Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 2


    "అవునవును-సో! అది సెటిలయిపోయింది. ఇక రెండో సలహా ఎవరయినా ఇవ్వగలరా?"
    జనంలో నుంచి డిటెక్టివ్ నవలా రచయిత్రి రాజేశ్వరి లేచి నిలబడింది.
    అంతా నిశ్శబ్దం అయిపోయింది.
    "మనం ఓ కొత్తపద్దతి అవలంబిస్తే బాగుంటుంది" అందామె.
    "ఏమిటది?"
    "ప్రతి పది ఇళ్ళకూ కలిపి మనం కంబైన్డ్ గా ఒక వార్నింగ్ బెల్ ఏర్పాటు చేసుకోవాలి. దాని మీట బెడ్ రూమ్స్ లో మంచం పక్కనే ఉంటుందన్నమాట. ఏ ఇంట్లో దొంగలుపడ్డా వాళ్ళు ఆ మీట నొక్కితే మిగతా తొమ్మిది ఇళ్ళల్లోనూ బెల్ మోగుతుందన్నమాట! దాంతో అందరూ కలిసివచ్చి ఆ దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించవచ్చు ఎలా వుంది?" అడిగిందామె.
    "వండర్ ఫుల్" అంటూ చప్పట్లు కొట్టారందరూ.
    "ఈ వార్నింగ్ బెల్ సిస్టం వెంటనే అమలు చేయాలి" అంటూ అరిచారెవరో.
    శంకర్రావ్ మళ్ళీ లేచి నిలబడేసరికి మళ్ళీ అంతా నిశ్శబ్దం అయిపోయారు.
    "మళ్ళీ ఏమిటి? ఈ సిస్టంలొ కూడా నీకు లోపం కనిపించిందా?" అడిగాడు రంగారెడ్డి చిరాకుగా.
    "అవునూ! వార్నింగ్ బెల్ మోగుతుంది, రైటే! ఒప్పుకున్నాం! కానీ పదిళ్ళలో ఆ బెల్ ఎవరిచ్చారో - అంటే ఏ ఇంట్లోనుంచి వచ్చిందో ఎలా తెలుస్తుంది?"
    శాయీరామ్ కి శంకర్రావ్ మీద వళ్ళు మండిపోతోంది.
    "ఎందుకు తెలీదూ? బాగానే తెలుస్తుంది" అన్నాడు కోపం అణచుకుంటూ.
    "అదే - ఎలా తెలుస్తుందీ అనడుగుతున్నాను."
    రాజేశ్వరికి శంకర్రావు మీద కోపం ముంచుకొచ్చింది. తను తన డిటెక్టివ్ మెదడు నుపయోగించి, ఎన్నో రోజులు ఆలోచించి కనుక్కున్నా అధ్బుతమయిన ఉపాయాన్ని అతగాడలా ఎలాంటి శ్రమ లేకుండా - తీసిపారేయడం భరించలేకపోయింది.
    "ఎలా తెలుస్తుందేమిటి? అలా బెల్ వచ్చిన వాళ్ళందరూ కలుసుకుంటే ఏ ఇంటి మెంబరు రాలేదో తెలిసిపోదూ?" అంది అతనో వట్టి తెలివి తక్కువ వెధవాయి అన్నట్లు చూసి.
    "అలా నడిరాత్రి అందరి అటెండెన్సు తీసుకుని, ఆబ్సెంటెవరో చూసి తేల్చుకొనేలోగా ఆ దొంగల పనికాస్తా పూర్తయిపోతుంది కదా? అదీగాకుండా ఒకవేళ వాళ్ళు మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారనుకోండి."
    "ఇక చాలు - ఆపు" అరిచాడు శాయీరామ్.
    శంకర్రావు ఆ పేసి మళ్ళీ కూర్చున్నాడు.
    "శ్రీమతి రాజేశ్వరిగారు చెప్పినట్లు పదిళ్ళకు కలిపి ఓ కాలింగ్ బెల్ ఏర్పాటు చేసే పద్దతి ప్రవేశ పెట్టాలని నిర్ణయించడమైనది" అన్నాడు శాయీరామ్.
    "సోదర సోదరీమణులు ఇంకేమయినా సలహాలు ఇవ్వగలిగితే త్వరగా చెప్పండి" అడిగాడు రంగారెడ్డి.
    "కాలనీవాళ్ళు డబ్బు బ్యాంక్ లోనూ, నగలన్నీ బ్యాంక్ లాకర్లలొ పెట్టటం మంచిదని ఇందుమూలముగా నేను మనవి చేస్తున్నాను" అన్నాడు కొత్తగా కాలనీ బాంక్ బ్రాంచికి మేనేజరుగా వచ్చిన మార్తాండరావు. "అలా అయితే దొంగలకు దొంగిలించేందుకు ఏమీ ఉండదు.
    అందరూ ఉత్సాహంగా "అవును!  ఒండర్ ఫుల్ ఐడియా" అంటూ అరిచారు.
    శంకర్రావు మళ్ళీ లేచి నిలబడ్డాడు.
    మార్తాండరావు చిరునవ్వుతో అతని వేపు చూశాడు. తను చెప్పిన దాంట్లో లోపాలు ఎన్నటం ఎవరివల్లవుతుంది?
    "అయ్యా! నాదో సందేహం!" అన్నాడు వినయంగా.
    "ఆ విషయం వేరే చెప్పక్కర లేదులే" అన్నాడు గోపాల్రావు తాపీగా.
    "ఏమిటో అఘోరించు!" లోపల అనుకోబోయి పైకి అనేసి నాలిక్కరుచుకున్నాడు రంగారెడ్డి.
    "మార్తాండరావుగారి సలహా నాకేం నచ్చలేదు. నగలు చేయించేది ఎందుకు? అన్నీ లాకర్లలో పెట్టి దాచుకోవడానికా! సరే- చెవుల దుద్దులు, గాజులు, నెక్లెస్ తీసి బాంక్ లాకర్లలో పెడతాం! మరి ముక్కుపుడక, మంగళసూత్రం మాటేమిటి? అవి కూడా లాకర్లో పెట్టాలా?"
    శంకర్రావ్ పాయింట్ ఆడాళ్ళను బాగా ఆకర్షించినట్లు కనిపించింది.
    "అవునూ మంగళసూత్రం లాకర్లో ఏమిటి - నా తలకాయ" ఎవరో అనడం స్పష్టంగా వినిపించింది శాయీరామ్ కి.
    "ఇక డబ్బూ అంతే! కనీసం అయిదారువేలయినా ఇంట్లో ఉంచుకోకుండా అంతా బ్యాంకులో పడేస్తే సడెన్ గా ఎవరికయినా ప్రాణం మీదకొస్తే ఏం చేయాలి? ఎవడిస్తాడు డబ్బు?" అనడిగాడు శంకర్రావు.
    "అవును మొన్న సీతారామయ్యగారి ఆఖరి పిల్లకి ఇలాగే ప్రాణం మీదకొస్తే పాపం ఆయన చేతిలో వెయ్యిరూపాయలు లేకపాయె" పార్వతీదేవి వత్తాసుపలికిందతనికి.
    మార్తాండరావు మొఖం చిన్నబోయింది. తన సలహాలోని రెండు అంశాల్నీ కూడా శంకర్రావ్ అలా చీల్చిచెండాడడం అతనికి నచ్చలేదు. అందుకని ఎదురుతిరిగాడు.
    "దాన్దేముందీ? డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చుగా! బాంకు ఎలాగూ కాలనీలోనే వుంది - ఉదయం సాయంత్రం ఓపెన్ ఉంటుంది."
    కాని శంకర్రావ్ ఏమాత్రం బెదరలేదు.
    "మరి అర్దరాత్రి సంగతేమిటి? అప్పుడు డబ్బు కావాలంటే ఎలా? సరే అదలా వదిలేయండి. మనదేశంలో సంవత్సరానికి మూడు నెలలు మొత్తం ఆఫీసులకూ బాంకులకూ శెలవులుంటాయ్. మరి ఆ మూడు నెలలూ డబ్బు దాచుకున్నవాడేం చేయాలి. అడుక్కుతినాలా? మొన్నటికి మొన్న వరుసగా మూడు రోజులు బాంకు మూసేశారు. అప్పుడు నేను మన కాలనీ వాళ్ళందరినీ అడుక్కుని భోజనం చేశాను తెలుసా?"
    "అవును! బాంక్ వద్దూ, గుడ్డూ వద్దు" అన్నారొకరు. దాంతో శంకర్రావ్ విజ్రుంభించాడు.
    "ఇంకో విషయం కూడా చెప్తున్నాను మన నగలకు బ్యాంకుల్లో మాత్రం ఏమీ రక్షణ ఉంది? ఆ మధ్య మా ఆవిడ గొలుసు బాంకులో తాకట్టుపెట్టి, తరువాత విడిపించుకుంటే ఆ గొలుసులో చిన్నముక్క కొట్టేసి అతుకు పెట్టారెవరో! గాజులకు కూడా చిన్నచిన్నముక్కలు కోసి కనిపించాయి-"
    అంతా హాహాకారాలు చెలరేగాయ్.
    "అవ్! నాకూ అట్లానే జరిగింది" అన్నాడు యాదగిరి లేచినిలబడి.
    మార్తాండరావ్ ముఖాననెత్తురు లేదు.
    "సోదరులారా! ఎక్కడో ఓ వ్యక్తి అలాంటి దురాగతానికి పాల్పడినంతమాత్రాన అన్ని బాంకులూ అంతేనంటారా?" అనడిగాడు దీనంగా. సావిత్రమ్మ కోపంగా లేచింది.
    "బాంకులన్నీ దగా - దొంగలు - నా గొలుసుని కూడా రెండు లింకులు కొట్టేశారు" అంది మెడలో గొలుసుతీసి గాలిలోవూపుతూ.
    చాలా,మంది ఆడాళ్ళు లేచి ఆమె చుట్టూమూగారు.
    శాయీరామ్, రంగారెడ్డి, గోపాల్రావ్ కలిసి అందరినీ కూర్చోమని బ్రతిమాలసాగారు.
    అంతా సద్దుమణిగాక చూసేసరికి మార్తాండరావ్ ఎక్కడా కనిపించలేదు.
    ఆ తరువాత ఇంకెవ్వరూ సలహాలివ్వలేదు.
    అంచేత అప్పటికప్పుడే కాలనీ సభ్యులందరినీ నలుగురు నలుగురు చొప్పున గ్రూపులుగా విభజించి ఎవరు ఏ రోజు నైట్ వాచ్ మెన్ ఉద్యోగం చేయాల్సిందీ నిర్ణయించారు.
    డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరికే ఆమె సూచించిన వార్నింగ్ బెల్స్ లను అమర్చే కార్యక్రమం అప్పజెప్పారు. ఆమె వారంరోజులు గడువు అడిగింది. దాంతో సభముగిసింది. సరిగ్గా ఆ రాత్రే రెండింటికి శాయీరామ్ ఇంట్లోకి దొంగలొచ్చారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS