Next Page 
చెదిరిపోతున్న దృశ్యం  పేజి 1

                                                        చెదిరిపోతున్న దృశ్యం
                                                                                                -------శారదా అశోకవర్ధన్                  

                              ఇందులో...   
    తెలుగును చూస్తున్నాను
    ఇదే యాగం
    కొత్త నొటేషన్ రాసుకో!
    ఇంగలంతో
    పండగ
    అమ్మ అంటే ఎవరు ?
    స్వాతంత్ర్యం ఒకరివ్వాలా ?
    తిమింగిలం
    నాకళ్లు !
    మహిళా! ఓ మహిళా!
    కృష్ణాతరంగాలు
    త్రిసూత్రం
    ఒంటరితనం
    చెదిరిపోతూన్న దృశ్యం
    ప్రస్తుత ప్రస్థావన
    ఎదురు చూపులు చూడకు
    వినరా...వినరా...తెలుగోడా
    ఆశావాది
    నీడవే అయినా...
    ముగ్గురమ్మల మూలపుటమ్మ
    ఇప్పుడే తెలిసింది
    ఏమో !
    స్నేహకృష్ణ
    చెత్తకుండీ గుండెపగిలిన వేళ
    నీబాట నువ్వే వేసుకో
    నాగదికి రెండు కిటికీలు
    మగువా చెయ్యి తెగువ
    మళ్లీ పసిపాపనై...
    సమాంతర రేఖలు
    కలం చేతికర్రగా...
    నడక
    ఒక్కక్షణం...
    కవితలు చదవడానికి ముందు పీఠికలు కావాలి ? కవితలెందుకు రాస్తున్నారో, దేని గురించి రాస్తున్నారో ఆ  సంఘటనా సన్నివేశాల వివరాలు చెప్పాల్సిన అవసరముందా అంటే, నిజానికి లేదు. కవితలు చదివి కవిహృదయం తెలుసుకోవచ్చు.
ఊహలకి రెక్కలొస్తే విహంగమై ఎగిరి కొండలూ, కోనలూ, తరులూ, ఝురులూ, మబ్బులూ, మెరుపులూ, ఆకాశం, చుక్కలూ, అడవులూ, కడలి ఇలా ఎన్నో వీక్షించి పులకించి ఆపులకరింతల కలవరింతలను గాధలుగా శ్రోతలకందించే అవకాశం వుంది. ఆ రసానందాన్ని కవీ పాఠకులూ ఇద్దరూ సమంగా పంచుకోవచ్చు !
    ఆకలి కేకలు, ఆడవాళ్ల అవమానాలూ, వారిపై అఘాయిత్యాలూ, దొంగతనాలు, దోపిడీలూ,     మోసం, దగా, హింసాతత్వం, భయం బతుకులూ, ఈ నేపధ్యంలో కవి కేవలం భావావేశంలో ఊహల పల్లకీలో ఊరేగితే కవిరాతలకు గానీ, పాఠకుల పఠనానికి గాని ప్రయోజనం వుండదు, వృధాకాలయాపన తప్ప. సమాజోద్ధరణకు, సమసమాజానికీ, స్త్రీల ఔన్నత్యం పెంపొందించడానికీ, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న దగాపడ్డ తమ్ముళ్లనూ చెల్లెళ్లనూ ఊరడించి దారిచూపడానికి కవిత స్ఫూర్తిదాయకం కావాలి! కాలానికి కావలసిన అక్షరాలను కలం అందించగలగాలి.
నాకవితల్లో మనసు- మమత- మానవతా ప్రముఖంగా చోటుచేసుకుంటాయి. అందులో 'స్త్రీ' వుండవచ్చు, పురుషుడుండవచ్చు, బాలలుండచ్చు, బాధ్యతలుండవచ్చు, గోలలుండవచ్చు, హేలలుండవచ్చు.
    కేవలం 'స్త్రీ' ప్రధానాంశాలుగా వున్న నా ముప్పై మూడు ఎపిసోడ్ 'స్త్రీ' ధారావాహిక సీరియల్ లో నాకు రాష్ట్రప్రభుత్వ నందీ అవార్డు లభించింది, 1991లో. ఉత్తమ రచయిత్రిగా ఎన్నో ప్రముఖ సాహితీ సంస్థలు గౌరవించాయి. అదే సంవత్సరంలో వచన కవితా ప్రక్రియకి తెలుగు యూనివర్సిటీ ధర్మాదాయ పురస్కారమూ లభించింది.
 నుంచి మనిషి మనుగడకి కంటకాలై నిలుస్తున్న అనేక సమస్యలను చర్చిస్తూ పరిష్కారాన్ని సూచిస్తూ సమాజంలో పాతుకుపోతున్న దురాగతాలను వీక్షించి, సాధ్యమైనంత వరకు ప్రక్షాళనం చెయ్యాలన్న ఆకాంక్షే ఈ అక్షరాలు, కవితారూపంలో.
    నానాటికీ అంతరించి పోతూన్న మానవసంబంధాలు, వర్తమానంలోనే ఇలావుంటే భవిష్యత్తులో రేపటి తరానికి అసలే అర్ధంకావు. ఇప్పుడే చెదిరిపోతూన్న దృశ్యాలు, రేపటికి పూర్తిగా చెరిగిపోతాయేమో! ఏ బంధాలు కేవలం డబ్బు సంబంధంతోటే మనిషి బతకడం అసాధ్యం.
    పూర్వపు సంప్రదాయాలలోని విలువలూ మమతానురాగాలూ, ఇప్పుడే చెదురుమదురుగా కనిపిస్తున్నాయి.
రేపటి తరానికి అవి ఎండమావులేనేమో! ఎవరికి ఎవరూ ఏమీ కాని సమాజం, జీవనం ఎలావుంటుందో ఊహకందడం లేదు.
    నేడు ఎటుచూసినా కనిపించేది ఒక్కటే! స్వార్ధం స్వార్ధాన్ని తృప్తిపరచాలంటే డబ్బు కావాలి. డబ్బు తెచ్చే దర్పం డబ్బు తెచ్చే డాబూ, ఈ స్వార్ధపు కోరల్లో ఇరికిపోయాయి మానవ సంబంధాలు. అన్నదమ్ములు క్తులు నూరుకోవడం, కుత్తుకలు కోసుకోవడం, ఆలుమగలు బజారునపడి అసహ్యంగా కీచులాడుకోవడం, కట్నం కోసం కట్టుకున్నవాడే కాల్చిచంపడం, స్త్రీల పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలూ అన్నీ స్వార్ధపిశాచి ఆడిస్తున్న పైశాచిక కృత్యాలే. వీటిముందు సఖ్యత, నాగరికత, ఆప్యాయతా అన్నీ మట్టికొట్టుకుపోతున్నాయి. ప్రేమా, అనురాగం, అభిమానాలతో కూడిన సంసారాలు కూలిపోయి కనుమరుగై పోతున్నాయి. అమ్మకి అన్నం పెడితే లెక్కగట్టే పుత్రులు, పున్నామి నరకం నుంచి తప్పించడమేమోగాని ప్రత్యక్ష నరకం సృష్టిస్తున్నారు. అక్కా చెల్లెళ్లన్నా, ఆడపడుచులన్నా ఏవగించుకునే దౌర్భాగ్యపు సమాజంలో స్త్రీ ఎండిపోయిన చెరువులోని చేపపిల్లలా మెట్టినింట్లో ఆప్యాయతలేక పుట్టినింట్లో ఆదరణ లభించక, రోడ్డున పడితే రక్షణ లేక వెళ్ళబుచ్చుకుంటోంది బతుకు. తోటి మనిషిని చూసి మనిషే భయపడేరోజొచ్చింది.     
    ఆడదానికి ఇంకా ఈ శతాబ్దంలోనూ రక్షణలేదు.
    కష్టపడి పనిచేసినా సుఖంలేదు, సంతోషం లేదు
    నేటి మానవుడు మనసులేని యంత్రంలా సాగిపోతున్నాడు.
    ప్రకృతి సౌదర్యాన్ని చూసే సమయం లేదు.
    ఆనందించే అదృష్టంలేదు.
    సరసాలు లేవు, సరదాలు లేవు...
    బంధువులు లేరు బలమైన సిసలైన స్నేహితులూ లేరు. అంతా కృత్రిమం.
    చక్కని కమనీయ రమణీయ అనుబంధాలు ఇప్పుడే చెదిరిపోతూంటే, భావితరాలవారికి చెరిగిపోతాయేమోననే భావన నన్ను తరుచు వేధిస్తుంది.
    అనగా అనగా వినగా వినగా పూర్వపు వైభవం తిరిగొస్తుందేమోనని నా ఆశ
    పాత అంతా కొట్టిపారెయ్యఖ్కర్లేదు-
    కొత్తనంతా ఆహ్వానించఖ్కర్లేదు_
    రెండింటిలోని మంచిని కలిపి ఎంచుకుంటే ఎంత బాగుంటుంది జీవితం! ఎంత మెర్కురీ బల్బు కాంతులైనా, వెన్నెల కురిసే అనుభూతిని కలిగిస్తాయా ?
    చిద్రమైన మానవ సంబంధాలు తిరిగి చిగురించాలని ఆశతో ప్రతికవితలోనూ ఇంచుమించు నామొర వినిపించుకున్నాను !
    అదివరలో 'శారదాకృతులు, సుషుప్తి నుంచి మేలుకో, కాలంకడలిలో, శారదసరాలు, సూర్యతిలకం, వెన్నెల కోయిల, భావరాగిణి, గణపతి సుప్రభాతం సంపుటాలలాగానే దీన్నీ పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. గణపతి సుప్రభాతం సుప్రసిద్ధ సంగీత గానగంధర్వుడు పద్మభూషణ్ డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గళంలో, నేపధ్యగాయకుడు ఆనంద్ పర్యవేక్షణలో గ్రామఫోను రికార్డుగా వొచ్చి ఎంతో పేరుతెచ్చింది. శారదా కృతులలోని గేయం 'పిలుపులో ఏముంది?' సుప్రసిద్ధగాయనీమణి, నటి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి నోట ఆకాశవాణిలో శ్రీపాలగుమ్మి విశ్వనాధంగారి పర్యవేక్షణలో ప్రసారమై మంచి పేరుతెచ్చింది. భావరాగిణిలో గేయాలు 'మనసాయెరా మాధవా' నుంచి దాదాపు వందకు పైగా ఆకాశవాణిలోనూ, దూరదర్శన్ లోనూ ప్రసారమయినాయి.
    ఇవికూడా అలాగే అందరి మన్ననలను పొందుతాయని ఆశిస్తూ, నన్ను ప్రోత్సహించే పాఠకులకు, పెద్దలకూ నమస్సుమాంజలులు అర్పిస్తున్నాను. ఇక పదండి...పుటల్లోకి... 
                                                                                                                                    మీ
                                                                                                                         శారదా అశోకవర్ధన్                                                                                                                                        


Next Page 

  • WRITERS
    PUBLICATIONS