Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 2


    తలవంచుకుని బయటకు వచ్చేస్తూ లోపలకు రాబోతున్న యువతికి ఢీ కొట్టి "సారీ!" అంటూ తలెత్తి ఆవిడ ముఖంలోకి నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడింది. ఆ యువతి విలాసంగా నవ్వుతూ "అలా చూస్తారేమిటి? నేను చంద్రను మీ ప్లేస్ లో స్టెనోగా వచ్చాను" అంది.
    కళ్ళు తిరిగి పడబోతున్న తులసిని చంద్ర పడిపోకుండా పట్టుకుంది. నడిపించుకుంటూ తీసుకెళ్ళి తన సీట్ కెదురుగావున్న కుర్చీలో కూచోబెట్టింది. ఆ సీట్....ఒకప్పుడు తన సీట్.... పొంగిరాబోతున్న కన్నీళ్ళను అతి ప్రయత్నంమీద అణచుకుంది తులసి. ప్యూన్ ని పంపించి కాఫీ తెప్పించింది చంద్ర. ఆ కాఫీని తిరస్కరించాలని అనుకుంది తులసి. కానీ, అప్పటి తన పరిస్థితిలో ఆ కాఫీ చాలా అవసరమనిపించి తాగేసింది.
    "థాంక్స్, వస్తాను." అని లేవబోయింది.
    "కూచోండి. ఇంకో గంటలో నేనూ వస్తాను. ఇద్దరం కలిసే వెళ్ళచ్చు."
    "ఎందుకులెండి. నేను మీతో కలిసి రాలేను." అప్రయత్నంగా అనేశాక తన మాటలకు తనే తెల్లబోయింది తులసి. చంద్ర అంటే మనకేమాత్రమూ గౌరవం లేనిమాట నిజమే! కానీ, ఇలా ముఖంమీద అవమానించాలనే ఉద్దేశం లేదు. బహుశ తన సీట్ లో చంద్రను చూస్తోంటే మనసు ఈర్ష్యతో ఉడికిపోతోందేమో! అప్పటికే చంద్ర కళ్ళు రోషంతో భగ్గుమంటున్నాయి. ఇక తన మాటను వెనక్కు తీసుకునేందుకు లేదు.
    "మీబోటి మర్యాదస్తులు నాతో రారని థెలిసెఅ అడిగానులెండి. నాతో రాకపోవడమే మంచిది. చూశారా? నేను బి.ఏ. పాసయ్యాను. ఉద్యోగం చేస్తున్నాను. బి.ఏ. పాసవటంలో ఘనత ఏముందండీ! జీవితంలో పరీక్షలు ఎదుర్కోవటం కష్టంకానీ, ఈ పరీక్షలు సునాయాసంగా పాస్ కావచ్చు. ఎటొచ్చీ అవకాశం రావాలి. అలా అవకాశాలు రానివాళ్ళంతా అల్పులు కారు."
    చంద్ర చిరునవ్వుతో మాట్లాడుతున్న కొద్దీ, ఏదో అసహనం రగులుతోంది తులసి మనసులో.
    "ఈనాడు ఇక్కడ ఎలాగో షైను కాగలిగారు. అంతమాత్రం చేత మీ గతం మాసిపోతుందా?"
    మరొక్కసారి చంద్ర కళ్ళు ఎర్రబడ్డాయి. అయినా చిరునవ్వునే ప్రదర్శించింది.
    "మాసిపోదు-అయినా నా గతం మాసిపోవాలని నేనేమీ ప్రయత్నించటం లేదు. అంత సిగ్గుపడవలసింది నా గతంలో ఏమీ లేదు...."
    "అవును - సిగ్గుకు అర్థం తెలిసినప్పుడు కదా, సిగ్గుపడటం?" గట్టిగా నవ్వింది చంద్ర.
    "నిజమే! ఇంతవరకూ నాకు సిగ్గుకు అర్థం తెలియదు. ముందు ముందు ఎప్పుడైనా, ఆ అర్ధమేదో మీ దగ్గర నేర్చుకుంటాను. మీరు సిగ్గుపడే పరిస్థితి వచ్చినప్పుడు" చంద్ర మాటల్లో వ్యంగ్యం అర్థమయింది తులసికి. గర్వంగా నవ్వుతూ "అలాంటి ఆశ పెట్టుకోకండి. ఏమున్నా ఏం లేకపోయినా, ఆత్మాభిమానంతో బ్రతుకుతున్న ఆడదాన్ని...." అంది.
    చంద్ర అతి నిర్లక్ష్యంగా నవ్వుతూ "మీ ఆత్మాభిమానం నాకు బాగా తెలుసు. ఇందాక మేనేజర్ గారితో మీ మాటలన్నీ విన్నాను." అంది.
    తులసి ముఖం తెల్లగా పాలిపోయింది.
    ప్యూన్ వచ్చి "మేనేజర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు" అనటంతో చంద్ర లేచి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ కూచోలేక తులసి లేచి బస్ స్టాప్ కి వచ్చేసింది.
    ఆఫీస్ కి వచ్చేవరకూ సూర్యం తనకు తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మింది. కానీ, ఏమిటో, ఎందుకో, ఇప్పటికీ సూర్యం తనమీద కోపగించుకున్నాడని అనుకోలేకపోతుంది. ఆ చిరునవ్వు, ఆప్యాయత నిండిన ఆ పలకరింపు.... ఏమో? అన్నీ పైపై మర్యాదలేమో! ఆరోజు అంతస్థుల భేదాన్ని కూడా లెక్కచెయ్యకుండా తన ఇంటికి వచ్చిన సూర్యాన్ని ఇంట్లో అందరూ అవమానించినట్లుగా మాట్లాడారు! అలా మాట్లాడటంలో ఆంతర్యం తనకు తెలిసినా, పెదవి విప్పి వివరించలేకపోయింది. అందుకే కష్టపెట్టుకున్నాడా సూర్యం? ఒకవేళ కష్టపెట్టుకుని కోపం తెచ్చుకున్నా అనుకోవలసిందేముంది? అది న్యాయమే? తనను ఉద్యోగంలోంచి తీసెయ్యటమే కాదు_ఆ స్థానంలో చంద్రను వేసుకున్నాడు. మనసు భగ్గుమంది. సరిగ్గా అదేసమయంలో ఆటోలో వెళ్ళిపోతూ చెయ్యి వూపింది చంద్ర. ఊరికే చెయ్యివూపి ఊరుకోలేదు. ఆటోలోంచి తల బయటపెట్టి అల్లరిగా, గర్వంగా నవ్వింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS