకం దర్శిస్తావు. నీవు సముద్రుని భార్యవు. ఈ లోకమున ప్రత్యక్షదైవమవు." అంటుంది సీత గంగను దాటుతూ.

 

    మనం చెట్లనూ, గుట్టలనూ, నదులనూ పూజించినంత కాలం - వాటికి నష్టం కలిగించనంతకాలం - ప్రకృతి మనసు తన ఒడిలో లాలించింది.

 

    చెట్లను గుట్టలను పూజించడం మూర్ఖత్వం అని పాశ్చాత్యులు మనకు నేర్పారు. వారు అన్నది నమ్మి నిజమైన మూర్ఖులం అయినాం మనం. అడవులను నరికాం! నదులను కలుషితం చేశాం, ఎండగొట్టాం! ప్రకృతి కన్నెర్ర చేస్తే ఇప్పుడు ఏడుస్తున్నాం!

 

    ప్రకృతిని ఆశ్రయించినంత కాలం మానవ జాతి ప్రకృతితోపాటు పరవశించింది!

 

    ప్రకృతికి ద్రోహం తలపెట్టగానే మానవజాతి ప్రకృతితోపాటు కన్నీరు రాలుస్తున్నది.

 

    సకల ప్రాణిజలం ప్రకృతిలో భాగం.
    ప్రకృతితో జీవిస్తే దాని ఆకృతి నిలుస్తుంది.
    ప్రకృతిని హతం చేస్తే ప్రకృతిని చెరుస్తే
    సకల ప్రాణజాలానికి విలయం తప్పదు!


    జీవితం - ప్రవాహం:

 

    నది జీవితం వంటిది అన్నాం. నది బిందువుగా మొదలవుతుంది. జీవితం బిందువుగా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంతకాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండలు కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. ఇంద్రధనుస్సుని సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవిత నాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! ఆపదల్లోనే ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం!

 

    సుర్ఖ్ రూ హోతామై ఇన్సాఁ  ఠోక్ రే ఖా నే కె బాద్
    రంగ్ లాతీహై హేనా పత్థ్ ర్ పె ఘిస్సేకె బాద్

    దెబ్బలు తింటేనే మనిషి రాటు తేల్తాడు.

    రాతిమీద రాస్తేనే బంగారంరంగు తేలుతుంది.

 

    నదిలో మరొక నది కలిసిన సోయగం వర్ణనలకు అందదు. హిమాలయంలో అలకనంద - మందాకినితో కలుస్తుంది. ఆ దృశ్యం అపూర్వం.

 

    జీవితమూ అంతే. జీవితంలోనికి ఒక భాగస్వామిని వస్తుంది. రావడమే కొన్ని సుడిగుండాలు ఏర్పడ్తాయి. ఒకరికి ఒకరు అర్థం కావడం కొంచెం కష్టం అవుతుంది. అర్థం చేసుకుంటే అంతే! నదీసంగమం. ఇద్దరు ఉండరు. మనసు ఒకటి - ప్రాణం ఒకటిగా మసలుకుంటారు! 'వాగర్థావివ సంప్రక్తౌ' అంటాడు కాళిదాసు. మాట - అర్థంవలె ముడిపడతారు! విడదీయరాదు! 'భాస్కరేం ప్రభాయథా' అంటాడు వాల్మీకి. సూర్యుడు వెలుగువలె విడదీయడం అసంభవం.

 

    గంగా యమునలు - మందాకినీ అలకనందలు - ప్రాణహిత గోదావరులు - తుంగా కృష్ణులు, ఒక టేమిటి, నదులన్నీ మరొక నదిని కలుపుకొని సాగుతాయి.

 

    జీవితమూ అంతే! కామక్రోధాదులు సాధారణంగా మనిషి అదుపులో ఉంటాయి. అయితే జీవితం సహితం ప్రకృతియే! దానికీ ఆటుపోట్లుంటాయి. కామ క్రోధాదులు హద్దుదాటినపుడు ప్రళయం వస్తుంది. తాను బాధపడ్తాడు. ఇతరులను బాధపెడ్తాడు.

 

    అయితే సాధారణ జీవితంలో ఇవి అప్పుడు అప్పుడు మాత్రమే వస్తాయి. మనిషే కదా తప్పు చేస్తాడు! మానులు చేస్తాయా? అయితే తప్పును తెలుసుకోవడం - సరిదిద్దడం విజ్ఞుల లక్షణం. తప్పును దిద్దుకోవడం సృష్టిలో ఒక్క మానవునికి మాత్రమే సాధ్యం.

 

    నది సాగుతుంది. కాలువలు అవుతుంది. పొలాలకు నీరిస్తుంది. నేలను సస్యశ్యామలం చేస్తుంది సకల ప్రాణులకూ ఉపకారం చేస్తుంది.

 

    జీవితం తన ఒక్కనికే కాదు. బహుజన హితాయ - బహుజన సుఖాయ. ఎక్కువ మంది హితమునకు - ఎక్కువ మంది సుఖమునకు. మానవుడు తెలిసి కొన్ని - తనకు తెలియక కొన్ని ఉపకారాలు చేస్తూనే ఉంటాడు,

 

    నది పనిసాంతం తీర్చుకొని పాయలు అవుతుంది! సారవంతం అయిన భూమిని ఏర్పరుస్తుంది. "నదీనాం సాగరో గతిః." నది సముద్రం వైపు సాగుతుంది. సముద్రంలో కలిసిపోతుంది.

 

    జీవితమూ అంతే. తన పని నెరవేర్చుకుంటుంది. సంతానం ఏర్పరుస్తుంది. వారి ద్వారా సమాజాన్ని సారవంతం చేస్తుంది. తనవు చాలిస్తుంది. అనంత విశ్వంలో లీనం అవుతుంది.

 

    ఆకాశాత్పతితంతోయం
    సాగదం ప్రతిగచ్ఛతి.

 

    ఆకాశము నుండి పడిన నీరు సాగరం వైపు సాగుతుంది. పరిణామం జీవితం.

 

    పరిణామం - జీవితం :

 

    నదిలో కదలిక ఉంది. జీవితంలో కదలిక ఉంది.

 

    నదిలో నిరంతర మార్పు ఉంది. జీవితంలోనూ నిరంతర మార్పు ఉంది.

 

    నది ప్రవహిస్తుంటుంది. ఒకే నీరు వలె కనిపిస్తుంది. కాని గత లిప్తలో ఉన్ననీరు ఈ లిప్తలో ఉండదు. ఒక నిర్దిష్టస్థలంలో ఉండి పరిశీలిస్తే ఈ విషయం కనిపిస్తుంది. నదికి నిరంతర పరిణామం ఉంది. అయితే అది స్థూల దృష్టికి కనిపించదు.

 

    నిరంతర పరిణామమే జీవితం. జీవితంలోనూ నిరంతర పరిణామాన్ని పరిశీలించవలసి ఉంటుంది. స్థూల దృష్టికి అది కనిపించదు. అందుకే కాల ప్రమాణం - సంవత్సరం ఏర్పరచారు. అయితే మార్పు సంవత్సరానికి ఒకసారి వస్తుందని అర్థంకాదు. నిరంతరం జరుగుతున్న మార్పును ఏడాదికి అంచనా వేస్తాం.

 

    మార్పు ప్రకృతి సహజం. సమస్త చరాచరప్రపంచం నిరంతరం మారుతుంటుంది. ఇక్కడినుండి మార్పు శుక్లపక్షంవలె వృద్ధికావచ్చు. కృష్ణపక్షంవలె క్షయంకావచ్చు.

 

    ఒక్కప్పుడు హిమవంతం లేదు. తరువాత వచ్చింది.           

Next Page