సూర్యుడూ చంద్రుడూ ఆ వేంకటేశ్వరుడే!

 

బ్రహ్మోత్సవాలలోని ఏడవ రోజున జరిగే వాహనసేవలలో వేంకటేశ్వర స్వామివారు... ఉదయం సూర్యప్రభ వాహనం మీదా, సాయంవేళలలో చంద్రప్రభ వాహనం మీదా ఊరేగుతున్నారు.


సూర్య భగవానుని ఏడు గుర్రాలు పూనిన రథం, ఆకాశంలో నడిపిస్తూ ఉంటుందని అంటారు. ఆ ఏడు గుర్రాలనీ ఏడు రోజులకూ, వెలుగులో ఉండే సప్తవర్ణాలకూ గుర్తుగా భావిస్తారు. అందుకే ఏడో సంఖ్యని సూర్యునికి ప్రతీక అని చెబుతారు. బహుశా అందుకేనేమో బ్రహ్మోత్సవాలలో ‘7’వ రోజున స్వామివారిని సూర్యవాహనం మీద ఊరేగిస్తారు. కానీ స్వామివారు దివారాత్రులు రెంటికీ అధిపతి కదా! ఆ విషయాన్ని సూచించేందుకే రాత్రివేళ చంద్రవాహనం మీద కూడా స్వామి ఊరేగుతారు.
సూర్యప్రభవాహనం మీద ఊరేగే సమయంలో స్వామిని ఎర్రటి పూలని ధరించి ఉంటారు. సూర్యుని రథసారధి అయిన అనూరుడు ఆయన వాహనాన్ని నడుపుతాడు. అనూరుడు అంటే ఊరువులు (తొడలు) లేనివాడు అని అర్థం. అనూరుని తల్లి వినత, త్వరపడి అతనికి జన్మనిచ్చే ప్రయత్నం చేయడంతో ఇంకా శరీరదిగువభాగం ఏర్పడకుండానే అతను జన్మిస్తాడు. ఆ అనూరుడిని సూర్యుడు, అతని సోదరుడు గరుత్మంతుని విష్ణుమూర్తి వాహనాలుగా స్వీకరిస్తారు. అంటే ఈ రోజున తన వాహనమైన గరుత్మంతుని సోదరుని సేవను కూడా పొందుతారన్నమాట.


ఏడోరోజు సాయంవేళ, స్వామి చంద్రప్రభ వాహనం మీద తెల్లటి పూలు, దుస్తులు ధరించి దర్శనమిస్తారు. సూర్యుడు ఆరోగ్యానికీ, జ్ఞానానికీ సూచన అయితే... చంద్రుడు ఆహ్లాదానికీ, సృజనకూ చిహ్నం. జీవితం పరిపూర్ణంగా ఉండాలంటే ఈ రెండు రకాల లక్షణాలూ ఉండాల్సిందే! స్వామి అనుగ్రహంతో జీవితాన్ని సుసంపన్నం చేసే లక్షణాలన్నీ మనకి లభిస్తాయని ఈ రోజు సేవలు తెలియచేస్తాయి.


అంతేకాదు! సూర్యుడు పగటివేళ చేసే కర్మలకూ, చంద్రుడు చీకటివేళ చేసే క్రియలకూ సాక్షి! ఇక వారిని నడిపించే స్వామి సంగతి చెప్పేదేముంది. ఏ వేళలోనైనా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా... మన ఏ ఒక్క కదలికా స్వామి దృష్టి నుంచి తప్పించుకోజాలదు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సదా సత్ప్రవర్తనతో మెలుగుతూ... అన్ని పనులనూ, ఆ పనుల ఫలితాలనూ ఆ స్వామికి నివేదిస్తూ సాగే జీవితమే ఓ బ్రహ్మోత్సవం!

 

- నిర్జర.


More Tirumala Brahmotsavam