Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 1


                                                 మధ్యతరగతి మనిషి
                                                                                 _ యామినీ సరస్వతి

                                    
    వేప చెట్టు నీడలో బావిగట్టుపై ఉన్న బండపై కూర్చుని అలసటగా ముఖానికి పట్టిన చెమట తుడుచు కున్నాడు రమణయ్య. ఎండ మండిపోతూంది. గాలి బొత్తిగా ఆడటంలేదు. అప్పుడప్పుడు చెదురుమదురుగా మెల్లగా వీచినా ఆ గాలిలో చల్లదనం లేదు. వేడి గాడ్పులే మోసుకొస్తూ ఉంది.
    సుమారు పండ్రెండెకరాల చక్క అది. రమణయ్యకున్న సుక్షేత్రమైన పొలం అదొక్కటే. దానిలోనే అతను బంగారాన్ని పండిస్తున్నాడు. రెండెకరాల బెల్లంచెరుకు నాటాడు. దాన్ని ఆనుకుని రెండు ఎకరాలు పచ్చఅరటి నాటాడు. అరటితోట నానుకుని మరో రెండెకరాలు పసుపు నాటాడు. పసుపు తరువాత ఆ పండ్రెండెకరాలనూ రెండుగా విభజిస్తూ పొలంమధ్యగా వెళుతుంది పంటకాలువ.
    కలువకి పడమటి వేపున ఉన్న ఆరెకరాలూ వరే నాటుతుంటాడు రమణయ్య. ఆ ఆరెకరాల్లోనే ఉంది బావి.
    రమణయ్య వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచీ ప్రతీదీ స్వయంగా పర్యవేక్షించటమూ దగ్గర ఉండి చేయించటమూ అలవాటు చేసుకున్నాడు. అతడు ఏనాడూ ఏపనినీ గుత్తగా ఇవ్వలేదు. పొలాన్ని దగ్గర ఉండి ఎడ్లతో తను దున్నుతూ, ఇతర ఎడ్లజతలతో దున్నిస్తాడు. కూలీలను పిలిపించి చెత్తాచెదారమూ బాగా మురిగిపోయేటట్టు తొక్కిస్తాడు.  కూలీలతోనే నాటు వేయిస్తాడు. కలుపులు స్వయంగా దగ్గర ఉండి తీయిస్తాడు. కోతలూ అంతే! ఒకరోజు రెండు ఎకరాలూ కోయించి, మరురోజు ఆ రెండు ఎకరాలు గింజలు రాల్పిస్తాడు.
    చురుకుగా సాగుతున్న పనినిచూసి సేదతీరని రమణయ్య లేచి నించున్నాడు. కొందరు కోతకోస్తున్నారు. మరికొందరు అంతక్రితం రోజు కోసిన గడ్డిని మోస్తున్నారు. ఇంకొందరు ఆ గడ్డినుంచి గింజల్ని రాలుస్తున్నారు.
    "ఎండ మండిపోతోంది. కాస్సేపు చెట్టునీడన కూచోండర్రా." 'తనకూలీలు తన బిడ్డల్లాంటివాళ్ళు. వాళ్ల బాగోగుల్ని తనే చూడాలి' అనుకుని చెప్పాడు రమణయ్య. రాశిగా రాలుతున్న గింజల్ని చూసి రమణయ్య మనస్సు తృప్తిగా ఉంది. ఈ సంవత్సరం ఎంత లేదన్నా ఖర్చులకిపోను పది పుట్లపైగా మిగులుతాయి అనుకున్నాడు. ధరలు బాగా పలుకుతున్న ఈ రోజుల్లో ధాన్యలక్ష్మి అంటే ధనలక్ష్మి అనిపించిందతనికి.
    "ప్రసాదూ! చివరి కయ్యలో గింజలు బాగా రాలటంలేదు కదా?" అని అడిగాడు రమణయ్య.
    మోపు మోసుకువచ్చిన ఆయాసంతో నోటితో సమాధానం చెప్పలేక తల ఊపాడు నిజమేనన్నట్టుగా ప్రసాద్.
    "ప్రతి కారూ అలాగే అవుతోందిరా. ఈ పర్యాయం అందులో జనుము పెంచి బలాన్ని పెంచాలి." అన్నాడు రమణయ్య. కాస్త సేద తీరిన ప్రసాద్ "పశువుల ఎరువు తోలించండయ్య, భూమి బలుస్తుంది" అన్నాడు.
    "ఎక్కడరా బాబు? ఎంత ఎరువూ నారుమడికే చాలదు. నారు బాగుంటేనే పైరు బాగుంటుందని మనదృష్టి అంతా దానిమీదే. మరచిపోకుండా ఈ పర్యాయం నాలుగు బళ్లుకొని అయినా తోలాలి" అన్నాడు రమణయ్య పట్టుదలగా.
    బీడీ ముట్టించుకొని నిండుగా దమ్ముపీల్చి ఏదో చెప్పబోయాడు ప్రసాద్.
    "ఒరే ప్రసాద్! నీవు నామాట వినిపించు కోవటం లేదు. పైన వేడి, లోపల వేడి అది చాలక ఇంకా నిప్పులు మింగుతావ్. ఈ పొగ నీ గుండెల్ని, ఊపిరి తిత్తుల్నీ ఏదో ఒక రోజు కచ్చితంగా తినేస్తుంది. అప్పుడనుకుంటావ్ రా నన్ను_ అయ్యో అయ్యగారూ చెప్తే వినకపోయానే అని. ఆ రోజు తెలిసివస్తుంది నీకు." కన్నబిడ్డలాంటి కుర్రాడు చెడిపోతున్నాడనే అన్న బాధతో అన్నాడు రమణయ్య.
    ప్రసాద్ జవాబు చెప్పలేదు. తల ఒంచుకున్నాడు.
    "పెళ్ళయితే పెళ్ళాం అయినా అదుపులో పెడుతుందనుకుంటే అదీ దూర దూరంగానే పోతుంది" అన్నాడు ఇంకో యువకుడు. టెన్త్ దాకా చదివి అది గట్టెక్కలేక మిగిలిపోయి పెళ్ళి చేసుకుని హాయిగా శరీర కష్టంతో బ్రతుకున్నాడతను.
    "ఒరే! ఒరే! వాడి కెవరిస్తార్రా పిల్లని? నవ్వుతూ అన్నాడు రమణయ్య.
    "ఎం ఎందుకివ్వరయ్యగారూ?" ఉక్రోషంగా అడిగాడు ప్రసాద్.
    "చెప్పినమాట వినని మగవాడిని ఏ ఆడది చేసుకుంటుందిరా?"
    "ఆడదాని చెప్పుచేతల్లో ఉండే ఆడంగి నాయాల్నా నేను? నా మాట వినే అమ్మాయి దొరికితేనే చేసుకుంటాను. లేకుంటే లేదు. అంతే, ఇలాగే ఉండిపోతాను."
    "ఒరే ప్రసాదూ! ఈ రోజుల్లో ఆడవాళ్ళు అలాగే అనుకుంటున్నారా, మంచి మంచి చీరలు, రవికలు, పౌడర్లు, స్నోలు తెచ్చి ఇచ్చి, వారానికో, నెలకో టౌన్ కి సినిమాకి తీసుకెళ్ళి ప్రేమగా చూసుకొనే మగాడినే చూసుకుంటున్నారు వాళ్ళు. నీలా ప్రతిదానికీ కస్సు బస్సు మని చిర్రుబుర్రు లాడుతూ ఎగిరిపడి మాట వినని మగవాడిని ఎవర్తిరా చేసుకుంటుంది?"
    రమణయ్య మాటలకి జవాబు చెప్పకుండా చివరంటా కాలిన బీడీని విసిరేసి మోపు ఎత్తుకుని రావటానికి వెళ్ళాడు ప్రసాద్.
    "చాకులాంటి కుర్రాడు" అన్నాడు రమణయ్య మెచ్చుకోలుగా.
    ఎవరూ ఏమీ సమాధానం ఇవ్వలేదు.
    చెరుగుతున్న వైశాఖమాసపు ఎండల్ని లెక్కపెట్టకుండా పనిలో మునిగిపోయారు. తీసుకున్న కూలికి న్యాయం చేకూర్చాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు అంతా.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS