శెట్టిహళ్లి చర్చ్- నీటిలో మునిగినా తగ్గని వైభవం

 

 

భగవంతుని కొలుచుకునేందుకు ఒక స్థానం ఏర్పరుచుకుంటాం. కానీ సర్వవ్యాపి అయిన దేవునికి ఒక చోటంటూ ఏముంటుంది. ఈ భూమండలమంతా ఆయనదే! నీట మునిగినా.. నింగిలో ఎగిసినా ఆయనకు వచ్చే లోటేమీ లేదు. అందుకు ఓ గొప్ప ఉదాహరణ శెట్టిహళ్లి చర్చ్!

బెంగళూరుకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో హసన్ పట్నానికి దగ్గరగా ఉన్న ఓ గ్రామమే శెట్టిహళ్లి. ఈ గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అటు ఫ్రెంచివారు, ఇటు బ్రిటిష్వారు ఇక్కడ నివసించిన ఆనవాళ్లు ఉన్నాయి. అలాంటి ఒకానొక సమయంలో ఇక్కడ ఒక చర్చని నిర్మించుకున్నారు. 1860లో ఆ చర్చిని భారీగా పునర్నిర్మించారు. శెట్టిహళ్లి గ్రామస్తులతో పాటుగా దూరదూరాల నుంచి భక్తులను ఆకర్షించేంత అద్భుతంగా ఆ చర్చిని నిర్మించారు.

 

1960 ప్రాంతంలో శెట్టిహళ్లి గ్రామానికి సమీపంలోని హేమవతి నది మీద రిజర్వాయర్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రిజర్వాయర్ కనుక నిర్మిస్తే శెట్టిహళ్లి గ్రామం మునిగిపోతుందని తేలింది. ఇక తప్పనిసరి పరిస్థితులలో అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1979లో రిజర్వాయర్ పూర్తికావడంతో... శెట్టిహళ్లి నీటిలో మునిగిపోయింది. దాంతోపాటుగానే అక్కడి చర్చి కూడా మునిగిపోయింది!

శెట్టిహళ్లి నీటిలో మునిగినా, బ్రహ్మాండమైన చర్చి శిఖరం మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. నీటి లోతుని బట్టి గోడలు కూడా కొంతమేరకు కనిపిస్తాయి. ఇలా నీటిలో సగం సగం మునిగిన గోడలను చూడటం ఓ గొప్ప అనుభూతి అంటారు భక్తులు. దాంతో అటు భక్తులు, ఇటు పర్యటకులు కూడా ఇక్కడి చర్చని చూసేందుకు విశేషంగా వస్తుంటారు. చిన్న చిన్న పడవులలో చర్చి వరకూ వెళ్లి దాని చుట్టూ తిరిగి వస్తుంటారు.

 

ఇక ఎండాకాలమైతే నీరు పూర్తిగా వెనక్కి తగ్గిపోయి, చర్చిలోకి అడుగుపెట్టే అవకాశం వస్తుంది. ఈ చర్చిని పాతకాలపు పద్ధతులలో సున్నం, బెల్లం, కోడిగుడ్లతో కలిపి నిర్మించారని చెబుతారు. అందుకే దాదాపు 40 ఏళ్లుగా నీట మునిగి ఉన్నా కూడా ఈ భవనం చెక్కుచెదరకుండా కనిపిస్తుంది. లోపల శిలువ ఉన్న ప్రదేశాన్ని కూడా భక్తులు చేరుకుని ప్రార్థనలు చేయవచ్చు. అందుకే ఎండాకాలం వచ్చిందంటే చాలు... వందలాది మంది పర్యాటకులు, భక్తులు సమీప ప్రాంతాల నుంచి ఇక్కడకు చేరుకుంటారు.

- నిర్జర.

 

 


More Purana Patralu - Mythological Stories