ఉగాది పచ్చడి తినాల్సిందేనా!

ఉగాదినాడు ‘నింబకుసుమ భక్షణం’ చేయాలంటారు పెద్దలు. నింబకుసుమం అంటే వేపపూతే! ఆయుర్వేదంలో వేపకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. శరీరంలో ఎలాంటి రోగాన్నయినా ఎదుర్కోగల అద్భుత ఔషధంగా వేపను పేర్కొటారు. ఈ వేపలోని అణువణువునీ కూడా ఔషధంగా భావించి చికిత్సలో వాడతారు. అయితే వేపపువ్వు లభించేది మాత్రం ఉగాది సందర్భంలోనే. ఆ సందర్భాన్ని వినియోగించుకునేందుకే వేపపూతని ఉగాది పచ్చడిలో చేర్చి ఉంటారు పెద్దలు.

 

అంతేకాదు! ఉగాది సమయానికి వాతావరణంలో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. ఇది ఆటలమ్మ, మశూచి వంటి అంటురోగాలకు కారణం అవుతుంది. వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధులకి ఎలాంటి మందూ ఉండదు. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధులు దరిచేరవు. వేపపూతతో కూడిన ఉగాది పచ్చడి ఆ రోగనిరోధక శక్తిని అందిస్తుంది. దీనిని ఖాళీ కడుపున తింటే అమిత ప్రభావం ఉంటుంది కాబట్టి, ఉగాది పండుగనాడు వేప పచ్చడి తినకుండా మరే ఆహారాన్నీ తినవద్దని చెబుతారు.

 

ఇప్పుడంటే ఉగాది పచ్చడిని కేవలం పండుగ రోజునే తింటున్నాము. కానీ ఒకప్పుడు ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు సాగే నవరాత్రులలోనూ ఉగాది పచ్చడిని తినేవారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు అలా సన్నద్ధమయ్యేవారు. పైగా వేపాకుని తినడం వల్ల ఒకోసారి పైత్యం ఏర్పడవచ్చు. కానీ వేపపూతగా అలాంటి ఇబ్బంది ఉండదు సరికదా... పిల్లలకు కూడా సులభంగా జీర్ణమవుతుంది.

 

ఉగాది పచ్చడిలో వేపపువ్వు మాత్రమే కాదు... మామిడి చిగుళ్లు, అశోక చిగుళ్లు కూడా వేసుకోవాలని పెద్దలు చెబుతారు. రాన్రానూ ఈ ఆచారం కనుమరుగైపోయి కేవలం వేపచిగురుని మాత్రమే వాడుతున్నాము. ఆ వేపచిగురుతో పాటుగా కొత్త బెల్లం, కొత్త చింతపండు, చెరుకుగడలు, ఉప్పు, కారం కూడా వాడతాము. ఈ పదార్థాలన్నింటికీ కూడా ఆరోగ్యంపరంగా అనేక కారణాలు కనిపిస్తాయి. ఇక ధార్మికంగా చూస్తే షడ్రుచులుతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సూచన కనిపిస్తుంది.

- నిర్జర.

 


More Ugadi