కాశీ యాత్ర – 6

కొన్ని జాగ్రత్తలు

 


                                                                               
కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు.  అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం.  అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలుట..ఎంతో పుణ్యం వస్తుందట.

 

అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తపించి, వెళ్ళాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడూ, విశాలాక్షే కనిపిస్తారు.  కానీ అంత తాదాత్మ్యం చెందలేనివారికి  ఇరుకు సందులు, అడుగడుగునా అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్లమీద కనిపించే పశువులూ, అడుగు బయటపెడితేచాలు  అడ్డంపడే బట్టల షాపులవాళ్ళూ…ఓహ్..ఇదా విశ్వేశ్వరుడి నివాసం అనిపిస్తుంది.


అవ్వన్నీ పక్కనపెట్టి నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని,   విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తల్చుకోండి.  మీ మనసు భక్తి భావంతో నిండుతుంది.  మనసునిండా వున్న ఆ భక్తి భావంతో కాశీని చూడండి.  పురాణ ప్రాశస్త్యంపొందిన కాశీనగరం కనిపిస్తుంది.  జనసమ్మర్దం, ఇరుకు సందులవలన ఆయాసం, ఎలర్జీలతో బాధపడేవారు తగు జాగ్రత్తలతో వెళ్ళండి.  ఆహారం, నీరు విషయాలలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి.

 

సత్య హరిశ్చంద్రుడు తన సత్య వాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది.  బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే.  ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు  ఇక్కడ విద్యాభ్యాసం చేశారు.  మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు.  ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు.   


ఈ ప్రఖ్యాత పట్టణంమీదు తురుష్కులు అనేకసార్లు దండయాత్రచేసి ఇక్కడి సిరిసంపదలను కొల్లగొట్టారు.  ఈ దాడులతో విశ్వనాధ మందిరంతోసహా అనేక విగ్రహాలు, లింగాలు స్ధానభ్రంశంచెందాయి.  ఆ దాడులలోనే విశ్వనాధుని లింగాన్నికూడా తీసి వెనక వున్న వాతాపి బావిలో పడేశారని, ఈ లింగాన్ని తర్వాత ప్రతిష్టించారనీ అంటారు.  ప్రస్తుతం వున్న మందిరం క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది.   ఆక్రమణలకు గురిఅయినతర్వాత ప్రస్తుతంవున్న మందిరం చిన్నదే.  ఆలయంలోపలకూడా ఇరుగ్గానే వుంటుంది. కాశీలో విశాల ఆలయాలు, శిల్పకళ కనబడదు.

 

విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు. వాటిని లోపలకి తీసుకెళ్ళనివ్వరు.  వాటికి లాకర్లు వుంటాయిగానీ వాటిలో పెట్టటం రిస్కుతో కూడుకున్న పని అంటారు చాలామంది.

విశ్వనాధాలయంతో సహా, శివాలయాలలో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ, అభిషేకం చేసుకోవచ్చు.  విశ్వనాధాలయానికి వెళ్ళినప్పుడల్లా అభిషేక ద్రవ్యాలు తీసుకు వెళ్ళండి.  గంగా స్నానం చేసి వెళ్తుంటే గంగ నీరు తీసుకువెళ్ళండి.  మీరే స్వయంగా స్వామికి అర్పించవచ్చు.  అమ్మవార్ల ఆలయాలలోమాత్రం పూజారులే చేస్తారు.  అమ్మవార్ల ఆలయాలలో శ్రీచక్రానికి కుంకుమపూజ మనం చేసుకోవచ్చు.

మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట.  అంతేకాదు.  కాశీలో చేసిన మంచికానీ, చెడుకానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట.  అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చెయ్యండి.  దాన ధర్మాల కోసం తగినంత చిల్లర నాణాలు, నోట్లు, తీసుకు వెళ్ళండి.  గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కరలేదుకదా.  అలాగే పితృకార్యాలు చెయ్యదల్చుకున్నవారు వాటిని చెయ్యండి.  మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి.  అన్నింటికన్నా ముందు భక్తి భావంతో ఒక పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తున్నామనే సద్భావంతో వెళ్ళండికానీ జాలీ ట్రిప్ గా వెళ్ళవద్దు.

 

 

- పి.యస్.యమ్. లక్ష్మి 
(
తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Kashi Yatra