వామన జయంతి

భాద్రపద శుక్లపక్షంలో శ్రవణానక్షత్రయుక్తమైన ద్వాదశినాడు వామన జయంతి జరుపుకొంటారు. వామనావతారం శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. మానవావతారాల్లో మొదటిది. మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలచుకోవడానికి ఎన్నో సందేశాలు ఇస్తుంది వామనావతారం.

కశ్యపుడి భార్య అదితి దేవతలకు తల్లి. రాక్షసులు తన పుత్రులను తరచూ హింసిస్తుంటే భరించలేక శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించింది. స్వామి ‘తగిన సమయంలో నీకు బిడ్డగా జన్మించి నీ బాధలు పోగొడతాను’ అని ఓదార్చి అంతర్థానమవుతాడు. కొంతకాలానికి అదితి బ్రహ్మతేజోమయుడైన ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయిదేళ్ల వయస్సు వచ్చేసరికి ఆ బాలుడు అఖండమేధావిగా ప్రకాశించడం గమనించిన తండ్రి కశ్యపుడు గాయత్రీ మంత్రోపదేశం చేసి సకల శాస్త్రాలూ నేర్పాడు. వయసు పెరిగినా శరీరం అలాగే ఉండటంతో అతడికి వామనుడనే పేరు స్థిరపడింది.

రాక్షసరాజు బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు. స్వర్గంమీద దాడిచేసి, ఇంద్రుణ్ని ఓడించి అమరావతిని ఆక్రమించుకున్నాడు. ఓసారి నర్మదా నదీతీరాన గల ‘భృగుకచ్ఛ’ అనే రమణీయ ప్రదేశానికి వెళ్లి అశ్వమేధయాగం చేశాడు. కపటబుద్ధిగల రాక్షస గురువు శుక్రాచార్యుడు ఆ యాగానికి ప్రధాన సంచాలకుడు. బ్రాహ్మణులకు, పేదలకు ఎవరేది అడిగినా భూరిదానాలు చేశాడు బలి. బ్రహ్మతేజస్సుతో వెలిగే వటుడైన వామనుడు దండం, కమండలం, గొడుగు తీసుకుని యజ్ఞప్రాంగణానికి వెళ్ళాడు. ప్రసన్నవదనంతో బలిని ఆశీర్వదించి, అతడి వంశకీర్తిని శ్లాఘించాడు. వామనుడి వాక్చమత్కృతికి పరమానందభరితుడైన బలి- నా సర్వసంపదలను, రాజ్యాన్ని ఇస్తాను కోరుకొమ్మన్నాడు. బలి ఆ వటువును కూర్చోబెట్టి పాద ప్రక్షాళన, అర్ఘ్య పూజ చేసి, పంచామృతాలు సమర్పించాడు.

ఎంతో సంతోషంతో పొంగిపోతున్న బలిని చూసి వామనుడు ‘కేవలం నా పాదాలచే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రమే నిన్ను అడుగుతున్నాను’ అన్నాడు. ‘నేను త్రిలోకాధిపతిని. మీ కోరిక నాకు తగినట్లు గొప్పదిగా ఉండాలి’ అన్నాడు బలి. అది విని వామనుడు- ‘నేను బ్రహ్మచారిని. నీ సంపద నేనేం చేసుకుంటాను. నా ఇంద్రియాలు నా వశంలోనే ఉన్నాయి. మూడడుగుల భూమినిస్తే చాలు’ అన్నాడు ఎంతో లౌక్యంగా. వామనుడి ఆంతర్యం గ్రహించాడు శుక్రుడు. ‘వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు... నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను పాతాళానికి తొక్కివేయాలని వచ్చాడు. అతడి కోరికను అంగీకరించొద్దు’ అని ఎంతగా హెచ్చరించినా బలి వినలేదు. చివరి ప్రయత్నంగా శుక్రాచార్యుడు తన శిష్యుణ్ని కాపాడే ఉద్దేశంతో ఒక పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబుకొమ్ముకు అడ్డం పడ్డాడు. అది గమనించిన బలి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దానితో శుక్రాచార్యుడి కన్నుపోయింది. బయటికి వచ్చేశాడు శుక్రుడు. బలి ఉదకం విడిచి దానం పూర్తిచేశాడు.

క్రోధితుడైన గురువు బలిని ‘నీ సంపదలన్నీ  నశించు గాక’ అని శపించాడు. వామనుడు అకస్మాత్తుగా ఊర్ధ్వముఖంగా ఎదిగాడు. ఒక అడుగుతో భూమిని, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి- ‘మూడో అడుగు ఎక్కడ పెట్టాలి?’ అని అడిగాడు బలిని. బలి తన తలను చూపించాడు. వామనుడు మూడో పాదాన్ని బలి తలమీదపెట్టి పాతాళంలోకి తొక్కివేశాడు. బలినుంచి స్వీకరించిన భూమిని, స్వర్గాన్ని ఇంద్రుడికిచ్చాడు. బలి గొప్ప విష్ణుభక్తుడు కావడంతో వామనుడు బలిభవనానికి ద్వారపాలకుడిగా ఉన్నట్లు పురాణ కథనం. సాపర్ణిమనువు కాలంలో బలి దేవేంద్రుడవుతాడని విష్ణువు వరం ఇచ్చాడు. వామనద్వాదశిని విజయద్వాదశి, శక్రద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి అనీ పిలుస్తారు.


More Festivals