Home »  » Ladies Special

గ్రేట్ వారియర్ మా అమ్మ

అమ్మో.. తప్పు చేస్తే అమ్మ చంపేస్తుంది అని మేము, భాను ( అక్కయ్య/పిన్ని/ అమ్మమ్మ/ అత్తయ్య) కోప్పడుతుందని బంధువులు అందరికీ తన ముందు, కానీ వెనక కానీ తప్పు చెయ్యాలన్నా, అబద్ధం చెప్పాలన్న భయం. ఎందుకంటే ఒప్పుకోదు. తప్పు చెయ్యనివ్వదు, ఛస్తే తప్పు చేయదు. “That is Bhanumathi.”

మమ్మల్ని చాలా చాలా క్రమశిక్షణతో, అవసరమయితే శిక్షతో సరి చేసింది. లెఖ్ఖల్లో దిట్ట. చదువులో గ్రేట్.. విపరీతమయిన చురుకు. తను స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు రోజు..  నేను కడుపులో ఉన్నాను. ఆ రోజు సీమంతం.. గాజులు పెట్టించుకుంది, రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నేను పుట్టేనట. ఊరంతటికీ ఫస్ట్ వచ్చింది. స్కూల్ పీపుల్ లీడర్. జీవితం పట్ల విపరీతమయిన ఆసక్తి, అన్నీ తెలుసు కోవాలనే జిజ్ఞాస. బహుముఖ ప్రజ్ఞాశాలి. వీణ వాయించేది, బాగా చదువుకునేది, రచనలు చేసేది.

మా అత్తగారి శిష్యురాలు వీణలో. వాళ్ళిద్దరి అనుబంధం ఒదినా- ,మరదళ్ళకి, గురు శుష్యులకీ ఆదర్శ ప్రాయం. చిన్నప్పుడు గురు దక్షిణ సమంగా ఇచ్చేమో లేదోనని 10 సంవత్సరాల క్రితం పగడాల ఉంగరం చేయించేరు గురువుగారికి. ముఖ్యంగా నా మొదటి వీణ గురువు మా అమ్మ గారు.

అంతెందుకండీ! మా అమ్మ, నాన్నగారు వాళ్ళ గురువులకు (అయ్యగారి సోమేశ్వర రావు గారు, అయ్యగారి జయకుమారి గార్లకు) నన్ను గురుదక్షిణగా సమర్పించి...” నన్ను వాళ్ళతో సవ్యంగా నడచుకుని, చక్కగా వ్యవహరించి, కుటుంబాన్ని చక్కగా చూసుకుని మంచి పేరు తెచ్చుకోమని ఆదేశించారు.”. నేను అలాగే నడచుకున్నాను, నడచుకుంటున్నాను, నడచుకుంటాను.

నేను గర్వ పడే విషయం ఏమంటే.. మా నాన్నగారు, “నాకు జన్మ అంటూ మళ్ళీ ఉంటే జయలక్ష్మే నాకు మళ్ళీ కూతురుగా పుట్టాలి” అన్నారు. మా అమ్మ “ పిల్లలంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది, కానీ జయలక్ష్మి అంటే మాకు గౌరవంతో కూడిన అభిమానం.” అని చెప్పారు. అభిమానం నా హక్కు, గౌరవం నేను సంపాయించుకున్నది. నా జన్మ ధన్యం.

కాకపోతే చివర్లో పులిలాంటి మా అమ్మ పిల్లిలా అయిపోయి, కొన్ని మర్చిపోయి, యోగినిలా నవ్వుతూ చూస్తూ ఉండి పోయింది మాట్లాడకుండా....... అటు వంటి స్థితిలో కూడా చదువుకి సంబందించినంత వరకూ పర్ఫెక్ట్. లెక్ఖలు ఎంత క్లిష్టమైనవైనా క్షణాల్లో చెప్పేది, ఇంగ్లీష్ లో అమ్మ, “సైట్ అర్ధం ఏమిటి అంటే ....సైట్ మూడు రకాలవి...అని.. Sight, site, cited”.. అని చెప్పేవారు, పద్యాలు చెప్పేవారు, అలానే ప్రైజ్ అంటే..”రెండున్నాయి praise, prize..అని, మొదటిది మనం చేసిన ప్రయత్నానికి ఎదురు వాళ్ళు ఇచ్చేది, రెండోది మనం హక్కుగా సంపాయించు కునేదీ” ట. బాగుందా? అలానే Pedestrians, Trespassers లాంటి క్లిష్టమైన పదాలకి అర్ధాలు చెప్పేరు, పోయే ముందు మూడు నెలల ముందు ఇదంతా... కొత్త కొత్త తెలుగు పద్యాలు ఎన్నో చెప్పి రాసుకోమన్నారు, కానీ అజ్ఞానం వల్ల రాసుకోవచ్చులే అనుకున్నా.. ఫలితం అర్ధంయ్యిందనుకుంటా..పాపం మా అమ్మ మొదటి నుండి ధైర్యంగా పరిస్థితులతో పోరాడింది, చివరికి మృత్యువుతో కూడా పోరాడి, పోరాడి .అలసి సొలసి ఓడిపోయింది తప్పని పరిస్థితులలో... అమ్మా! నిన్ను చూసి నాలుగు నెలలైంది......

--అయ్యగారి జయలక్ష్మిః


Related Novels


Dasara 2025 Vijayawada Durga Devi

Dasara 2023 Vijayawada Annapurna Devi

Dasara 2023 Vijayawada Gayatri Devi

Dasara 2023 Home

More