ఉగాది అందరిదీ

 

 

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనమందరం జరుపుకునే పండగ ఉగాది. ఉదయం లేవగానే స్నానం-పానం ముగించుకుని భక్తితో దేముడికి పూజ చేసి తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం అనే షడ్రుచులతో కలసిన ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి, దానిని మనం ప్రసాదంలా తీసుకుంటాం. ఆ రోజు ఏ రుచి మన నోటికి ముందుగా తగులుతుందో దాని మీదే ఆ సంవత్సర ఫలితం ఆధారపడి ఉంటుందని చాలామంది నమ్మకం. అలాగే ఉగాది నాటి మరో ప్రత్యేకత పంచాంగ శ్రవణం. పండితులు చదివి, వివరించే పన్నెండు రాసుల శుభా-అశుభ ఫలితాలు విని వారి ఆశీర్వాదం తీసుకుంటాం. ఇలా సాగిపోయే ఉగాది అందరిలో ఏదో తెలియని నవచైతన్యం తెచ్చిపెడుతుంది. మన ఉగాది ఇలా సాగుతుంది కదా మరి మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు, వాళ్ళ కొత్త సంవత్సరానికి ఎప్పుడు ఇంకా  ఎలా స్వాగతం  చెపుతారో కూడా చూద్దామా.

 


పుతండు - ఈ తమిళ కొత్త సంవత్సరం ప్రతి ఏట సుమారు ఏప్రిల్ నెల మధ్యలో వస్తూ ఉంటుంది. తమిళ పంచాంగం ప్రకారం చైత్ర మాసం మొదటిరోజున జరుపుకునే ఈ పండగకీ, మన ఉగాదికి కొన్ని రోజులే తేడా ఉంటుంది. మిగిలిన తతంగం మొత్తం మన లాగానే ఉంటుంది. మామిడి, వేప పువ్వు, బెల్లంతో కలిపిన పచ్చడినే వాళ్ళు నైవేద్యం పెట్టి ప్రసాదంలా తీసుకుంటారు.

 


బైసాఖి - పంజాబీలు తమ కొత్త సంవత్సరాన్ని కొత్త పంటల దిగుబడి వచ్చిందన్న ఆనందంతో జరుపుకుంటారు. పంటలు చేతికి రాగానే ఆ ఉత్సాహాన్ని వాళ్ళు తమ ఆటపాటలలో చూపిస్తారు. సాధారణంగా ఇది ఏప్రిల్ పదమూడున గాని లేదా పద్నాలుగునగాని వస్తుంది. బైసాఖి పర్వదినం రోజు సిక్కులందరూ  గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి ఖాల్సా పుట్టిన ప్రదేశంలోనే ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటారు. బాంగ్రా నృత్యంతో తమ ఆనందాన్ని చాటుకుంటారు.

 

పొహేల బైషాఖ్ - బెంగాలీలు ఘనంగా జరుపుకునే ఈ కొత్త సంవత్సరాదిని నబో బర్షొ అని కూడా అంటారు. వ్యాపారంలో తమ ఖాతాలకు మార్చిలో ముగించి ఈ పండగ రోజు నుంచి కొత్త ఖాతాలను మొదలుపెడతారు. ఈ రోజున  చద్ది అన్నంలో పచ్చడులు, ఎండు చేపల కూర మొదలయినవి వేసుకుని తినటం వాళ్ళ ఆచారం. ఈ పండగ నుంచి వాళ్ళకి పెళ్లి ముహూర్తాలు మొదలవుతాయి. త్రిపురలో ఉన్న కొండజాతులవాళ్ళు కూడా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

 

బొహాగ్ బిహు - అస్సాం ప్రజలు కొత్త పంటలు వేయటంతో వాళ్ళ కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఏప్రిల్ మొదట్లో వచ్చే ఈ పండగపూట ప్రజలు తమ సంప్రదాయ నృత్యాన్ని చేస్తూ నూతన శకానికి స్వాగతం పలుకుతారు. అస్సాం ప్రజలు మొత్తం మూడు బిహు పండగలను జరుపుకుంటారు. ఒకటి బిహోగ్ బిహు అయితే మరో రెండు మాఘ్ బిహు, కాటి బిహు.  ఎవరు ఏ పేర్లు పెట్టుకున్నా అందరి ఉద్దేశం కొత్త తరహా జీవితానికి స్వాగతం పలకటమే.

 

బెస్తూ వారస్ - గుజరాతీయులు, ఇంకా రాజస్థానీ మార్వాడీలు తమ  కొత్త సంవత్సరాన్ని దీపావళి మరునాడు జరుపుకుంటారు. ఎలాంటి శుభకార్యాలు జరుపుకోవాలన్నా ఈ రోజు తర్వాతే మొదలుపెడతారు. ఇల్లంతా శుభ్రం చేసుకుని ఎక్కడా చిన్న బూజు గాని, చెత్త గాని లేకుండా చూసుకుని అప్పుడు దేవుడికి పూజ మొదలుపెడతారు.

 

 

విషు - ఈ మలయాళీల కొత్త సంవత్సరం మనం జరుపుకునే రోజే జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు వాళ్ళకి అతి ముఖ్యమైనది విశుక్కణి అనే పద్ధతి. దీని ప్రకారం ఉదయం లేవగానే దేన్నీ చూస్తారో ఆ ఏడాది మొత్తం దానికి తగ్గ ఫలితమే వాళ్ళకి లభిస్తుందట. అందుకే ముందు రోజు రాత్రే పూజగదిలో పూజ చేసి దేముని విగ్రహాలు, వెండి, బంగారం, పువ్వులు, పళ్ళు, పట్టు వస్త్రాలు, కూరగాయలు మొదలయినవి సిద్దంగా ఉంచుతారు. మరునాడు ఉదయం లేవగానే కళ్ళు తెరిచి మొదటగా ఏ వస్తువు చూస్తారో దాన్నిబట్టి వాళ్ళ జాతక ఫలితం ఆ ఉంటుందిట.

 

గుడి పడ్వ్ - మరాఠీలు తమ  కొత్తసంవత్సరాన్ని  చైత్ర మాసంలోని మొదటిరోజున జరుపుకుంటారు. వీరి ఆచారం ప్రకారం ఇంటి ముఖద్వారానికి కుడి వైపు ఒక వెదురుకర్రని ఉంచి దానికి పసుపు బట్ట కట్టి పైన రాగి చెంబు పెట్టి, పంచదార చిలకల దండతో అలంకరించి దాన్ని పూజిస్తారు. దానిని  గుడి అంటారు వాళ్ళు. ఇది వాళ్ళకి ఎంతో శుభసూచకం.

 

ఇలా ప్రాంతాలు వేరైనా, ఆచారాలు వేరైనా, కొత్తసంవత్సరాన్ని ఆహ్వానించే తీరు వేరైనా అందరి మనసులో మెదిలే కోరిక మాత్రం ఒక్కటే. మనం బాగుండాలి మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి అని. మంచి మనసుతో కోరుకునే ఎలాంటి కోరికైనా నెరవేరక మానదు కదా. సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకుందాం.

..కళ్యాణి


More Ugadi