Next Page 

ఏవమ్ ఇంద్రజిత్ పేజి 1

       

                                               "ఏవం ఇంద్రజిత్"

                                                                                             -వాసిరెడ్డి సీతాదేవి.

                                          

                                                 మొదటి అంకం
    [టేబుల్ మీద కాగితాలకట్టలు పడివున్నాయి. ప్రేక్షకులవైపు వీపు పెట్టి రచయిత ఏదో రాస్తూవున్నాడు. చాలాసేపటినుండి రాస్తూ ఉండి ఉండవచ్చును. 'పిన్ని' ప్రవేశిస్తుంది. ఏదో అనాలి కనక పిన్ని అన్నాం- తల్లి,అత్త , పెద్దమ్మ ఏదైనా అనొచ్చు! పిన్ని చిరాకుతో వస్తుంది]
    పిన్ని: నీ వ్యవహారం ఏమిటో నాకు బొత్తిగా  తెలియటం లేదు.
        (రచనయిత మౌనం)
    వినిపిస్తున్నదా? అన్నం తింటావా లేదా? దేనికైనా  ఒక  హద్దంటూ వుండాలి. మాట్లాడవేం?
    రచయిత: ఇదుగో వచ్చేస్తున్నా!
    పిన్ని: ఈ మాట యిప్పటికి  మూడుసార్లు అన్నావ్! ఇదే ఆఖరుసారిగా చెపుతున్నా_ ఆ తర్వాత  నీ ఇష్టం!
    రచ: ఈ మాటే నువ్వుకూడా మూడుసార్లు చెప్పావ్!
    పిన్ని: సరే నీ యిష్టం! రాత్రిలేదు. పగలులేదు. ఎప్పుడు చూసినా రాత-రాత-రాత! తిండీ తిప్పలు అక్కర్లేదు. ఈ రాసిందంతా ఏం చేస్తావో ఆ భగవంతుడికే తెలియాలి.
    [పిన్ని సణుక్కుంటూ వెళ్ళిపోతుంది. అప్పటికే రాయడం ఆపేశాడు. రాసిన కాగితాన్ని చదువుతాడు. చదువుతూ చదువుతూలేచి నిల్చుంటాడు. ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి పేరు  'మానసి' అనుకుందాం!]
    మానసి: పూర్తయిందా?
    రచ: లేదు.
    మా: ఏం రాశావు? నాకు వినిపిస్తావా?
    రచ: ఏం రాయలేదు.
        (కాగితాలు చింపేస్తాడు)
    మా : అరే చింపేశావా?
    రచ : ఏమీ రాయలేదు. రాయటానికి ఏమైనా ఉంటేగా?
    మా : ఏమీ లేదా?
    రచ : లేదు. ఏం రాయను? ఎవర్ని గురించి రాయను? నాకు తెలిసిన వాళ్ళంతమంది? వాళ్ళ గురించి తెలిసిందికూడా ఏమీలేదు.
    మా:(ప్రేక్షకులను చూపిస్తూ) నీ ఎదురుగా యింతమంది వున్నారు! ఏ ఒక్కర్ని గురించీ నీకు తెల;తెలియదా?
    రచ: వీళ్ళా? ఒకళ్ళిద్దరు తెలిసినట్లే వున్నారు. కానీ వాళ్ళను గురించి నాటకం రాయటానికి ఏముంది?
    మా: ప్రయత్నించు.
    రచ: చాలా ప్రయత్నించాను.
    [కాగితాల ముక్కలు విసిరిపారేసి రచయిత టేబుల్ దగ్గరకు వెళ్తాడు. కొంచెంసేపు నిల్చుని మానసి చిన్నగా వెళ్ళిపోతుంది.  రచయిత ఒకసారి గిర్రున తిరిగి ముందుకొస్తాడు. అదే సమయంలో ఆడిటోరియంలోకి నలుగురు వ్యక్తులు ప్రవేశించి సీట్లకోసం వెతుక్కుంటూ వుంటారు. రచయిత వాళ్ళను పిలుస్తాడు.]
    రచ: ఏమండీ! ఇలా రండి !
    [వచ్చినవ్యక్తులు వారిని పిలుస్తున్నాట్లు గ్రహించరు.]
    రచ: మిమ్మల్నే  నండీ! ఒకసారి యిలా రండి!
    1. ప్రేక్ష: మమ్మల్నా?
    రచ: అవును మిమ్మల్నే! ఒకసారి యిలా దయచెయ్యండి!
    2.ప్రేక్ష: అందరం రావాలా!
    3.ప్రేక్ష:స్టేజి మీదకా?
    రచ: అవును! రండి! మీతో చాలా ముఖ్యమైన పనుంది.
    [నలుగురూ స్టేజి దగ్గరకు వెళతారు.]
    1.ప్రే: పైకి ఎలా రావాలి?
    రచ: ఇటు ! ఇటు ! మెట్లు వున్నాయ్!
    [నలుగురూ స్టేజి మీదకు వస్తారు.]
    రచ: మీ పేర్లు తెలుసుకోవచ్చునా?
    1.ప్రే:అమల్ కుమార్ !
    రచ : మీరు?
    1.ప్రే: విమల్ కుమార్ !
    (రచయిత 3వ ప్రేక్షకునివైపు చూస్తాడు.)
    ౩.ప్రే: కమల్ కుమార్!
    రచ: మీ పేరు ?
    4.ప్రే: నిర్మల్ కుమా...
    రచ:(గట్టిగా అరుస్తూ) అబద్దం!
    [స్థబ్దత నలుగురూ తెల్లముఖాలు వేస్తారు. స్ధిరంగా బిగుసుకొని వుండిపోతారు.]
    రచ: అమల, విమల్, కమల్, నిర్మల్ -కాదు- మీ పేరు నిర్మల్ కావటానికి వీల్లేదు. నిజం చెప్పండి! మీ పేరేమిటి?
    [స్టేజిమీద చీకటి వ్యాపిస్తుంది. అమల్, విమల్, కమల్ వెనక్కు వెళ్ళి నిల్చుంటారు. నాల్గవ ప్రేక్షకుడు స్టేజి మధ్యలో వుంటాడు. చీకటిని చీల్చు కుంటూ రచయిత కంఠస్వరం వినిపిస్తుంది.]
    రచ: మీ పేరేమిటి?
    4.ప్రే:ఇంద్రజిత్ !
    రచ: అబద్ధమెందుకు చెప్పావ్?
    ఇంద్ర: భయంవేసి.
    రచ: భయమా? ఎందుకూ?
    ఇంద్ర: అశాంతికి! నియమ విరుద్ధంగా చేసిన పనికి  లభించేది అ శాంతేగా?
    రచ: మీరు మీ పేరు నిర్మల్ అనే చెబుతుంటారా?
    ఇం: లేదు. ఇప్పుడే మొదటిసారి అలా చెప్పాను.
    రచ: ఎందుకు?
    ఇం: వయస్సు వచ్చేసింది కనుక! వయస్సు వచ్చాక ఆనందం అంటే, సుఖం అంటే కూడా భయంవేస్తుంది. ఈ వయసు కోరుకొనేది శాంతి ఒక్కటే:
    [ఇంద్రజిత్ ను ఒక దట్టమైన మేఘం కప్పివేయడం అవసరం]
    రచ: మీ వయస్సేంత?
    ఇం: వంద! ఊహుఁ.... రెండు వందలు! నాకు తెలియదు. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ప్రకారం ముప్ఫయ్ ఐదు.
    రచ: జన్మస్దానం?
    ఇం: హైదరాబాద్!
    రచ:చదువు సంధ్యలు?
    ఇం:హైదరాబాద్!
    రచ:ఉద్యోగం?
    ఇం:హైదరాబాద్ లో!
    రచ : వివాహం?
    ఇం: హైదరాబాద్ లో!
    రచ: మృత్యువు?
    ఇం : ఇంకా సమయం వుంది!
    [నిశ్శబ్దం. చీకట్లో ఇంద్రజిత్ స్వరం వినిపిస్తుంది.]
    ఇం: కాదు.....కాదు....నాకేమీ తేలియటం లేదు.
    [చిన్నగా స్టేజిమీద వెలుతురు పడుతుంది. ఇంద్రజిత్, అతని వెనుక  వరుసగా, అమల్ , విమల్, కమల్ బొమ్మల్లా నిల్చునివుంటారు. వారి దృష్టి  శూన్యాన్ని చూస్తూ వుంటుంది. రచయిత ప్రేక్షకులవైపు చూస్తాడు. అలసిపోయిన మాస్టరులా మాట్లాట్టం ప్రారంభిస్తాడు.]

Next Page