Next Page 
ఆఖరి క్షణం పేజి 1


                               ఆఖరి క్షణం

                                                              - కురుమద్దాలి విజయలక్ష్మి

    

                                              


  "పార్వతి!"

  "ఓ పార్వతీ!"

శివరావు రెండోసారి గట్టిగా పిలవటంతో పెరట్లో వున్న పార్వతికి అప్పుడు పిలుపు వినిపించి, వస్తున్నాను వుండండి." అంటూ అక్కడ నుంచే బిగ్గరగా జవాబు యిచ్చింది.

కళ్ళ ఎదుట టేబుల్ మీద వున్న వేలెడంత సీసాని చూస్తూ. ఇక్కడికి ఎలా వచ్చింది! పార్వతికి సీసా తీసే అవసరం లేదే పైగా యీ సీసా...!" అనుకుంటూ శివరావు టేబుల్ మీద వున్న సీసాని చేతిలోకి తీసుకున్నాడు.

అప్పుడు చూశాడు శివరావు సీసాలోని ద్రవం వక చంచాడు ఖాళీ అయినట్లు. అంతేకాదు సీసా మూత కూడా సరిగా పెట్టిలేదు.

అది చూసి శివరావు మనసు కీడుని శంకించింది.

శివరావు మూడు గంటల క్రితం బైటికి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాడు. తొందరగా ఇంటికి రావాలని వేగంగా నడిచి రావటం వల్ల శరీరమంతా చమట పట్టింది. పైగా బైట వ్యవహారాలతో బాగా అలసిపోయి వున్నాడు.

ఇంట్లో అడుగు పెడుతూనే-

టేబుల్ మీద వున్న సీసాని చూశాడు. అలమరాపై అరలో మూలగాదా చిన సీసా టేబుల్ మీదకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పైగా సీసాలో ద్రవం చెంచాడు తరిగి వుంది.

అది చూస్తూనే ముచ్చెమటలు పోశాయి. కాళ్ళ నుంచి వణుకు బైలుదేరింది. "పార్వతీ!" అంటూ యీ తఫా మరింత గట్టిగా పిలిచాడు శివరావు.

అప్పటికే పార్వతి గదిలోకి వచ్చేసింది.

"ఏమిటి విషయం! పదిళ్ళకి వినిపించేలా పిలుస్తున్నారు?" పైట చెంగుకి తడి చెయ్యి తుడుచుకుంటూ చిరునవ్వుతో అడిగింది పార్వతి.

"ఈ సీసా ఎవరు తీశారు?" శివరావు గాభరా దాచుకుంటూ అడిగాడు.

"ఈ యింట్లో ఎంతమందిమి వున్నాము?" ఎదురు ప్రశ్న వేసింది పార్వతి.

"మనిద్దరమే వున్నాము అంటే...అంటే...నీవు తీసినట్లే."

"అవును నేనే తీశాను."

"తీసి ఏం చేశావు?"

 "నీళ్ళలో కలుపుకుని తాగాను. లేకపోతే ఏమిటండీ యీ ప్రశ్నలు! అసలా కంగారు ఏమిటంట...?"

 "నవ్వులాటకిది సమయం కాదు పార్వతీ!"

 "నేను నవ్వందే!"

 "మాటలు తర్వాత యిది విషం పార్వతీ! చెంచాడు అక్కరలేదు రెండు చుక్కలు చాలు ప్రాణం  తియ్యటానికి."

 "రెండు చుక్కలు చాలా అంత ఘాటైనదా యీ విషం?"

 "అవును."

"రెండు చుక్కలు చాలని తెలియక అనవసరంగా చెంచాడు అనవసరంగా చెంచాడు వాడాను. విషం కూడా పొదుపుగా వాడాలని నాకు తెలియదు సుమండీ!" తన సోగ కళ్ళని అందంగా తిప్పుతూ అంది పార్వతి.

"పార్వతీ!" ఈ తఫా శివరావు కళ్ళెర్ర చేసి చాలా కోపంగా పిలిచాడు.

భర్త ముఖం చూసి పార్వతి గతుక్కు మంది.

పార్వతి నలభయ్యో పడిలో పడింది. శివరావుకి నలభై నాలుగేళ్ళు. వాళ్ళ దాంపత్యం మూడు పూలు ఆరుకాయలు కాకపోయినా వాళ్ళ మధ్య నవ్వులు మూడు, పువ్వులు ఆరుగా నవ్వుతూ నవ్విస్తూ కబుర్లుతో కవ్విస్తూ పరాచికాలతో పసివాళ్ళుగా వక్క మాటలో చెప్పాలంటే పాలూ నీళ్ళూగా కలిసిపోయారు.

పార్వతి అమాయకురాలు అలా అని తెలివితక్కువది కాదు మంచి మనిషి.

శివరావు అమాయకుడు మాత్రం కాదు. మంచివాడు కాస్త తెలివిగలవాడు. నలుగురికీ సాయం చేసే వ్యక్తి. ఎవరి జోలికీ పోడు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS