Next Page 
మౌన రాగాలు పేజి 1

 

                                మౌనరాగాలు
            
                                                            ---మైనంపాటి భాస్కర్    
    
                                         
  

    "టెలిగ్రాం డాక్టర్!" అంటూ వచ్చింది నర్స్ ప్రమీల.    

 

    అందుకుని చదివాడు డాక్టర్ సుధీర్.
    
    "ఈవెనింగ్ ఫ్లయిట్ లో వస్తున్నాను - శశి."
    
    అతని మొహం విహ్వలంగా అయిపోయింది. టెలిగ్రాం వైపు అలానే చూస్తూ వుండిపోయాడు.
    
    "సమ్ థింగ్ రాంగ్, డాక్టర్?" అంది నర్సు, అతని కలవరపాటు గమనించి.
    
    సుధీర్ సర్దుకున్నాడు. "ఏం లేదు, డాక్టర్ శశి ఫ్లయిట్ లో వస్తూందిట. ఎయిర్ పోర్టుకి కారు తీసుకెళ్ళాలి. యూనో షి హేట్స్ టాక్సీస్ అండ్ ఆటోస్!" అన్నాడు చిరునవ్వు తెచ్చుకుంటూ.
    
    టైమ్ చూసుకున్నాడు. త్వరత్వరగా గేరేజ్ వైపు నడిచి మెర్సిడిస్ బెంజి కారు బయటికి తీశాడు. తరవాత టకటక గేర్లు మార్చి రాష్ గా పోనిస్తూ, అర ఫర్లాంగు పొడుగున్న వాళ్ళ ప్రైవేటు రోడ్డు దాటేసి, గేటు దగ్గర కొచ్చాడు.
    
    అక్కడ పెద్దగా కేకలు - వందలూ, వేల సంఖ్యలో ఉన్న ఆడపిల్లలు స్లోగన్లు రాసి ఉన్న అట్టలు చేతుల్లో పట్టుకుని, మోహంలో పట్టుదల కనబడుతూ ఉండగా, నినాదాలు చేస్తూ వెళుతున్నారు.
    
    "స్త్రీలపై అత్యాచారాలూ - అరికట్టాలీ!"
    
    "మానభంగానికీ - మరణశిక్ష!"
    
    సడెన్ బ్రేకుతో కారాపాడు సుధీర్. అతని చేతులు వణుకుతున్నాయి.
    
    "పురుషుల దౌర్జన్యం - నశించాలి!"
    
    "ఆడదంటే... ఆటబొమ్మ కాదు!"
    
    నడిచిపోతున్నారు అమ్మాయిలు- ఏభైగజాల కొక అమ్మాయి చొప్పున. నినాదం అందిస్తున్నారు - తక్కినవాళ్ళు అందుకుని స్లోగన్ పూర్తి చేస్తున్నారు.
    
    "రేపింగ్ కీ- మరణశిక్ష విధించాలీ!"
    
    శశి తనవంక జాలిగా చూస్తున్నట్లనిపించింది సుధీర్ కి.
    
    శశి....డాక్టర్ శశివదన...డాక్టర్ చందమామ! తన భార్య...తన ప్రియురాలు...నీళ్ళు నిండిన కళ్ళతో, పెదిమల క్రింద తొక్కిపట్టిన దుఃఖంతో, తన వైపే చూస్తున్నట్లనిపించింది. కారు విండ్ స్క్రీన్ 70 ఎమ్.ఎమ్. సినిమా తెరలాగా అయిపోయి, దానిమీద శశి మొహం క్లోజప్ లో కనబడుతూంది.
    
    శశి వసుమతి పెళ్ళికి కేరళ వెళ్ళి ఇవాళ్టికి అప్పుడే మూడో రోజు.
    
                                                              * * *
    
    అంతకుముందు సరిగ్గా నాలుగో నాటి రాత్రి...
    
    అది అతి సౌకర్యంగా, ఫాషనబుల్ గా ఉన్న బెడ్ రూమ్. అరడజనుమంది పడుకోవడానికి వీలున్నంత పెద్ద బెడ్. అరఅడుగు మందం ఉన్న ఫోమ్ బెడ్.
    
    ఉలిపిరి కాగితమంత పల్చగా, అంత క్రిస్ప్ గా, గరగరలాడుతున్న తెల్లటి ఆర్గండీ చీర కట్టుకుని "ఫ్యూచర్ షాక్" చదువుతోంది శశివదన. నాలుగు బూరుగు దూది దిండ్లను ఆనుకుని విశ్రాంతిగా పడుకుని ఉంది. బెడ్ కి కాస్త దూరంలోనే ఉన్న ఎయిర్-కండిషనర్ లోంచి చల్లగా వస్తోంది గాలి. మెత్తగా, పట్టులా వున్న జుట్టుమొహం మీద పడుతోంది.
    
    పక్కనే వెల్లకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తూ సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు సుధీర్. సిగరెట్ పూర్తయింది. ఆ సిగరెట్ పారెయ్యకుండానే పాకెట్ లోంచి ఇంకో సిగరెట్ తీసి, మొదటి దానితో అంటించాడు.
    
  వోరకంటితో ఇది గమనించిన శశి కళ్ళు పెద్దవిచేసి "తప్పు!" అన్నట్లు చూపుడువేలు పెదిమలకు ఆనించింది. "అరగంటలో ఇది మూడో సిగరెట్టు! తప్పు, డాక్టర్! స్మోకింగ్ ఈజ్ ఇన్ జూరియస్ టు హెల్త్! ఆర్పెయ్యండి! వూ! తక్షణం!" అంది నవ్వుతూ.
    
    ఒక్క దమ్ము పీల్చి సిగరెట్ యాష్ ట్రేలో పడేశాడు సుధీర్.
    
    శశి చదువుతున్న పుస్తకం మూసేసి, ఇంకేదో మెడికల్ జర్నల్ తెరిచింది.
    
    "తప్పు, డాక్టర్! అరగంటలో ఇది రెండో పుస్తకం. కట్టుకున్న భర్తను అలా నిర్లక్ష్యం చేసి చదువుకుంటూ కూర్చోవడం ఆరోగ్యానికి మంచిదికాదు! వూ! పుస్తకం మూసెయ్! లైటు ఆర్పెయ్! తక్షణం!" అన్నాడు మాటకి మాట అంటిస్తూ.
    
    శశి అందంగా మూతి విరిచింది.
    
    "ఇంకొక్క నాలుగు పేజీలు ..."
    
    సుధీర్ పుస్తకం లాగేసి, లైటార్పేశాడు. డిమ్ గా, నీలంరంగు కాంతిని గది అంతా పరుస్తూ బెడ్ లైటు వెలిగింది. నీలపు ఆకాశంలాగా వుంది ఆ కాంతి. ఆ నీలపు ఆకాశంలో చంద్రబింబంలాగా ఉంది శశి మొహం.
    
    శశిని దగ్గరగా పొదివి పట్టుకుని, రగ్గు కప్పుతూ "వసుమతి మ్యారేజ ని చెప్పి మూడు రోజుల పాటు కేరళ వెళ్ళిపోతున్నావు. నిన్ను వదిలి ఎలా ఉండను? నేనూ వచ్చెయ్యనా?" అన్నాడు సుధీర్.
    
    శశి నవ్వింది. "ఇద్దరం జాలీ బర్డ్స్ లాగా వెళ్ళిపోతే ఇక్కడ మన ప్రాక్టీస్ ఏమయిపోతుంది? మన పేషెంట్లు ఏమయిపోతారు, డాక్టర్?"
    
    "వోహ్! హెల్! ప్రాక్టీసు, పేషెంట్లు వాళ్ళని బ్రతికించడం కోసం మనం చచ్చిపోతున్నాం. మెడిసిన్ చదవటం తప్పయిపోయింది. మందుల షాపు పెట్టుకున్నా ఎంతో బాగుండేది."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS