మానవ జన్మ... జ్ఞానం... మోక్షం.....

 



మనిషి జన్మ లభించింది. సరేగానీ ఈ జన్మ దేనికోసం లభించింది? దీని వల్ల ఏం ప్రయోజనం? అని ఆలోచించే వారు ఎందరు? మనిషి జన్మ అనేది దేవుడికి చేరువ కావడానికి ఒక అవకాశం దొరికింది అనుకోవాలి. భక్తి మార్గంలో ఉంది వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మానవ జన్మ తప్పించి మరో జన్మలో లేదు. అయినా పూర్వ జన్మ పుణ్య ఫలం తో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు పురాణ గ్రంధాలు తిరగేస్తే తెలుస్తుంది.  కానీ మనిషిగా పుట్టిన వారందరూ భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని ఏ మేరకు ఉపయోగించుకుంటున్నారు?  మనిషి పుట్టినప్పటి నుంచి తానూ చెయ్యవలసిన మంచిపనులు చెయ్యక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవలసిందే. ఇందులో మరో దారి లేదు. ఒక్కో దశలో ఎన్ని పనులు చెయ్యాలో విడిగా చెప్పక్కర్లేదు. అయితే ఎన్ని పనులు చేసినా చివరికి అప్పటి వరకు వెన్నంటే వచ్చునా బంధపాశాలను విడిచిపెట్టి భగవత్ ధ్యానంలో లీనమైపోవాలి.

ఒక చెట్టు విషయానికి వద్దాం.

ఒక చెట్టున మొగ్గ వచ్చింది. అది పువ్వైంది. ఆ తర్వాత కాయ అయ్యింది. అనంతరం అది పండు అయ్యింది. కొంతకాలానికి అది నేల రాలుతుంది. అయితే ఇక్కడో విషయం గమనించాలి. పిందేగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటునుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోను నీటి తడి చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలోను నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది.  కనుక అక్కడ నీటి తడిని చూడవచ్చు.

అలాగే కాయ మొదలులోను ఆ నీటి తడి ఉంటుంది. అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేసారు కదా అని కాయ కూడా బాధపడుతుంది.  కానీ ఒండు విషయంలో అలా కాదు....కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మనా నీటి తడి కనిపించాడు. పండు మొదలు లోను నీటి తడి ఉండదు. రెండింటిలోను ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపొయింది కనుకే పండు రాలిపోయినట్టు  చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాద అనేది ఉండదు.  అలాగే మనిషి జీవితం కూడా....సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి అర్ధంతరంగా పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాదే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే.... రెండువైపులా ఆందోళన, ఆవేదనా ఉంటాయి....అయితే ఆ వ్యక్తే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి క్రమంగా బంధపాశాలను త్యజిస్తూ నెమ్మది నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు.  జ్ఞానమనేది ఏదో ఒకే రోజులో వచ్చేది కాదు. నెమ్మది నెమ్మదిగా రావాలి...అలాగే అలవడుతుంది కూడా. అంతేతప్ప తాను జ్ఞాని అని ముందే చెప్పుకుంటే దానిని కదా దాకా కొనసాగించగలదా అనేది ప్రశ్నార్ధకమే. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేసి దైవ మార్గంలో అడుగులు సారించాలి. అప్పుడు తప్పకుండా మనమనుకున్నది నెరవేరుతుంది. అందులో అనుమానం అక్కరలేదు.

- యామిజాల జగదీశ్


More Enduku-Emiti