Next Page 
అనాథ మహిళా సదన్  పేజి 1


                           
                                                     అనాథ మహిళా సదన్;
                                                                                               రిజిస్టర్డ్  


                                                                                        -మేర్లపాక మురళి

                                    


    ప్లేటో ప్రేమపాత్రుడే, కానీ సత్యం ఇంకా ప్రేమ పాత్రమైంది. అరిస్టాటిల్ శిష్యుడై వుండి అలెగ్జాండర్ ఎందుకంత యుద్ధోన్మాది అయ్యాడు?

 

    ఈగోని సంతృప్తిపరచడానికి యూరప్ నుంచి ఆర్యావర్తనం వరకు యుద్ధాలుచేయాలా?

 

    సంఘం శరణం గచ్ఛామి - బౌద్ధమతానికి పూర్వం నుండీ లోకాయుత వుంది. చార్వాకుల్ని నిలువునా కాల్చేసినా నాస్తికత్వం ఎక్కడికి పోతుంది?

 

    భోగలాలసత ముద్రవేసి పుస్తకాలన్నిటినీ తగులబెట్టారు. చాలామందికి ఆనందాన్ని ఇచ్చేది 'లాక్'నీతి. నైతిక సమస్యతో నిమిత్తం లేనిది ఒక్కటే - అది కల.

 

    ఫ్రాయిడ్ ఇంట్రడెక్టరీ లెక్చర్స్ ఆన్ సైకో అనాలసిస్ పుస్తకాన్ని ఎక్కడయినా సంపాదించి చదవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ ఫోర్స్ అయితే మరి డబ్బో!! స్లీవర్ లో షెరాన్ స్టోన్ రూపంలో కైపెక్కిన సుఖం.

 

    హోటల్ లో అంతమంది ముందు ప్రియుడు అడగగానే అందరి కళ్ళలోనూ కారం కొట్టి తన లోదుస్తుల్ని తీసిచ్చిన జాణతనం, బుసలుకొట్టే వేడి నిట్టూర్పులతో థియేటర్ పేలిపోతుందేమోనన్న అనుమానం.

 

    థియేటర్ ఆఫ్ ఆబ్సర్డ్ - ఐశ్వర్యారాయ్ తో సన్ సిటీలో 'అందం - క్షణికం' అన్న టాపిక్ మీద మాట్లాడటం, బ్రూనో రాజుతో చర్చించడం - అన్నీ జీవితంలో సహా అసంబద్ధాలే.

 

    బెడ్ లేకపోవడంవల్ల నిద్రాదేవి రావడం లేదు. సెల్ స్టియల్ బెడ్ మీద లేడు ఛాటర్లీస్ లవర్.

 

    ఒక మనిషికి తన జీవితకాలంలో నాలుగువేలసార్లు సెక్స్ లో పాల్గొనే సామర్థ్యం వుంటుందట. వింటూనే ఇంత తక్కువా అనిపించింది. కానీ లెక్కవేస్తే కరెక్టేననిపించింది.

 

    తనకి ఇరవై ఎనిమిదేళ్ళు - పెళ్ళి కాలేదు - ఇంకా లెక్క ప్రారంభం కాలేదు.

 

    ఈ లెక్కన తన స్కోరు ఎంతవరకూ వస్తుంది?

 

    ఎవరో తలుపుకొడుతున్న చప్పుడుకి తరుణ్ కి మగత విడిపోయింది. లేచి ఊడిపోయిన టక్ ని సరిచేసుకుని తలుపు తెరిచాడు.

 

    ఎదురుగా మధు. మనిషినంతా భయంలో ముంచి లేపినట్లు చెమటతో తడిసిపోయున్నాడు. "థాంక్ గాడ్! ఇక్కడయినా దొరికావ్!" ఆయాసం అడ్డుపడడంతో ఆగాడు.

 

    "ఏమైందిరా? సెకండ్ షో సినిమాకెళదాం, రూంకు రమ్మన్నావు కదా. వచ్చి చాలాసేపట్నుండీ వెయిట్ చేస్తున్నాను. ఏమిటంత ఆదుర్దా పడిపోతున్నావు?" ఏమీ అర్థంకాకపోవడంతో స్నేహితుడి వైపు ప్లాట్ గా చూస్తూ అడిగాడు తరుణ్.

 

    "సరితాదేవి మనుషులు నీకోసం గాలిస్తున్నారు - హత్య చేయడానికి"

 

    "నన్నా?" ఆటంబాంబ్ కడుపులో పేలిపోయినట్లు కదిలాడు తరుణ్.

 

    "ఆఁ! నిన్నే - ఇంటికెళ్ళారు. అక్కడ లేవని తెలియడంతో నీ స్నేహితుల ఇళ్ళన్నీ వెదుకుతున్నారు. ఇప్పుడీ విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాను"

 

    వెంటనే ఏంచేయాలో తోచలేదు తరుణ్ కి. పారిపోవడం పిరికితనంగా తోచింది.

 

    కానీ సరితాదేవి మనుషుల్ని ఎదుర్కొని నిలబడటం కష్టం. చాలా అంగబలం కావాలి. అది లేదు తనకి. ఇక మిగిలింది ఒంటరిగా పోరాడటమే.

 

    అదే నిర్ణయించుకున్నాడతను.

 

    "ఏమిటట్లా నిలబడిపోయావ్? పారిపో... ఎక్కడికైనా సరే... వాళ్ళ కంటపడితే చంపేస్తారు"

 

    తరుణ్ ఏమీ మాట్లాడలేదు.

 

    "ఇక ఆలోచనలు అనవసరం. ముందు ఈ టౌన్ నుంచి దూరంగా వెళ్ళిపో. ఈ ఆవేశాలన్నీ పర్మినెంట్ గా వుండవుగా? పదీ పదిహేను రోజులు - ఎక్కువనుకుంటే నెల - ఆ తర్వాత అన్నీ చల్లబడతాయి. ఏం చేయాలో తర్వాత ఆలోచించుకోవచ్చు" ప్రాధేయపడుతున్న ధోరణిలో చెప్పాడు మధు.

 

    "కానీ చేతకానివాడిలా పారిపోవడం..."

 

    "ఎదురు నిలిచి ఏం చేయగలవ్? వాళ్ళు పదిమంది వున్నారు. అందరూ హత్యలు చేయడంలో ప్రొఫెషనల్స్. నిన్ను చంపడానికి వాళ్ళతో లక్షరూపాయలకు బేరం కుదుర్చుకుందట సరితాదేవి.

 

    కాబట్టి ఏమీ దయాదాక్షిణ్యాలు చూపించరు. ఇలాంటప్పుడు పారిపోవడం పిరికితనం అనిపించుకోదు. టైం లేదు. క్విక్!"

 

    అప్పుడు రాత్రి పదవుతూ వుంది. తుఫాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకాశం పిసికిన తారుముద్దలా వుంది. గాలి శవంలా చల్లగా తగులుతోంది.

 

    "ఇంత రాత్రి ఎక్కడికని వెళ్ళను?"

 

    ఆ మాటలకు రిలీఫ్ గా ఫీలయ్యాడు మధు.

 

    "ఎక్కడికయినా - బస్టాండ్, రైల్వేస్టేషన్లకు మాత్రం వెళ్ళకు. నడిచే - అడ్డదారంట వెళ్ళు. ఎంత దూరం వెళ్లగలిగితే అంతదూరం. పదిహేనురోజుల పాటు ఇటు చూడకు. ఆ తర్వాత అంటావా - అంతా కాలమే నిర్ణయిస్తుంది"

 

    పోవాలనుకున్నాడే గానీ ఎటు వెళ్ళాలో తోచడంలేదు తరుణ్ కి. ఆ టౌన్ లో బాగా ఇరుకుగా వుండే సందులో మిద్దె మీదున్న చిన్న గది అది. దాని వెన్నెముకలాగా మధ్యలో చెక్కమెట్లు.  

 

    అయోమయంగా చూస్తున్న మిత్రుడి భుజాలు పట్టుకుని బయటికి పిలుచుకొచ్చాడు మధు.

 

    "ముందు కదులు. ఎటు వెళ్ళాలో తర్వాత ఆలోచించుకోవచ్చు"

 

    ఎవరో కసికొద్దీ బాదితే ఎముకలంతా విరిగిపోతున్నట్లు చెక్క మెట్లు శబ్దం చేశాయి.

 

    "వాళ్ళు ఇక్కడికి వస్తున్నట్టున్నారు - వెళ్ళు" తరుణ్ ని ముందుకు తోశాడు మధు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS