Next Page 
ఆఖరి ఘడియలు  పేజి 1

 

                                               ఆఖరి ఘడియలు


                                                                                             యర్రంశెట్టి శాయి

                             

 

    సగం విరిగి గోడకు వేలాడుతున్న అద్దంలో తన ముఖాన్ని అయిదారు యాంగిల్స్ లో చూసుకొని క్రాఫ్ దువ్వుకుంటూ ట్యూన్ నెంబర్ వన్ పాడాడు భవానీశంకర్. సరిగ్గా కుదరలేదది. వెంటనే గొంతు స్థాయి తగ్గించి ట్యూన్ నెంబర్ 'టూ' పాడాడు. అది అంతంత మాత్రంగానే వుంది. ఇంక తప్పెట్లు లేదని కొంచెం గొంతు పెంచి ట్యూన్ నెంబర్ త్రీ పాడటం ప్రాంభించాడు.
    మొదటి చరణమైనా పూర్తవకుండానే గది గడప దగ్గర అలికిడైతే అటువేపు చూశాడు.
    తనకు తెలీకుండానే తన పాటకు ప్రేక్షకులు వెలిశారక్కడ.
    ముందు తులసి నుంచుని వుంది. చింపిరి జేడలు. ఓ పలక పట్టుకుని , తులసి వెనుక సెవెన్త్ క్లాస్ చదూతూన్న పక్కింటి రాజేశ్వరి నిలబడి వుంది. రాజేశ్వరి వెనుక ఆరో క్లాస్ చదూతూన్న రాంబాబు షోడాబుడ్డి గ్లాసు ల్లాంటి అద్దాలతో నిలబడి వున్నాడు. వెళ్ళందరి వెనుకా చాముండేశ్వరి పాపాయి నెత్తుకుని నిలబడి ఉంది. ఆమె వెనుక వాళ్ళత్తగారూ వీళ్ళు గాక ఆ చుట్టూ పక్కల ఇళ్ళ వాళ్ళందరూ కలిసికట్టుగా పెంచుకుంటున్న "టైగర్" అని పిలవబడే ఓ వీధి కుక్క కూడా తలుపు సందులో నుంచి తొంగి చూస్తోంది.
    తనేప్పూడు పాట పాడబోయినా ఇలా ఇంతమంది తిరణాలకు మూగినట్లు మూగిపోవడం చూసేసరికి భవానీశంకర్ కి, కోపం, నిరాశ, దిగులూ వగైరాలు కలగలుపుగా కలిగినాయ్. ఇప్పుడే కాదు. కొద్ది రోజుల క్రితం తానా గదిలో దిగిన క్షణం నుంచీ ఎప్పుడు గొంతెత్తి పాడదామన్న ఇదే వరస. రోడ్ మీద యాక్సిడెంట్ అయిన వాడికి "ఫస్ట్ ఎయిడ్" చేసినట్లు ఆ ప్రేక్షక సమూహాన్ని చెదరగొట్టడానికి తన పాటను అర్ధంతరంగా అపుచేయాల్సి వచ్చిందతనికి. ఆపేసి "ఇహి" అని నవ్వాడు.
    పాట ఆగిపోయే సరికి ఆ సముహమంతా ఒకరి తర్వాత ఒకరు గడప ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
     తులసి మాత్రం ఒక్కర్తే ఇంకా నిలబడి వుంది అమాయకంగా.
    "హలో హలో హలో హలో హలో" ఆమె వంక చూస్తూ ఆప్యాయంగా పిలిచాడు భవానీశంకర్.
    తులసి ముఖంలో కిప్పుడు చిరునవ్వు వచ్చింది.
    "కమాన్ మైడియర్ లిటిల్ ఫ్రెండ్! ట్యూషన్ అయిపోయి చాలా సేపయింది కదా? మళ్ళీ తమరు విచ్చేయుటకు కారణమేమిటి భామా?"
    తులసికి అతని భాష అర్ధం కాలేదు సరిగ్గా.
    "అంకుల్ - మమ్మీ సేస్ - మమ్మీ సేస్" అంది ఇంగ్లీషులో.
    "యస్ డియర్! ఏం చెప్పింది మీ మమ్మీ!"
    "నో అంకుల్ నాట్ మమ్మీ!"
    "నాట్ మమ్మీ!"
    "నాట్ మమ్మీ?"
    "నాట్ మమ్మీ!"
    "అయితే మరెవరు కామ్రేడ్?"
    "మా అంటీ అంకుల్! అంటీ సేస్- అంటీ సేస్ అంటీ చెప్పిందంకుల్ - నాకు పాటలు నేర్పవద్దని మీకు చెప్పమంది."
    "వాట్ వాట్ వాట్ వాట్ -" భవానీశంకర్ కన్ ఫ్యూజయిపోయాడు.
    "అవునంకుల్! ఇంకోసారి సినిమా పాటలు నేర్పిస్తే నా ట్యూషన్ స్టాప్ చేస్తుందట."
    భవానీశంకర్ అదిరిపడ్డాడు.
    "వన్ మినిట్ - వన్ మినిట్ కామ్రేడ్, కొంచెం వివరాలు అందించు ! నీకు సినిమా పాటలు నేర్పవద్దని మీ అంటీ చెప్పిందా?"
    "అవునంకుల్!"
    "అంటీ అంటే ఎవరు?"
    "అంటీ తెలీదాంకుల్ నీకు?"
    "తెలీదు కామ్రేడ్! అలాంటి కామ్రేడ్ ఒకరు మీ ఇంట్లో వున్నట్లు ఇవాళే వినటం-" ఆలోచనలో పడుతూ అన్నాడు.
    ఈ అంటీ ఎవరో అతనికే మాత్రం అర్ధం కాలేదు. తులసికి కేవలం తల్లీ- తండ్రి మాత్రమే ఉన్నరాన్న విషయం తనకు క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళిద్దరూ ఉద్యోగం చేసేవాళ్ళే కనుక తులసి ట్యూషన్ విషయం పట్టించుకునే ఓపిక వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళక్కావలసినది -ఇంగ్లిష్, హిందీ భాషల్లో రెండో క్లాస్ చదివిన ఆ పిల్లకు తను తెలుగు నేర్పటం? అంతవరకే! అంతేకాక తెలుగు ఫలానా విధంగా నేర్పించు అని గాని, ఎలాంటి తెలుగు నేర్పించాలి అనిగాని అంక్షలేవీ పెట్టలేదు వారు. అలాంటిది ఇప్పుడెవరో అంటీ వచ్చి ఇలా తనకు బెదిరిపు పంపటం చాలా అవమానకరంగా తోచిందతనకి.
    నెమ్మదిగా వెళ్ళి తులసి ముందు మోకాళ్ళ మీద కూర్చుని తులసిని దగ్గరకు తెసుకుని ముద్దు పెట్టుకున్నాడతను.
    "అంటీ ఎవరమ్మా?" అడిగాడామెని బుజ్జగింపుగా.
    "అంటీ అంకుల్ అంటీ తెలీదా నీకు?"
    "తెలీదు కదా! అంటీ పేరేమిటి?"
    "స్మేతా అంటీ అంకుల్! మొన్నే ఊర్నుంఛి వచ్చింది కదా. మా కోసం కోవా కజ్జికాయలు కూడా తెచ్చింది. "
    "కోవా కజ్జికాయలు తెచ్చిందా? దొంగ రాస్కెల్! మరి నాకు పెట్టలేదెం?"
    "కొంచమే ఉన్నాయ్ అంకుల్. నాకే చాలవ్."


Next Page 

  • WRITERS
    PUBLICATIONS