Next Page 
జనపదం పేజి 1

       

                                                    జనపదం

                                        డా.. దాశరధి రంగాచార్య

 

    ఇరుకు దారి , బండ్లబాట, మిట్ట పల్లాలు, బాటకు ఇరువైపులా పచ్చని పంట పొలాలు ఏపుగా పెరిగి వున్నాయి. బండ్లు సాగిపోతున్నాయి. మొదటి బండిలో సాయుధ పోలీసులు, రెండవ బండిలో బలరామయ్య , వారి వెనుక మళ్ళీ కొన్ని బండ్లున్నాయి. వాటి నిండా సాయుధ పోలీసులున్నారు. బండ్లు మెల్లగా సాగుతున్నాయి. ఎడ్లు మందమందంగా నడుస్తున్నాయి. అప్పుడే సూర్యుడు నేట్టిమీడికి వచ్చాడు. త్వరగా ఊరికి చేరాలని ఆతురతపడుతున్నారు బలరామయ్య. వారు రెండు సంవత్సరాల తరవాత వస్తున్నారు తమ ఊరికి - తమ రాజ్యానికి.
    బండి ఒక రాతిని ఎక్కింది పడింది కుదిపింది. బలరామయ్య చాలా బాధపడ్డాడు తాను రెండు జతల ఎడ్లను ఎప్పుడూ మెపుతుండేవాడు తన కచ్చాదానికి, బండికి కడితే వాటిని ఆపడం ఎవరితరమూ అయ్యేది కాదు. తాను బయలు దేరడంటే ఊరంతా హడలిపోయి తప్పుకునేది. బండి ముందు ఒక చాకలి పరుగెత్తాలి. వేనుజ సామాను నెత్తిన పెట్టుకొని మరొకడు పరుగెత్తాలి. పరిగెత్తలేకుంటే చచ్చాడన్నమాటే. ఒకసారి అమీనూ తానూ కచ్చాడంలో పోతున్నారు.ముందు నడిచే చాకలికి ఏమైందో తెలియదు ఎందుకు మెల్లగా నడిచాడో తెలియదు. ఎడ్లు పరిగెత్తాయి . వాణ్ణి తొక్కేశాయి. బండి అపోద్దన్నాడు తాను. వాడి శవం అక్కడే పడిపోయింది. అలా ప్రభుత్వం చేశాడు తాను. అయినా ఒక్కసారి ఇగిరిపోయింది ప్రభుత్వం. ఎగిరిపోయింది. తాను ఊరే వదలిపోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా పోలీసు చర్య జరిగింది కాబట్టి పోలీసులు తనవెంట ఉన్నారు కాబట్టి రాగలుగుతున్నాడు. నిజాం నవాబు వట్టి బలహీనుడు. తనకు రక్షణ కల్పించలేకపోయాడు. భారత ప్రభుత్వం మంచిది. అందుకే తనకు పోలీసులనిచ్చి ప[పంపుతుంది. తాను ఖద్దరు కట్టలేదు మరి.
    బలరామయ్య బందిలోంచి తొంగి చూశాడు. ఏపుగా పెరిగి ఉన్నాయి పొలాలు. పొట్టకు వచ్చాయి. ఈ పొలాలన్నీ తనవే. అయినా రెండు సంవత్సరాల నుంచి తనకు గింజ రాలేదు. తుపాకుల వాళ్ళు వచ్చారు. భూములన్నీ పంచి పెట్టారు. ఇక తనకు దక్కడనుకున్నాడు. వాళ్ళు పొలాలు వేసి సిద్దంగా పెట్టారు. ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఈ సంవత్సరం పంట వస్తుంది. పంటంతా తనది. భూములన్నీ తనవి. పంచిన వారి మీద పగ తీర్చుకోవాలి. దున్నిన వాని దుంప తెంచాలి. మళ్ళీ తన ప్రభుత్వం సాగించాలి.
    "సాగుతుందా?"
    మనసులోని మాట బయటకే వచ్చేసింది. బండ్లో ఎవరూ లేరు - వినలేదు. ఎందుకా అనుమానం వచ్చింది తనకు! పోలీసులను బాగా మేపాలి! బండ్లో రెండు సారాయి జాడీలు కనిపించాయి చాల్తాయా? మరో బండిలో మేకలు "మేమే " అన్నాయి. తాను కావాలంటే వంద మేకలు గడీ ముందు తెగేవి. ఇప్పుడెవడిస్తాడు> అవసరం అయితే తెప్పించాలనుకున్నాడు.
    బండ్లు సాగుతున్నాయి. ఊరిముందుకు వచ్చేశాయి. పోలీసులు తుపాకులు సర్దుకున్నారు. లక్ష్యం తెలియని గురి పెట్టారు, నడిచారు. ఊళ్లోకి ప్రవేశించారు. బిక్కుబిక్కు మంటుంది. పిట్టలు లేని గూళ్ళలా ఉన్నాయి ఇళ్ళు. చడీ చప్పుడు లేదు. ఒక్క మనిషి కనిపించటం లేదు. అవురుమంటుంది. అంతా నిశ్శబ్దం . ఊళ్లోంఛి సాగుతున్నాయి బండ్లు. ఒక కుక్క ఏడ్చింది. ఒకటి మొరిగింది. గుండెలు దడల్లుమన్నాయి. తుపాకులు పేలాయి. రెండు కుక్కలా రక్తం సోడసోడ కారింది. చూశాడు బలరామయ్య. చూశారు పోలీసులు. నవ్వుకున్నారు. ఎందుకంత భయం? ఏమిటో వారికి అర్ధం కాలేదు. గుండెలు పీచుపీచుమంటున్నాయి. ఏమాత్రం చప్పుడైనా అదిరిపడుతున్నారు.
    పొద్దు వాలింది. మూడు జాములైంది. దొరవారి గడీ ముందు ఆగాయి బండ్లు. బలరామయ్య దిగాడు. తాము కట్టుకున్న మహాసౌధాన్ని చూశారు. అది మొండిగా వుంది. విరిగి వుంది. కులీ వుంది. కాలి వుంది. బలరామయ్య గుండె ఏడ్చింది. కన్నీటి చుక్కలు అతనికి తెలియకుండానే రాలాయి. విరిగి ముక్కలై పడివున్న గేట్లో అడుగు పెట్టాడు. ఎడమచేతివైపు గుర్రాల కొట్టానికి కప్పు లేదు. దూలాలు , వాసాలు లేవు. మొండి గోడలున్నాయి. గుర్రాలు వారి రాజ లాంచనాలు . అవి జవనశ్వాలు , అడుగు పెట్టగానే అందరికీ కనిపించాలని అక్కడ ఏర్పాటు చేశాడు, గుర్రాలు కాదు , గూళ్ళు కూడా మిగల్లేదు. గుండె చేరువైంది. కొట్టంలోకి యంత్రవతుగా నడిచాడు. ఒకసారి చుట్టూ తిరిగి చూశాడు. పైకి తల ఎత్తాడు - కప్పు చూడాలని. ఆకాశం కనిపించింది. మెల్లగా కదిలాడు, మెట్ల ముందుకు వెళ్ళి నుంచున్నాడు. దర్వాజాలు లేవు. కిటికీలు లేవు. కంతలున్నాయి. ఇటుకలు రాలిపడి ఉన్నాయి. మెట్లేక్కాడు . అది వారి బంకులు . అక్కడే కూర్చుని సకల వ్యవహారాలూ నడిపించేవాడు. రెండు పెద్ద నిలువుటద్దాలు పెట్టించాడక్కడ , గేట్లో అడుగు పెట్టినవాడల్లా తనకు కనిపించాలని ఏవి ఆ అద్దాలు? అసలా కుర్చీలు, బల్లలు వైభవం ఏది? అంతా పోయింది! అంతా నశించింది. ఏదో ప్రళయ మొచ్చింది! అన్నిటినీ కూల్చి కాల్సిపోయింది!
    "విప్లవం వర్ధిల్లాలె"
    "దున్నే వానిదే భూమి"
    "ప్రజారాజ్యం వర్ధిల్లాలే"
    అదిరిపోయాడు బలరామయ్య. అవి బొగ్గుతో గోడమీద రాసిన నినాదాలు. ఒకటి, రెండు మూడు - గోడ నిండా అవే ఉన్నాయి. చెరిపేయాలనుకున్నాడు. ఎన్నని చెరుపుతాడు! ఇంతలో ఆ నినాదాలు దిక్కులు పిక్కటిల్లాయి. వేలమంది తనను చుట్టూ ముట్టుతున్నట్లనిపించింది. కేక పెట్టినంత పని చేశాడు. వెనక్కు తిరిగి చూశాడు. తళతళ ,మెరిసే బాయినేట్లు పట్టుకున్న పోలీసులు కనిపించారు. అంతా ఒక భ్రమనుకున్నాడు. గడిచిపోయిన పీడ అనుకున్నాడు. ఇంతమంది పోలీసులున్నారు తనకేం భయం! ఇద్దరు పోలీసులను వెంట పెట్టుకొని లోన అడుగు పెట్టాడు. ఒక గబ్బిలం రయ్యిమని వచ్చి ముఖానికి కొట్టి ఎగిరిపోయింది. అదిరిపడ్డాడు బలరామయ్య. ఇదీ తనను ఎదిర్తిస్తుందా? అది కాపురమున్న ఇంట్లోకి తనను రావద్దంటుందా? తనను ఎదిరిస్తుందా? తాను ఇంత ఆస్తిని వదులుకున్నాడు. ఎదిరించలేకపోయాడు. పారిపోయాడు. అంత ప్రభుత్వం , పోలీస్, సైన్యం వున్న నవాబు ఏమీ చేయలేకపోయాడు! రాజ్యం ఊడింది. మంచిదైంది. ఇప్పుడు మహా సైన్యం వచ్చేసింది. తన సంపద తనకు వచ్చేస్తుంది. తన అధికారం? - అవును తన అధికారం? ఎంత దుర్భలుడైనాడు తాను? తన తండ్రి తన ముందే ఒక్కణ్ణి తుపాకి తో కాల్చి చంపాడు. అదీ వెట్టికి రానందుకు. వెనక్కు తిరిగి గేటు పక్కన ఉండవలసిన కట్టుగొయ్య వైపు చూశాడు. అది అక్కడ లేదు. అయినా ఎన్నో స్మృతులు అతని మెదడును తోలిచాయి. అందమైన పిచ్చి కనిపించింది. పిచ్చి ఆ ఊరికి కోడలుగా వచ్చింది. ఆమెను చూచాడు. అనుభవించాలనుకొన్నాడు. ఎదురించాడు భర్త - పట్టి తెప్పించాడు. కొట్టుకొయ్యకు కట్టించాడు. గొలుసులతో బంధించాడు. రక్తపు ముద్దను చేశాడు. అయినా అతను లొంగలేదు. అయితేనేం పిచ్చి తనదైంది ఆ రాత్రి. తెల్లవారింది ఊరిపోసుకుంది. అయినా అడిగినవాడేడి? ఎన్ని గుండెలు కావాలి? మళ్ళీ అధికారం వస్తుందా? దొరతనం నిలుస్తుందా'? చూడాలి . సాధించాలి.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS