Next Page 
కళ్ళు పేజి 1


                              కళ్ళు

                                                                          -కొమ్మూరి వేణుగోపాలరావు

 

                                   


    అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి వుంటుంది.

 

    జోరున వర్షం కురుస్తోంది.

 

    వీధుల్లో అక్కడక్కడా విద్యుద్దీపాలు వెలుగుతున్నా వర్షం వల్ల చీకటే బాగా డామినేట్ చేసి కనపడనియ్యకుండా చేస్తోంది.

 

    రోడ్డుమీద జన సంచారం కూడా ఏమీ లేదు.

 

    ఎందుకో వాతావరణం బిక్కు బిక్కు మంటూన్నదనిపిస్తుంది.

 

    ఆర్.వి.స్ట్రీట్ రెండంతస్థుల మేడలో చాలా ఎరిస్ట్రోకేట్ గా వెలిగిపోతోన్న ఓ గదిలో ఫోమ్ బెడ్ మీద ఓ యువతి పడుకునుంది. వొంపులు తీరిన తెల్లటి శరీరం.

 

    ఆమె ప్రక్కనే అంతవరకూ పడుకుని వున్న యువకుడు నెమ్మదిగా లేచాడు. మంచంమీద నుంచి దిగబోతూంటే ఆమె కళ్ళు విప్పి చెయ్యి జాపి అతని చేతిని పట్టుకుని ఆపి "ఉహు" అంది.

 

    "ఏమిటి?"

 

    "నన్ను విడిచి వెళ్ళొద్దు."

 

    "నిన్ను విడిచా? ఎలా వెళ్ళగలననుకున్నావు?"

 

    "మరి?"

 

    "బాత్ రూంకి."

 

    మందాకిని నవ్వింది.

 

    "బ్యూటిఫుల్."

 

    "ఏమిటి?"

 

    "నీ..."

 

    "చెప్పు..."

 

    "నీ..." అంటూ ఆమె శరీరంలోని వివిధ అవయవాలవైపు మార్చి మార్చి చూస్తున్నాడు. చివరికతని చూపులామె గుండెలమీద వాలి అక్కడ నిలిచిపోయాయి.

 

    "ఛీ" అంటూ ప్రక్కనున్న దుప్పటి హృదయం మీదకు లాక్కుంది.

 

    "ఉహు. అదేం కాదు" అతని చూపులు గుండెలమీద నుంచి, శంఖంలాంటి కంఠం మీదకి, అక్కడ్నుంచి చెంపలమీదికి, ఆ పైకి సాగాయి.

 

    ఆమె తన విశాల నేత్రాలను కదిలిస్తూ అతన్ని ఆర్పి ఆర్పి చూస్తోంది.

 

    "నీ..."

 

    "ఊ..."

 

    "కళ్ళు"

 

    ఆ పొగడ్తకు అందమైన, విశాలమైన ఆమె కన్నులు మరింతగా విచ్చుకుని ఏవో లోకాల్లోకి విహరిస్తూన్నట్లు అటూ ఇటూ కదిలాయి.

 

    ముందుకు వంగి రెండు కళ్ళనూ ముద్దుగొన్నాడు.

 

    పెదాల తడి కళ్ళకంటుకుని ఆ వెలుగులో తళతళమని మెరిసినట్లయింది.

 

    "ఇప్పుడే వస్తాను" అంటూ లేచి లోపలకు వెళ్ళాడు.

 

    వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళేసరికి టాప్ లోంచి నీళ్ళు పడుతున్నాయి.

 

    ఒక్కక్షణం యధాలాపంగా తీసుకుని, అంతలోనే ఉలిక్కిపడ్డాడు. రెండు మూడు గంటలక్రితం తాను బాత్ రూమ్ లోకి వచ్చినప్పుడు టాప్ కట్టేశాడు. తనకి బాగా గుర్తుంది. అసలు తానే విషయమూ తేలిగ్గా మరిచిపోడు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలుకూడా డైరీలో రాసుకున్నట్లు తు.చ. తప్పకుండా చెప్పగలడు.

 

    మందాకిని ప్రక్కమీద నుంచి లేవలేదు. ఆమె మధ్యలో ఎప్పుడూ లేవదు. ఈ రకంగా తామిద్దరూ, తన లెక్క ప్రకారం పధ్నాలుగుసార్లు కలుసుకున్నారు. తమ ఇంట్లో గత ఆరునెలలుగా ఆమె పరిచయం. ఈ ఆరునెలల్లో ఒకసారి ప్రక్కమీదకు చేరాక మధ్యలో లేవటమెప్పుడూ చూడలేదు. తాను చూడలేదంటే అలా ఎన్నడూ జరగలేదన్నమాట.

 

    తాను ఏ చిన్న అంశాన్ని గురించి కూడా తేలిగ్గా తీసుకోడు. నిశితంగా ఆలోచిస్తూ వుంటాడు. ఈ నైజ గుణాన్ని గురించి చాలా గర్విస్తూ ఉంటాడు కూడా.

 

    ఆలోచిస్తూనే వాష్ బేసిన్ దగ్గర నిలబడి అద్దంలో చూసుకుంటూ మొహం చన్నీటితో కడుక్కున్నాడు.

 

    చాలా హాయిగా వుంది. అసలు స్నానం చేద్దామా అనిపించింది.

 

    కాని తానిక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేస్తే మందాకినికి కోపమొస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళిపోయే టైమయింది కూడా.

 

    వాష్ బేసిన్ దగ్గర్నుంచి ఇవతలకు ఓ అడుగు వేశాడు.

 

    ఉన్నట్లుండి లోపల లైటారిపోయింది.

 

    అశ్వనీకుమార్ సహజంగా చాలా ధైర్యస్థుడు. అటువంటిది అతనికి కూడా గుండె దడదడలాడింది. ప్రక్కన ఏదో కదిలినట్లయేసరికి ఒళ్ళంతా గగుర్పొడిచింది.

 

    "మందాకినీ!" అని పిలుద్దామనుకున్నాడు! కాని అతనిలోని అహం అడ్డొచ్చింది. మందాకిని దృష్టిలో తనో హీరో. ఎన్నో ప్రయత్నాలు చేసి, ఆమెను సాధించి చివరకు పొందగలిగాడు. ఆమె ముందు తన ఇమేజ్ చెరిపేసుకోవటమతనికిష్టం లేదు.

 

    డోర్ ఎక్కడుందో ఊహించుకుంటూ ఆ చీకట్లో అటుకేసి నడవసాగాడు.

 

    ఒకటి రెండు అడుగులు వేశాక పాలిష్డ్ స్టోన్ మీద కాలుజారి క్రింద పడబోయి సర్దుకున్నాడు. తనది అద్దె ఇల్లు. బాత్ రూంలో కెన్ టెయిల్స్ బదులు పాలిష్డ్ స్టోన్స్ ఎందుకు ఉపయోగించారో అర్ధంకాదు.

 

    చీకట్లో బయట మందాకిని ఏం చేస్తోంది? ఒకవేళ ఏమయినా అఘాయిత్యం...


Next Page 

  • WRITERS
    PUBLICATIONS