వరలక్ష్మి వత్రానికి కావల్సిన సామాగ్రి

 

 

శ్రావణమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం. కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం. అందుకే.... కోరిన వరాలు అందించే అ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ.. ఆ రోజు కుదరకపోతే, శ్రావణమాసంలోని ఇతర శుక్రవారాలనాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావల్సిన పూజాసామాగ్రి, వాటి అవసరం ఏమిటో తెలుసుకుందామా!

పూజ చేయడానికి సిద్ధం చేసుకోవాల్సిన సామాగ్రి....

- వరలక్ష్మి అమ్మవారి పటం. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలంటారు. ఆకుచపచ్చని చీరతో, వెనకాల కలశంతో, అటూఇటూ ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం.

- రాగి లేదా వెండి కలశం. కలశపూజ కోసం.

- రెండు కొబ్బరికాయలు. ఒకటి కలశం మీద ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు.

- రెండు జాకెటు ముక్కలు. ఒకటి కలశం పైన ఉంచేందుకు, మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయినంగా ఇచ్చేందుకు. ముత్తయిదువులకు కూడా జాకెట్టు ముక్కలని వాయినంగా ఇవ్వాలనుకునేవారు, తమ శక్తికొలది జాకెట్లు ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి.

- రెండు పీటలు. ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు. రెండోది కలశాన్ని స్థాపించేందుకు. ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులను కూడా ఉపయోగించవచ్చు.

- అరకిలో బియ్యం. ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి... దాని మీద కలశాన్ని నిలపాలి.

- అరకిలో శనగలు. అమ్మవారికీ, ముత్తయిదువులకూ పంచేందుకు. వీటిని ముందురోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి.
- యాలుకలు, మిరియాలు. అమ్మవారికి పానకం అంటే ఇష్టమని చెబుతారు. కాబట్టి యాలుకలు, మిరియాలు వేసిన పానకం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది.

- పెసరపప్పు. అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే! ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా... ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు.

- విడిపూలు. అమ్మవారిని అయిదురకాల పూలతో అర్చిస్తే మంచిదని చెబుతారు.. ఐదురకాలు కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి.

- రెండు పూలమాలలు. అమ్మవారి కలశానికీ, చిత్రపటానికీ వేసేందుకు. ఇవి తెలుపు లేదా ఎరుపురంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది.

- ముగ్గువేయడానికి కాస్త బియ్యపు పిండి.

- అమ్మవారి కలశానికి, పీటకు అద్దేందుకు... అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపుకుంకుమలు.

- రెండు డజన్ల గాజులు. అమ్మవారికి, ముత్తయిదువులకు వాయినం ఇవ్వడానికి.

- చీర. అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర. ఇది ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. నలుపుని తలపించే ముదురు రంగులు శుభప్రదం కావు!

- గంధము. అమ్మవారి పటానికి, ముత్తయిదువులకు పూసేందుకు.

- మూడు డజన్ల తమలపాకులు. అమ్మవారికీ, కలశానికీ, ముత్తయిదువులకూ మూడేసి తమలపాకుల చొప్పున దక్షిణ అందించేందుకు.

- రెండు డజన్ల చొప్పున అరటిపళ్లు, ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణేలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు. ఇవన్నీ తమలపాకులలో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావల్సినవి.

- మామిడి ఆకులు. ఇంటికి తోరణాలుగా కట్టేందుకు. పూజాగదిని అలంకరించేందుకు. కలశంలో ఉంచేందుకు కావల్సినన్ని మామిడి ఆకులను అందుబాటులో ఉంచుకోవాలి.

- పంచామృతం చేయడం కోసం.... ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార.

- అమ్మవారికి నివేదించేందుకు మన శక్తికొలదీ పిండివంటలు.

- తోరపూజ సమయంలో అమ్మవారికీ, మనకి, కనీసం ముగ్గురు ముత్తయిదువులకు కట్టేందుకు ఐదు దారపు పోగులు.

ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందు అందుబాటులో ఉంచుకోవాలి...

- అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందులు.

- దీపారాధన చేయడానికి వత్తులు. అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి పత్తి వత్తులతో పాటుగా తామర వత్తులని కూడా కలిపి వెలిగిస్తే మంచిది.

- ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దరణి. చిన్న పళ్లెం.

- హారతి ఇవ్వడానికి హారతిపళ్లెం, ముద్దకర్పూరం.

- నివేదన చేసే సమయంలో మోగించేందుకు గంట.

ఇక వీటితో పాటుగా అక్షతలు, అగరవొత్తులు, దీపారాధన నూనె, అగ్గిపెట్టె ఎలాగూ తప్పనిసరిగా మనవద్దనే ఉంటాయి కదా!


More Sravana Masam - Varalakshmi Vratam