భీముడు నిర్మించిన సరస్సు – భీమ్‌తల్‌

 


అది ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌ జిల్లా. ఒక పక్క హిమాలయ పర్వతాలు, మరోపక్క అందమైన సరస్సులు నైనితాల్‌ సొంతం. అలాంటి నైనితాల్‌ను అల్లుకుని ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు నైనితాల్‌ అన్న పేరే ‘నయనా తల్‌’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. దక్షయజ్ఞం తరువాత అమ్మవారి కళ్లు (నయనాలు) ఇక్కడ పడ్డాయట. ఆ ప్రదేశంలో ఏర్పడిన సరస్సుని ‘నయనా తల్‌’ పేరు మీదుగా ఈ ఊరు స్థిరపడింది. ఆ నయనా తల్‌ పక్కనే ఉన్న నయనా దేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతారు.

 

ఇక నైనితాల్‌కు ఓ 20 కిలోమీటర్ల దూరంలో ‘భీమ తల్‌’ అనే మరో సరస్సు ఉంది. పదిహేడు కిలోమీటర్ల భారీ వైశాల్యం ఈ సరస్సు సొంతం. ప్రజల దాహాన్ని తీర్చేందుకు, పంటలను సాగు చేసేందుకు, చేపలను పెంచేందుకూ... ఈ సరస్సు అనువైంది కాబట్టి దీని చుట్టూ ఏకంగా ఒక గ్రామమే ఏర్పడింది. ఈ భీమతల్ వెనక ఉన్న కథ కూడా ఆసక్తికరమైనదే!

 


పాండవులు అరణ్యవాసం చేసే సందర్భంలో వారు ఈ ప్రాంతానికి చేరుకున్నారట. ఆ సమయంలో భీమునికి హిడింబాసురుడు అనే రాక్షసుడు ఎదురుపడ్డాడు. భీమునికీ అపరబలవంతుడైన ఆ రాక్షసునికీ మధ్య ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరులో ఎట్టకేళకు భీముడు గెలిచాడు. కానీ సుదీర్ఘంగా సాగిన యుద్ధంలో అలసిపోయాడు. ఆ అలసటను తీర్చుకునేందుకు భీముడికి చుక్క నీరు కూడా కనిపించలేదు. దాంతో ఉద్రేకంతో తన గదను ఒక్కసారిగా నేల మీద మోదాడట! అలా భీముని గద తాకిడికి ‘భీమ్‌ తల్‌’ సరస్సు ఏర్పడిందని చెబుతారు. అంతేకాదు! ఆ సరస్సు ఒడ్డున భీముడు ఓ శివాలయాన్ని కూడా నిర్మించాడని చెబుతారు. అందుకనే ఆ ఆలయంలోని దైవాన్ని ‘భీమేశ్వర మహాదేవుని’గా పూజించుకుంటారు.

 


భీమ్‌తల్‌ సరస్సు మాత్రమ కాదు... ఆ సరస్సు చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలని అల్లుకుని అనేక స్థలపురాణాలు వినిపిస్తాయి. భీమ్‌తల్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ‘నలదమయంతి’ సరస్సు కనిపిస్తుంది. ఈ సరస్సులోనే నలుడు మునిగిపోయాడని చెబుతారు. ఇక హిడింబాసురుడు నివసించిన ప్రదేశం ఇదే అని నిరూపించేలా... హిడిండ పర్వతం అనే కొండ కూడా ఇక్కడికి దగ్గరలోనే కనిపిస్తుంది. మన పురాణాలలో తరచూ వినిపించే కర్కోటక అనే పాము పేరు మీదుగా మరో పర్వతం కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఈ పర్వతం మీద నిర్మించిన ఆలయంలో ‘కర్కోటక మహరాజ్’ పేరుతో ఆ నాగదేవత పూజలందుకుంటూ ఉంటాడు. ఇన్ని పౌరాణిక విశేషాలకు తోడు ప్రకృతి ఒడిని తలపించే భీమ్‌తల్‌ను దర్శించుకునేందుకు ప్రయాణికులు వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఇక్కడకి చేరుకుంటారు.

 

 

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories