Home » yerramsetti sai » Nirbhay Nagar Colony


    "షార్టేజ్ భాయ్! ఆర్టీసీవోళ్ళు స్ట్రైక్ చేసినప్పుడూ, రైల్వేవోళ్ళు స్ట్రైక్ చేసినప్పుడూ గవర్నమెంట్ ఎవర్నంటే ఆళ్ళను డ్రైవర్లు జేసి నడిపించడంలే? గప్పుడే గదా యాక్సిడెంట్లయి ప్రయాణం జేసేటోళ్ళందరూ దేవతలయిపోతున్రు! ఇది కూడా గట్లనే"
    "దిసీజ్ టూ మచ్" అన్నాడు రంగారెడ్డి భయంగా.
    "గంతేకాదు ఇన్ స్ట్రుమెంట్ లాండింగ్ ప్రోగ్రాంభీ మంచిగా లేదంట. రాడార్ ఫెసిలిటీ ఎన్నో ఎయిర్ పోర్ట్స్ లో లేవంట. కంట్రోల్ టవర్స్ లో స్టాఫ్ ఎప్పుడూ తక్కువేనంట. దీనికితోడు షార్టేజ్ ఆఫ్ ఇంజనీర్స్! అందుకని విమానాల్లో చిన్నచిన్న సాంకేతిక లోపాలున్నా అలాగే ఎగురుతుంటాయన్నమాట. చాలా ఎయిర్ పోర్ట్సులో 'రన్ వే' మొదలయినట్లు సూచించే ఎప్రోచ్ లైట్స్ కూడా పనిచేయడం లేదంట- కారణ ఏమిటంటే వాటిల్లోని బల్బులు ఎక్కువగా దొంగిలింపబడుతున్నాయి గనుక మాట్లాడితే కొత్త బల్బులు వేయడం కుదరదంటున్నారు"
    అప్పటికే రంగారెడ్డి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది మాకు.
    ఎందుకయినా మంచిదని యాదగిరి దగ్గర్నుంచీ పేపర్ లాక్కుని చింపి అవతల పారేశాం.
    "ఆ! ఇవన్నీ మామూలేలే- మన దేశంలో ఏ ఫీల్డ్ తీసుకున్నా ఇలాగే అవకతవక లుంటాయి మరి! ఈ మాత్రానికే బెదిరిపోతే ఎలా?"
    "అందాకా ఎందుకు? మనదృష్టం బాగుండాలేగానీ లేకపోతే మన గవర్నమెంట్ పరిపాలనకు ఇంట్లోనే చావమా ఏమిటి? గవర్నమెంట్ కట్టిన హౌసింగ్ బోర్డ్ ఇళ్ళు కూలిపోతే అందులో వున్నాళ్ళు తప్పించుకోగలరా? ఫ్యాక్టరీల తాలూకూ పొల్యూషన్ ఆ చుట్టుపక్కల వున్న నీళ్ళల్లో కొచ్చి ఆ నీళ్ళు తాగినవాళ్ళు చావకుండా తప్పించుకోగలరా? కల్తీ ఆహారం సరేసరి! స్లోపాయిజనింగే కదా! గూండాలు సరదాగా కత్తులు తీసుకుని రోడ్ మీద వెళ్ళేవారిని పొడిచి నవ్వుకోవడం, పోలీసులు లాకప్ లో ఎదురుతిరిగినవాళ్ళను చట్నీ చేసెయ్యడం- వీటికంటే విమాన ప్రయాణం ప్రమాదకరమైనదా ఏంటి?" రెడ్డికి ధైర్యం చెపుతూ అన్నాడు శాయిరామ్.
    "అవునవును! మనకేం భయం లేదులే" అన్నాడు రెడ్డి ధైర్యం తెచ్చుకుంటూ. అదీగాక మనవి అంత తేలిగ్గాపోయే ప్రాణాలయితే మన రాష్ట్ర రాజధానిలో వుంటూ కూడా ఇంతకాలం బ్రతికి ఉండేవాళ్ళమా?"
    అందరం ఇళ్ళకు చేరుకున్నాం.
    ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకున్నాం. ఎంట్రెన్స్ టికెట్ తీసుకుని లోపలకు వెళ్ళాం.
    అప్పటికే బాంబే, ఢిల్లీఫ్లైట్స్ కోసం జనం నిండిపోయి వున్నారు.
    భారత్ బ్రాందీ కంపెనీ తరపు సేల్స్ ఆఫీసర్ రంగారెడ్డిని కల్సుకున్నాడు.
    "మీకిచ్చిన టికెట్ ఆ కౌంటర్ లో చూపించి కన్ ఫరమ్ చేసుకోండి" చెప్పాడతను.
    వెళ్ళి క్యూలో నిలబడ్డాడు రంగారెడ్డి. కాసేపటి తరువాత బోర్డింగ్ టికెట్ తీసుకుని మా దగ్గరకొచ్చాడు మళ్ళీ.
    వేరే నగరాలకు వెళ్ళే ప్రయాణీకులు సెక్యూరిటీ చెక్ కోసం క్యూలో నిలబడ్డారు.
    హఠాత్తుగా ఎనౌన్స్ మెంట్ వినిపించింది.
    ఢిల్లీ నుంచి మద్రాస్ వెళ్ళే బోయింగ్ అప్పుడే లాండ్ అయిందని...
    రంగారెడ్డి మొఖంలో కొంచెం భయం కనబడుతూనే వుంది.
    గంటయినా సెక్యూరిటీ చెక్ కి ఎనౌన్స్ మెంట్ రాకపోయేసరికి ప్రయాణికులందరూ ఎంక్వయిరీ కౌంటర్ దగ్గర గుమికూడారు.
    "మరేం లేదండీ! ఒకసైడ్ రెక్క కొంచెం లూజ్ అయిందట... అందుకని ఆలస్యం అవుతోంది" అందామె.
    మా గుండెల్లో రాయిపడినట్లయింది.
    సరిగ్గా అప్పుడే ఎనౌన్స్ మెంట్ వినిపించింది.
    "ప్రయాణీకుల్లోగానీ, వారికి సెండాఫ్ ఇవ్వడానికి వచ్చినవారిలో గానీ వెల్డింగ్ తెలిసిన వెల్డర్స్ ఎవరయినావుంటే వెంటనే ఎయిర్ పోర్ట్ మేనేజర్ని కలుసు కోవలసిందిగా కోరుతున్నాం!"
    రంగారెడ్డి మొఖం పాలిపోయింది.
    ఈలోగా ఓ పైలట్ హడావుడిగా మరో ఎయిర్ పోర్టు అధికారి దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు.
    "బాక్ ట్యూబ్ పంచరయినట్లుంది సార్... గాలి తగ్గిపోయింది. ఆ రోడ్ మీద పంక్చర్స్ వేసే కుర్రాడిని పిలిపించండి! అర్జెంట్" చెప్పాడతను.
    వెంటనే ఆ కుర్రాడిని తీసుకురావడానికి ఎయిర్ లైన్స్ కారు దూసుకెళ్ళిపోయింది బయటకు.
    "మా కో- పైలట్ పని చేయనంటున్నాడు! ఇక్కడింకెవరయినా దొరుకుతారేమో చూడండి."
    "అదేమిటి? ఎందుకు పనిచేయడు?"
    "అతను ఇప్పటికే షార్టేజ్ వల్ల రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు."
    "కానీ ఇంత సడెన్ గా ఇక్కడ కో- పైలట్ ఎవరు దొరుకుతారు?"
    "ఎవరోకరిని చూడండి! మద్రాస్ కి గంట ప్రయాణమేగా! నేనే ఎలాగోలా మానేజ్ చేసుకుంటాను! నా పక్కన కూర్చుని నేను నొక్కమన్న మీటలునొక్కి, రివర్స్ గేర్ లాగగలుగుతే చాలు."
    ఎయిర్ పోర్ట్ అధికారి ఓ క్షణం ఆలోచించాడు.
    "మా బామ్మర్ధిని తీసుకెళ్ళండి! వాడికి పాపం చిన్నప్పటినుంచీ విమానం పైలట్ అవ్వాలని కోరిక! అదృష్టం బావుండక ఫైరింజన్ డ్రైవరయాడు గానీ లేకపోతే..."
    పైలట్ ఓ క్షణం ఆలోచించాడు.
    "అతనికి విమానాల గురించి ఏమయినా తెలుసా?"
    "తెలీటమా? మొత్తం ఎనిమిది రకాల విమానాల బొమ్మలున్నాయి వాళ్ళింటి అల్మారాలో! ఒకోటీ ఆరొందలు పెట్టి కొన్నాడు. అవి చెడిపోతే వాడే రిపేర్ చేసుకుంటాడు"
    "ఆమాత్రం వస్తే ఇంకేం కావాలి? మా కో-పైలట్ కంటే నయం కదా? వాళ్ళింట్లో నాలుగే బొమ్మలున్నాయట!"
    వాళ్ళు మాట్లాడుతుండగానే ఇంకో అధికారి పరుగుతో వచ్చాడు.
    "సార్ విమానం ఫ్లోరింగ్ సింక్ అవుతోందిట! ఎలా ఇప్పుడు!"
    "మనమేం చేయగలం? ఇంజనీర్లు షార్టేజ్ కదా! ఎలాగోలా మద్రాస్ దాకా వెళ్ళేలా చూడమని మన కార్పెంటర్ తో చెప్పు"
    "కార్పెంటర్ చూసి అయిదారుచోట్ల చెక్కముక్కలు వేసి మేకులు కొట్టాడుసార్! అయినాగానీ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళకాళ్ళు కిందకు వేలాడుతున్నాయ్"
    "గంటసేపు జర్నీయే కదయ్యా! కాళ్ళు సీట్లో పెట్టుకుని కూర్చోమను"
    అతను వెళ్ళగానే ఇంకోవ్యక్తి వచ్చాడు.
    "సార్! బోయింగ్ లో కాఫీ ఫలహారాలు అన్నీ అవుటాఫ్ స్టాక్. ఏం చేయమంటారు?
    "మన కాంటీన్ నుంచి సప్లయ్ చేయండయ్యా"
    "మన దగ్గర కూడా లేవు సార్! నిన్న పండగ కదా! కంట్రాక్టర్ రాలేదు."
    "అయితే బయట రోడ్ పక్కన ఒకడు పొయ్యి, కళాయి పెట్టుకుని బజ్జీలు చేస్తున్నాడు చూడు. వాడి దగ్గర వున్నవన్నీ కొనేసి సప్లయ్ చేయండి."
    "సార్" కౌంటర్ దగ్గర్నుంచి ఒకామె పిలిచింది. "మీకు ఫోన్! కంట్రోల్ టవర్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పిలుస్తున్నాడు"
    అతను పరుగుతో వెళ్ళి ఫోన్ అందుకున్నాడు.
    "సార్ మా ఆవిడా, పిల్లలూ రైల్లో అమెరికా వెళుతున్నారు. స్టేషన్ కెళ్ళి సెండాఫ్ ఇచ్చి వస్తాను. అంతవరకూ నా బదులు మా ఆఫీస్ స్వీపర్ నా డ్యూటీ చేస్తాడు. మీ ఫర్మిషన్ అడుగుదామని"


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More