Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారస్సర్వనాం హయగ్రీవముపాస్మహే
తొమ్మిదవ మండలము ఏడవ అధ్యాయము
మొదటి అనువాకము మొదటి సూక్తము
ఋషి - వైశ్వామిత్ర మధుచ్ఛందుడు, దేవత - సోమము, ఛందస్సు గాయత్రి.
స్వాదిష్ఠయా మాదిష్ఠయా పావస్వసోమధారయా
ఇంద్రాయ పాతవేసుతః
1. సోమమా! అభిషుతమగుము స్వాదిష్ఠమగుము. అత్యంత మదుకర ధారచేక్షరితమగుము. ఇంద్రునకు పాన యోగ్యమగుము.
2. సోమము రాక్షస వినాశకము. విశ్వదర్శనీయము. అది ఇనుముతో నూరబడును. కలశమున చేర్చబడును. తదుపరి అభిషవస్థానమున కూర్చుండును.
3. సోమమా! నీవు విశేష దానములు చేయుము. అన్ని పదార్థములను దానము చేయుము. వృత్రుని వధింపుము. ధనికులగు శత్రువుల ధనము మాకు అందించుము.
4. నీవు గొప్పవు. దేవతల యజ్ఞములకు అన్నసహితముగ వెళ్లుము. అన్నము ప్రసాదించుము.
5. ఇందూ ! మేము నిత్యము నిన్ను సేవింతుము. అదే మా నిత్యకృత్యము.
6. సూర్యపుత్రి శ్రద్ధ. ఆమె నీక్షరణశీల రసమును విస్తరింప చేయును. నిత్యము "దశాపవిత్రము" న పవిత్రము చేయును.
7. అభిషవసమయమున యజ్ఞభగినులవంటి దశాంగుళి రూపములగు స్త్రీలు ఆసోమమును అందరి కన్నా ముందు సేవింతురు.
8. ఈ సోమమును అంగుళులు గ్రహించును. ఈ సోమాత్మక మధువు మూడు స్థానములందు ఉండును. అది శత్రువులకు ప్రతిబంధకమగును.
(ద్రోణకలశము, ఆధవనీయము, పూతభూతము అను మూడు స్థానములు.)
9. సోమము బాలకుడు. గోవులు అవధ్యలు. అవి సోమ బాలుని పాలతో సంస్కరించును. ఇంద్రునకు పానమునకు అందించును.
10. శూరుడగు ఇంద్రుడు ఈ సోమము సేవించును. ఉన్మత్తుడగును. సకల శత్రువులను నాశము చేయును. యజమానులకు ధనము ప్రసాదించును.
రెండవ సూక్తము
ఋషి - కాణ్వమేధాతిధి, దేవత - సోమదేవత, ఛందస్సు - గాయత్రి
1. సోమమా! నీవు దేవకామివగుము. వేగము వహింపుము. పవిత్రభావమున రాలుము. అభీష్ట వర్ధక ఇంద్రా! నీవు సోమము మధ్యమున ఆసీనుడవగుము.
2. సోమమా ! నీవు మహానుడవు. అభీష్టవర్థివి. ఎంతో యశ్వస్వివి. భరించువాడవు. జలములకు ప్రేరణ కలిగించుము. నీ స్థానమున ఉండుము.
3. అభిషుత, అభిలాషదాత సోమము ప్రియ మధువును పిండును. శోభన కర్మసోమము జలమును ఆచ్ఛాదించును.
4. నీవు గవ్యముతో కప్పబడినప్పుడు నీవద్దకు క్షరణ శీలమగు మహాజలము వచ్చిచేరును.
5. సోమమున రసము ఉత్పన్నమగును. సోమము స్వర్గమును వహించును. సోమము లోకములను నిలిపి ఉంచును. మమ్ము అభిలషించును. జలములలో సంస్కరింపబడును.
6. సోముడు అభీష్టప్రదుడు. హరితవర్ధుడు. మిత్రుడు. సమాన దర్శనీయుడు. అతడు శబ్దించును. సూర్యునివలె ప్రదీప్తుడగును.
7. ఇందూ! నీవు స్తుతుల మత్తుకొరకు అలంకృతవగుదువు. కోరికల కొనలుగల స్తుతులు నీ బలపు ప్రతాపమున సంశోధితములగును.
8. నీ ప్రశంసలు మహత్తమములు రాక్షసులను నలిపివేయు యజమానుల కొరకు ఉత్తమ లోకములు సృష్టించినావు. మేము నిన్ను మత్తు కొరకు యాచిస్తాము.
9. ఇందూ !ఇంద్రుని అభిలషించుము. వర్షించు మేఘమువలె మధుధారవై మాముందు రాలుము.
10. ఇందూ! నీవు యజ్ఞపు సనాతన ఆత్మవు. మాకు గోవులు, పుత్రులు, అన్నము, అశ్వములు ప్రసాదించుము.
మూడవ సూక్తము
ఋషి - అజీగర్త శునశ్శేపుడు, దేవత - సోమము, ఛందస్సు - గాయత్రి.
1. ఈ సోమము అమరము. ద్రోణకలశము వద్దకు పక్షివలెసాగును.
2. అంగుళులతో అభిషుతమైన ఈ సోమము క్షరితమై, అభిషుతమై వర్థిల్లును.
3. యజ్ఞాభిలాషి స్తోతలు క్షరణశీలుడగు ఈ సోమదేవుని అశ్వమువలె - యుద్ధము కొరకు అలంకరింతురు.
4. సోముడు క్షరణశీలుడు. వీరుడు. తన బలమున గమనకర్తకు సమముగా ధనములను పంచిపెట్టతలచును.
5. క్షరణశీలుడగు సోమునకు రథము కావలెను. అతడు కోరికలు తీర్చును. పలుకును.
6. విప్రులు ఈ సోమమును స్తుతింతురు. అప్పుడు సోమము హవ్యదాతకు రత్నదానము చేయును. జలముల మధ్య కూర్చుండును.
7. క్షరణశీల సోమము ధ్వని చేయును. సమస్త లోకములను ఓడించును. స్వర్గమునకు చేరును.
8. క్షరణశీల సోమము సుందరుడు. యాజ్ఞికుడు. అహింసితుడు. సమస్తలోకములను ఓడించును. స్వర్గమునకు చేరును.
9. సోమదేవుడు హరిత వర్ణుడు. ప్రాచీనుడు. జన్మతోనే దేవతల కొరకు అభిషుతుడు అయినాడు. దశాపవిత్రమున నిలుచుటకు సాగినాడు.
10. సోమము బహుకర్ముడు. పుట్టుకతోనే అన్నమును పుట్టించినాడు. అభిషుతుడయినాడు. ధారారూపమున క్షరితుడైనాడు.
నాలుగవ సూక్తము
ఋషి - అంగిర హిరణ్యస్తూపుడు, దేవత - సోమము, ఛందస్సు - గాయత్రి.
1. మహదన్న పవమాన సోమా! దేవతలను భజించుము, రాక్షసులను జయించుము. "తదుపరి మాకు శ్రేయములు కలిగించుము." "అథానోవస్య సస్కృధి"
2. సోమా! జ్యోతినిమ్ము. స్వర్గదానము చేయుము. సకల సౌభాగ్యదానము చేయుము. "అథానోవస్య సస్కృధి"
3. సోమా! బలమునిమ్ము. కర్మమునిమ్ము. హింసకులను వధించుము. "అథానోవస్య సస్కృధి"
4. సోమము అభిషవము చేయువారలారా! ఇంద్రుని పానమునకు సోమమును అభిషవించండి. "అథానోవస్య సస్కృధి"
5. సోమా! నీ కార్యములు, రక్షణలతో మాకు సూర్యప్రాప్తి కలిగించుము. "అథానోవస్య సస్కృధి"
6. నీ కార్యములు, రక్షణలతో మేము చిరకాలము, సూర్యుని దర్శించగలము. "అథానోవస్య సస్కృధి"
7. శోభన అన్నవంతసోమా ! స్వర్గమందును, భూమిమీదను వర్థిల్లు ధనమును మాకిమ్ము. "అథానోవస్య సస్కృధి"
8. యుద్ధములందునిన్ను ప్రత్యక్షముగా ఆహ్వానించరు. నీవు శత్రువులను జయింతువు. ధనము దానము చేతువు "అథానోవస్య సస్కృధి"
9. క్షరణశీల సోమా! యజమానులు తమ రక్షణకుగాను నిన్ను యజ్ఞమున వర్తిల్ల చేయుదురు. "అథానోవస్య సస్కృధి"
10. ఇంద్రా! మాకు వివిధ అన్నవంత స్వర్గగామి ధనము నిమ్ము. "అథానోవస్య సస్కృధి"
అయిదవ సూక్తము
ఋషి - కాశ్యప అసిత దేవలుడు, దేవత - సోమము, ఛందస్సు - 1-7
గాయత్రి 8-11 అనుష్టుప్.
1. పవమాన సోముడు చక్కని దీప్తుడు. విశ్వపతి కామవర్ధకుడు. అతడు శబ్దము చేయును. దేవతలను ప్రసన్నులను చేయును. విరాజిల్లును.
2. స్తుత్య, అభీష్టదాత, దీప్తిమంత పవమాన సోముడు మధుధారతో కలసి, తేజోబలమున విరాజిల్లును.
3. పవమాన సోముడు జలములకు పౌత్రుడు. ఉన్నత ప్రదేశమున తీక్ష్ణుడగును. అంతరిక్షమున ప్రదీప్తుడగును సాగును.
4. హరిత వర్ణ సోమదేవుడు యజ్ఞపు పూర్వమున కుశలు పరచుచు తేజోగమనమున పయనించును.
5.హిరణ్మయద్వార దేవేరులు - పవమాన సోమముచే స్తుతులై విశాల దిశలను ఆరోహింతురు.
6. ఇప్పుడు పవమాన సోముడు - సుందర రూపలు, మహిమాన్వితలు, దర్శనీయలగు దివారాత్రులను చూడగోరు చున్నాడు.
7. మానవుల ద్రష్టలు, దేవతల హోతలగు ఉభయ దేవేరులను - రాత్రింబవళ్లును ఆహ్వానిస్తున్నాను. పవమాన్ సోముడు దీప్తుడు. అభీష్టవర్దకుడు.
8. భారతి, సరస్వతి, మహతి ఇళనామక ముగ్గురు సుందర దేవేరుల మా యజ్ఞమునకు విచ్చేయవలెను.
9. అగ్రజాత, ప్రజాపాలక, అగ్రగామి త్వష్టను ఆహ్వానిస్తాను. హరితవర్ణ పవమానసోమ దేవేంద్రుడు కోరికలు తీర్చువాడు - ప్రజాపతి.
10. పవమానసోమా ! హరితవర్ణ హిరణ్యవర్ణ, దీప్తిమంత, సహస్రశాఖాయుత వనస్పతులను నీ మధురధారలతో సంస్కరింపుము.
11. విశ్వదేవగణమా ! వాయు, బృహస్పతి, సూర్య, అగ్ని, ఇంద్రాదులారా ! మీరందరు కలసి - సోమపు స్వాహ శబ్దము వద్దకు విచ్చేయండి.
ఆరవ సూక్తము
ఋషి - కాశ్యప అసిత దేవలుడు, దేవత - పమానసోముడు, ఛందస్సు -గాయత్రి.
1. సోమా! నీవు అభీష్టవర్ధివి. దేవాభిలాషివి. మమ్ము అదుకొను చందువు. రక్షింపుము. దశాపవిత్రమున మధుధారగా పడుము.
2. సోమా! నీవు స్వామివి మదకర సోమము వర్షించుము. బలిష్ఠ అశ్వములను ప్రదానము చేయుము.
3. అభిషితుడవగుము. చేరుము. అన్నము, బలమునకు ప్రేరణ కలిగించుము.
4. నీరు పల్లమునకు సాగును. అట్లే ద్రుతగామి, క్షరణశీలసోమము ఇంద్రుని అనుసరించును. అతనికి వ్యాప్తి కలిగించును.
5. దశాంగుళిరూపలగు స్త్రీలు దశాపవిత్రమును దాటి - అరణ్యమున విహరించు బలిష్ఠ అశ్వమువలె - సోమమును సేవింతురు.
6. సేవించినంత దేవతలకు మత్తు కలుగునట్లు అభిషుత, అభీష్టవర్దక సోమరసమున్ యుద్ధము కొరకు - గవ్యము కలపండి.
7. ఇంద్రుని కొరకు అభిషుత సోమదేవుడు ధారగా క్షరితుడగును. ఎందుకనగా ఇంద్రునకు ఈ రసము ఆహ్లాదకరమగును.
8. అభిషుత సోమము యజ్ఞపు ఆత్మ. అతడు యజమానులకు కోరినది ఇచ్చును. వేగమగు ధారగా రాలుచు తన పురాతన కావ్యమున సహితము రక్షించును.
9. మదకర సోమమా! ఇంద్రుడు నిన్ను కోరినాడు అతని పానము కొరకు క్షరితమగుము. యజ్ఞశాలలో ధ్వనించుము.
ఏడవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమానసోమము, ఛందస్సు - గాయత్రి.
1. సోముడు శోభనశ్రీమంతుడు. ఇంద్రుని సంబంధము తెలిసినవాడు. అతడు కర్మమందును, యజ్ఞమందును ప్రతిష్టించ బడును.
2. సోమము హవ్యములందు స్తుత్యహవ్యము. మహాజలమున నిమజ్జతమగును. ఆ సోమపు ఉత్తమధారలు పడుచుండును.