Next Page 
మరోమనసు కథ పేజి 1

                                                              మరో మనసు కథ
   
                                                                      --వాసిరెడ్డి సీతాదేవి
   

                             

                                     

 

 

     "హల్లో! సుధా! నేనే కృష్ణను మాట్లాడుతున్నా!"
   
    "ఎక్కడినుంచీ? మీకోసం గంటనుంచి ఎదురుచూస్తున్నా."
   
    "ఆఫీసునుంచే మాట్లాడుతున్నా."
   
    "ఇంకా ఆఫీసులోనే ఉన్నారా?"
   
    "ఐయామ్ సారీ సుధా! చాలా అర్జెంటు పనిమీదున్నా! సాయంత్రం ఫ్లయిట్ కు మద్రాసు వెళ్ళాలి. నేవచ్చాక వివరాలు చెపుతాను. నువ్వు భోజనం చెయ్యి. డోంట్ వైట్ ఫర్ మి."
   
    "మీరు...."
   
    "నేను ఇక్కడ క్యాంటీన్ లో ఏదో ఒకటి తినేస్తాను. నువ్వు భోజనంచేసి నా బట్టలూ- అవీ- సర్దిపెట్టు, నాలుగున్నరకు వస్తాను. ఓ.కే! మరి ఉంటా!"
   
    రిసీవర్ పెట్టేసి సుధ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది.
   
    అడుగులో అడుగువేస్తూ డైనింగ్ టేబుల్దగ్గిరకు నడిచింది. టేబుల్ ముందు కుర్చీలో నీరసంగా కూర్చుంది. టేబుల్ మీద కృష్ణ కిష్టమైన కూరలు- సేమ్యాపాయసం చూస్తూ సుధ నిట్టుర్చింది.
   
    అసలు పొరపాటు తనదే.
   
    కృష్ణను ఇవ్వాళ ఆఫీసుకు వెళ్ళనియ్యాల్సింది కాదు!
   
    శెలవుపెట్టమని అడిగితే "సుధా! ఒకరోజంతా శెలవు వృధా చెయ్యడం ఎందుకు? మధ్యాహ్నం శెలవుపెట్టి లంచ్ టైంకు వస్తాగా!" అన్నాడు.
   
    తను గట్టిగా పట్టుబడితే శెలవుపెట్టేవాడే. కాని తనే ఒప్పేసుకుంది.
   
    ఏం ఆఫీసో ఏమో?
   
    అంత అర్జంటు పనేమొచ్చిందో?
   
    అయినా ఆ మాత్రం చెప్పలేడా?
   
    పెళ్ళిరోజని చెప్పడానికి బిడియపడితే పడొచ్చు. కాని పుట్టినరోజు అని చెప్పడానికేం? అంత మొహమాటం ఎందుకో?
   
    భర్తలేకుండా వంటరిగా అన్నం తినడానికి సుధకు మనస్కరించలేదు.
   
    ఊరికే తనకోసం అన్నాడుకాని నిజంగా క్యాంటీన్ లో తింటాడా?
   
    సుధ టేబుల్ సర్ది పడకగదిలోకి వచ్చింది.
   
    చేతిగడియారం చూస్తే రెండూముప్పయ్ ఐదు అయింది. టేబుల్ మీదున్న టైంపీసు పన్నెండు దాటాక ఆగిపోయింది. ఉదయం హడావుడిలో "కీ" ఇవ్వడం మర్చిపోయింది. కీ ఇచ్చి, టైం దిద్ది. గదిలోకి వచ్చి పక్క మీద కూర్చుంది.
   
    జడలో ఉండిన మల్లెపూలచెండు తీసి టేబుల్ మీదపెట్టి, పక్కనే ఉండిన పెళ్ళినాటి ఫోటో కేసి చూస్తూ ఉండిపోయింది కొద్ది నిముషాలు__
   
    "సుధా! ఏమిటలా చూస్తున్నాయ్?"
   
    "ఒక్క ఏడాదిలోనే మీరెంత మారిపోయారోనని."
   
    "నేను మారిపోవడమా? సుధా నువ్వేం మాట్లాడుతున్నావ్?"
   
    "అవును! మీరు మారిపోయారు. లేకపోతే ఈరోజు మీరు ఇల్లు విడిచి వెళ్ళిపోయేవారేకాదు. ఈ రోజు నా పుట్టినరోజు."   

    "నీ పుట్టిన రోజేకాదు - మన పెళ్ళిరోజుకూడా?"
   
    "అయితే ఆఫీసులోనే ఎందుకుండిపోయారూ?"
   
    "సుధా! డియర్! నేను చెప్పేది వినవా?"
   
    ఉలిక్కిపడి లేచింది.
   
    హాలులో ఫోయిన్ మోగుతున్నది.
   
    టేబుల్ మీద ఫోటో సర్దిపెట్టింది. హాలులోకి వచ్చింది.
   
    "హల్లో!"
   
    "నేనే! భోజనం చేశావా?"
   
    "ఊఁ! చేశాన్లెండి!"
   
    "నిజం?"
   
    "నిజమేలెండి. మరి మీరూ?"
   
    "కేంటీన్ లో తిన్నాను. నువ్వు తిన్నావో లేదోనని."
   
    "తిన్నానండీ. ఎప్పుడొస్తున్నారూ?"
   
    "నాలుగ్గంటలకల్లా వస్తాను."
   
    "త్వరగా వచ్చెయ్యండి. మద్రాసు వెళ్ళక తప్పదా?"
   
    "నేను వచ్చాక చెపుతాగా? ఉంటాను మరి" అవతల కృష్ణ ఫోన్ పెట్టేశాడు.
   
    చేతిలోని రిసీవర్ కేసి చూస్తూ కొద్దిక్షణాలు అలాగే నిలిచిపోయింది సుధ.
   
    రిసీవర్ పెట్టేసి గబగబా బెడ్ రూంలోకి వెళ్ళింది. టేబుల్ మీదుండిన ఫోటోను తీసుకొని గుండెలకు హత్తుకుంది.
   
    ప్రేమించి గౌరవించే భర్త లభించడం తన అదృష్టం. తనను విడిచి ఒక్క క్షణం ఉండలేడు. పెళ్ళయి సరిగ్గా సంవత్సరం అయింది. తన మనసుకు బాధ కలిగించే ఒక్క పనీ చెయ్యలేదు. అంతపనిలో ఉండి కూడా తను తిందో లేదోనని ఆరాటపడిపోతున్నాడు.
   
    పిచ్చి కృష్ణ!
   
    అంతా పసిపిల్లవాడి మనస్తత్వం.
   
    తనకు భగవంతుడు ప్రత్యక్షమై ఏదయినా వరం కోరుకోమంటే ఏడేడుజన్మలకు కృష్ణనే తనకు భర్తగా ప్రసాదించమని తను కోరుకుంటుంది.
   
    ఆ మొదటి రాత్రి....
   
    ఆ రాత్రి తాలూకు ప్రతిక్షణం తనకు ఇంకా గుర్తే వుంది. ఆ మధుర స్మృతులు ఎలా మర్చిపోగలదు? ఆదివ్యానుభూతుల్ని ఆజన్మాంతం తన హృదయంలో నిలిచిపోయేలా దీవించమని దేవతలని తను సదా ప్రార్ధిస్తూ వుంటుంది. ఆ మధురస్మృతిని మననం చేసుకోవాల్సిన ఈరోజే ఈ అవాంతరంవచ్చి పడింది. ఆయనగారి బాసుకు ఈరోజే అంతముంచుకు పోయే పనేమొచ్చి పడిందో?
   
    డోర్ బెల్ మోగింది.
   
    సుధ పరుగు పరుగున వెళ్ళి తలుపు తీసింది.
   
    "నువ్వా పంకజం?" నిరాశగా అంది ఎదురుగా నిల్చుని ఉండిన పనిపిల్లను చూస్తూ.
   
    "తొందరగా రమ్మన్నారు గదమ్మా! అందుకే వచ్చేశా" అంటూ పంకజం సుధ ముఖంలోకి చూసి కలవరపడింది.
   
    "అదేంటమ్మగారూ! అట్టాగున్నారేం? వంటో బాగోలేదా?"
   
    "ఎలా ఉన్నానూ? బాగానే ఉన్నాను."
   
    "మరీ...." సాగదీసింది పంకజం.
   
    "అబ్బే! ఏం లేదే! అయ్యగారు...."
   
    "అయ్యాగారికేమైందమ్మా?" కంగారుపడింది పంకజం.
   
    ఇదో తిక్కది. మాట చొరవనివ్వదు, ఒకటే తొందర.
   
    చిరాగ్గా పనిపిల్లకేసి చూసింది సుధ
   
    "అయ్యగారింకా ఇంటికి రాలేదే!"
   
    "ఆరొచ్చేది ఐదు దాటింతారవాతగందా?" అధో లాపాయింట్ లా సాగదీసి అంది పంకజం.
   
    "ఇంకా నాలుగైనా కాలేదు. బాబుగారు రాలేదని అట్టా బెంబేలెత్తి పోతున్నారేందమ్మా!" మళ్ళీ అందుకొని అంది పంకజం.
   
    "నీ బొంద. అసలు నువ్వెమాటా వినిపించుకుచావవు. అయ్యగారు మధ్యాహ్నం భోజనానికి వస్తానన్నారు. ఇంతవరకు రాలేదు. భోజనంకూడా చెయ్యలేదని నేనిదవుతుంటే- మధ్యలో నువ్వెమిటే?"
   
    "అట్టా సెప్పండి!"
   
    "ఏదీ నువ్వు చెప్పనిస్తేగా?"
   
    "అయ్యగారెందుకు రాలేదంటారూ?"
   
    "అబ్బా! ఆ గొడవంతా నీకెందుక్కాని ముందు నువ్వు లోపలి నడువ్. అయ్యగారి పెట్టేతీసి దులిపి శుభ్రం చెయ్యి. బట్టలు సర్దాలి" సుధ పడక గదికేసి దారితీసింది.
   
    "అయ్యగారు ఊరికెళ్తున్నారా?" తనలో తనే అనుకుంటున్నట్టు అంటూ వెనకే నడిచింది పంకజం.
   
    సుధా ముందుకు నడుస్తూనే తల తిప్పి వెనక్కు చూసింది.
   
    దీని దుంపతెగ. వట్టి వాగుడుకాయ. ఇంకా పదహారేళ్ళ నిండలేదు. లంగా ఓణీ మానేసి ఇప్పుడిప్పుడే చీరలు కట్టడం మొదలుపెట్టింది.
   
    ఇప్పుడు దాని వంటిమీదున్న చీర తనిచ్చిందే. పాత చీరే అయినా దాని వంటిమీద కొంత అందాన్ని తెచ్చిపెట్టినట్టుంది.
   
    నొక్కుల జుట్టు!
   
    బిగుతుగా వేసుకొన్న జడ!
   
    నీడలు తేలుతున్న చెక్కిళ్ళు.
   
    గుండ్రటి ముఖం.
   
    మెరిసే కళ్ళు.
   
    భూమ్మీద ఆనని నడక- ఆ వయసులో ఉన్న ఏ ఆడపిల్లయినా....
   
    "ఎవరీ అమ్మాయ్?"
   
    తన కాళ్ళకు బంధం పడినట్టు అయింది.
   
    ఠక్కున ఆగి తలెత్తి చూసింది.
   
    ఎర్రగా బొద్దుగా ఉన్నావిడ ఎదురుగా నిలబడి ఉంది.
   
    "మా పెద్దమ్మాయి ప్రియసుధ" అమ్మ చెప్పింది. ఆ మాటంటున్నప్పుడు అమ్మ కంఠంలో గర్వం తొంగిచూసింది. తర్వాత అమ్మ చెప్పింది. ఆమెగారు కలెక్టర్ గారి సతీమణి అట. ఆరోజు ఆఫీసర్ల క్లబ్బులో డిన్నర్. తన ఈడు పిల్లలు ఎందరో ఉన్నారు. అయినా అందరి కళ్ళూ తనపైనే ఉన్నాయ్ అని తనకు తెలుసు. అందుకే తనకు వాళ్ళ మధ్యలో తిరగాలంటే ఇబ్బందిగా అనిపించింది. కాళ్ళూ, చేతులూ కట్టేసినట్టుగా అన్పించింది.
   
    క్లబ్బునుంచి తిరిగొచ్చాక ఆరాత్రి అమ్మ తనకు నడిమంచంపైన కూర్చోబెట్టి దిష్టి తీసింది.
   
    ఆరోజు__తనకు అక్షరాభ్యాసం చేసినరోజు-ఇంకా తనకు బాగా గుర్తుంది-
   
    చదువుల సరస్వతి కావాలని తన తాతయ్య దీవిస్తూంటే "అప్సరసకు చదువు వంటబడుతుందా?" అని అన్నాడు మామయ్య.
   
    "అమ్మగారూ! అయ్యగారి క్యాంప్ ఎన్ని రోజులూ?"
   
    సుధ మనోఫలకంపైన తిరిగిపోతున్న గతం తాలూకు చిత్రాలు చెదిరిపోయాయి.
   
    పంకజం కేసి చురచుర చూసింది సుధ.
   
    "ఏంటట్టా చూస్తారు? పెద్ద పెట్టె తియ్యమంటారా, చిన్న పెట్టె తియ్యమంటారా అని..." వార్డురోబ్ తెరిచి కిందికి వంగి చూస్తూ అంది పంకజం.
   
    దీని తెలివితేటలు అమోఘం. ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. దాని కర్మకాలి బీదకుటుంబంలో పుట్టింది. ఉన్న కుటుంబంలో పుట్టి చదువుసంధ్యలుంటే ఇక దీన్ని పట్టేపనికాదు.
   
    "చిన్న సూటు కేస్ తీసి దుమ్ము తుడవసాగింది.
   
    అవునూ! అయన రెండు రోజుల్లోనే తిరిగొస్తున్నట్టు తనకు చెప్పాడా? లేదే! తను అలా ఎందుకనుకొంది? సుధా ఆలోచనలో పడింది.
   
    ఏం చెప్పకపోతే? తనే చెబుతుంది రెండురోజుల్లో వచ్చెయ్యమని! విమానంలో వెళుతున్నాడు. మళ్ళీ విమానంలోనే తిరిగొస్తాడు. మద్రాసులో ఒక్కరోజు చాలు. అర్జంటు పనటగా? రోజులకొద్దీ అతనక్కడ కూర్చునే పని కాదుగా?
   
    "ఇదుగోనమ్మా పెట్టె! ఏం బట్టలు పెడ్తారో పెట్టండి" నడుముకు చేతులు తాటించి కళ్ళు గిరగిర తిప్పుతూ అంది పంకజం.
   
    "అదేదో నేను చూసుకుంటాలే! నువ్వెళ్ళు. అంట్లు తోము. వెళ్ళవే! వెళ్ళు"
   
    "మూతి గుండ్రంగా తిప్పి నొసలు విరుస్తూ సుధాకేసి సూటిగా చూసింది పంకజం.
   
    "ఏమిటే నీ చూపూ నువ్వూనూ! నిన్ను చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది."
   
    "అప్పుడే? యింకా అయ్యగారు ఊరికి వెళ్ళనే లేదు!"
   
    సుధ అడుగు ముందుకేసింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS