తమిళనాడులోని తిరువన్నామలైలో ఒకరోజు  భగవాన్ రమణ మహర్షిని కలిసి ఒక విదేశీయుడు స్వభావం అంటే ఏమిటి  అంటూ పదే పదే ప్రశ్నించారు. ఆ భక్తుడి నుంచి మరో మాట లేదు.  అప్పుడు భగవాన్ ఇలా అన్నారు.....

"ఒక వ్యక్తి తన స్వభావం ఏమిటో తెలుసుకుంటే ఈ ప్రశ్న రాదు. అది తెలుసుకోనంత వరకు స్వభావం గురించి వేసిన ప్రశ్న వేయకుండా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. అస్వభావికమైనవన్నీ స్వభావమనుకుని భ్రమపడతాం. ఈ భ్రమ మనిషికి కప్పిన తెర తొలిగిపోయే వరకు స్వభావం అంటే ఏమిటో బోధపడదు. నిజానికి స్వభావం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అది లేకుండా పోవడమనేది ఉండదు. కానీ లేని దాని కోసం ఎలా వెతుకుతామో అలాగే మనలోనే ఉన్న స్వభావం కోసం ఇంకెక్కడో వెతుకుతుంటాం. అలా వెతికే క్రమంలో లేని పోనీ సమస్యలు తలెత్తుతాయి. ఆత్మ ఎప్పుడూ స్వాభావికమే అయి ఉంటుంది"

భగవాన్ ఇలా చెప్పడంతోనే ఆ భక్తుడు మరైతే ఆత్మ ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు.  అంతట  భగవాన్ సమాధానమిస్తూ "ఆత్మ ఎక్కడో ఉందని అది ఉన్న చోటును విడిచిపెట్టి వెతుకులాటలో పడటం వృధా ప్రయాస" అన్నారు.  ఆత్మ చుట్టూ తిరుగుతూ తీర జ్ఞాన దృష్టి వెలుగులోకి వచ్చేసరికి అదే ఆత్మ అదే నేను అంటాం. జ్ఞాన దృష్టి కలిగిన వారికి అంతా స్వాభావికంగా సహజంగా అనిపిస్తుంది. అలా కాదని స్వభావాన్ని విడిచిపెడితే ఏముంటుంది? మనసు అనేది అదుపులో ఉంటే జగమంతా గుప్పెట్లో ఉన్నట్టే అవుతుంది. దేనికైనా మనసే కారణం. అది హద్దులో ఉంటే స్వభావస్థితి తానంతట అదే తెలిసొస్తుంది. కానీ అలా చెయ్యం. మనసుని ఎటు పడితే అటు కదలనిస్తాం. అప్పుడు స్వభావస్థితి ఎలా విదితమవుతుంది. ఈ లోకం బ్రహ్మమయంగా చూడగలగాలంటే జ్ఞాన దృష్టి అవసరం. చిదాకాశం ఆత్మ స్వరూపం. మనసు అదుపులో ఉండటం అంటే నానాకార దృష్టి పోయి ఎకాకార దృష్టి కలగడం అన్న మాట. అది అవగతమైనప్పుడు అంతా స్వాభావికమే అవుతుందని భగవాన్ మాట.

- యామిజాల జగదీశ్


More Good Word Of The Day